ఆక్వా జోన్‌లో చెరువుల విస్తీర్ణంపై సర్వే
అమలాపురం రూరల్: సముద్ర తీర ప్రాంతంలోని ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో చెరువుల విస్తీర్ణంపై సర్వే చేసి, నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం కలెక్టరేట్‌లో కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ జలశాఖ, మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్య, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సర్వే బృందాలను ఏర్పాటు చేసి, ఆక్వా సాగు విస్తీర్ణంపై నివేదిక అందజేయాలన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న 46 వేల ఎకరాలకు, ఆక్వా జోన్‌లో లేని ఏడు వేల ఎకరాలకు గ్రామ, మండల, డివిజన్ వారీగా ఆక్వాజోనేషన్ టైపును నిర్ధారించాలన్నారు. నూతనంగా వెలువడిన జీవో ఎంఎస్ నంబర్ 7 ప్రకారం ఆక్వా చెరువుల అనుమతులను మంజూరు చేయాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూత్రాల ప్రకారం పెద్ద ఆక్వా చెరువులకు చుట్టూ సీపేజ్ డ్రెయిన్లు, గార్ల్యాండ్ డ్రైయిన్లు ద్వారా ఊట నీరు పారే సౌకర్యం ఉన్నదీ, లేనిదీ పరిశీలించాలన్నారు. సబ్ డివిజనల్ స్థాయి కమిటీ పరిధిలో సంబంధిత డివిజనల్ రెవెన్యూ అధికారి.. ఐదు హెక్టార్ల లోపు చెరువులకు అనుమతులు మంజూరు చేయాలని, దానికి పైబడితే కోస్టల్ ఆక్వా అథారిటీ విభాగానికి పంపాలన్నారు. హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా సాగులో ఉన్న చెరువుల రద్దుకు సంబంధించి వైనతేయి నదిని ఆనుకొని ఉన్న గొల్లపాలెం, కరవాక, గోగన్నమఠంలో కొనసాగుతున్న రద్దు చర్య లు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జేసీ టి.నిశాంతి, ఇన్‌చార్జి డీఆర్‌ఓ కె.మాధవి, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ శంకర్రావు, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, భూగర్భ జలశాఖ సహాయ సంచాలకులు శివప్రసాద్, మత్స్య అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment