ఒక్కచోటా అవకాశం లేదు
మాజీ ఎమ్మెల్యే వేమాకు అవమానం
సొమ్ములు లేవని పక్కనబెట్టిన వైనం
సాక్షి, అమలాపురం: ‘రేవు దాటే ముందు రేవు మల్లన్న.. రేవు దాటాకా బోడి మల్లన్న’ అన్న చందాన ఉంది ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీరు. బీజేపీ, జనసేనలతో పొత్తు కుదిరే వరకు కాళ్లు అరిగేలా తిరిగిన చంద్రబాబు పొత్తు కుదిరిన తర్వాత ఆ రెండు పార్టీలను ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు. బీజేపీ, జనసేన పార్టీలకు ఎంతో కొంత బలంగా ఉన్న నియోజకవర్గాల్ని కాకుండా టీడీపీకి బలం లేని చోట సీట్లు కేటాయిస్తూ చంద్రబాబు రాజకీయ డ్రామాకు తెరతీశారు. దీనిలో భాగంగానే కోనసీమ నుంచి బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆ పార్టీ ఉనికినే ఎగతాళి చేసినట్టు అయ్యింది.
జిల్లాలో ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. టీడీపీ పార్లమెంటు స్థానంతో పాటు మండపేట, కొత్తపేట, రామచంద్రపురం, ముమ్మిడివరం జనరల్ స్థానాలతో పాటు అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిత్ర పక్షమైన జనసేన రాజోలు, పి.గన్నవరం ఎస్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నది. దీనిలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను శనివారం సాయంత్రం ప్రకటించింది. రాజోలు నియోజకవర్గం నుంచి తమ పార్టీ పోటీలో ఉంటోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించి నెల రోజులు కావస్తున్న ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. రాజోలు నుంచి సీటు ఆశిస్తున్న దేవ వరప్రసాద్ తానే అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
మరో మిత్రపక్షమైన బీజేపీకి మాత్రం పార్లమెంటుకు గాని, అసెంబ్లీకి గాని అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులలో భాగంగా నగరం (పి.గన్నవరం)లో బీజేపీ పోటీ చేసింది. 1999 ఎన్నికలలో ఇక్కడ నుంచి ఆ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు మానేపల్లి అయ్యాజీ వేమా పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా పులపర్తి నారాయణమూర్తి పోటీ చేయడంతో వేమా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అప్పటి నుంచి వేమా పార్టీలోనే ఉన్నారు. అమలాపురం పార్లమెంట్, పి.గన్నవరం అసెంబ్లీ నుంచి అభ్యర్థిగా పలుసార్లు బరిలో నిలిచారు.
టీడీపీ, బీజేపీ, జనసేనలో కూటమిగా ఏర్పడడంతో పి.గన్నవరం నుంచి పోటీ చేయాలని బీజేపీ ఆశించింది. వేమాను అభ్యర్థిగా నిలబెట్టాలని జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశించారు. సీటు విషయమై అగ్రనాయకత్వంపై వత్తిడి తెచ్చారు. బీజేపీతో పొత్తు కుదరకముందే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా సరిపల్లి రాజేష్ కుమార్ (మహాసేన రాజేష్)ను ఎంపిక చేసింది. అయితే అతని అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పోటీ నుంచి వెనుకడుగు వేశారు. దీనితో ఈ సీటును తమకు ఇవ్వాలని బీజేపీ పట్టుబట్టింది. గతంలో ఇక్కడ గెలిచిన అనుభవం, పార్టీకి చేసిన సేవల దృష్ట్యా వేమాకు అవకాశం వస్తోందని క్యాడర్ ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సీటులో జనసేన నుంచి అభ్యర్థిని నిలపాలని చెప్పడం ద్వారా చంద్రబాబు వారి మధ్య పొరపొచ్చాలు వచ్చేలా చేశారు. చంద్రబాబు తీరుకు తోడు సీనియర్ నేత వేమా విషయంలో పార్టీ పెద్దలలోని ఒక వర్గం సహాయ నిరాకరణ చేయడం వల్ల కూడా సీటు రాలేదని ఆయన అభిమానులు వాపోతున్నారు.
ఆర్థికంగా స్థితిమంతుడు కాదనే..
వేమాకు పి.గన్నవరంలో మంచి పలుకుబడి ఉన్నా ఆర్థికంగా స్థితిమంతుడు కాదనే ఆయనను పక్కనెబట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది తెలుసుకున్న వేమా వర్గం ఎన్నికలకు అవసరమైన ఆర్థిక వనరులు చూపించేందుకు సైతం సిద్ధమైంది. కాని వేమా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వర్గం విశ్రాంత ఐఆర్‌ఎస్ ఉద్యోగి టీఎస్‌ఎన్ మూర్తికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఆయనను ప్రోత్సహించారు. కనీసం పార్టీ సభ్యత్వం తీసుకోకున్నా మూర్తికి ఒకానొక సందర్భంలో టిక్కెట్ ఖరారైనట్టు ప్రచారం జరిగింది.
చివరకు ఈ సీటు నుంచి జననసే తమ అభ్యర్థిని నిలిపింది. ఈ పరిణామాలు బీజేపీకి మింగుడుపడని అంశంగా మారాయి. ‘టీడీపీ ఇచ్చింది ఆరు పార్లమెంట్ స్థానాలు. వీటిలో ఒకటిరెండు గెలిస్తే గొప్ప. కేంద్రంలో మాకు మెజార్టీ వస్తోందని తెలిసి కూడా పార్టీ అధిష్టానం చంద్రబాబుతో రెండు సీట్ల కోసం ఎందుకు పొత్తు పెట్టుకుందో అర్థం కావడం లేదు. రెండుసార్లు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన వారితో పొత్తు ఏమిటి చెప్పండి. మా నెత్తిన శని ఉండి ఇలా జరిగింది’ అని బీజేపీ జిల్లా స్థాయి నేత ఒకరు సాక్షి వద్ద వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment