డివిజన్ కేంద్రాల్లో నేడు ఎస్‌ఎంసీ శిక్షణ
రాయవరం: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ డీఆర్పీలకు ఆదివారం ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని డీఈఓ డాక్టర్ షేక్ సలీం బాషా ఆదేశాలిచ్చారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలో 25 మంది డీఆర్పీలకు మండల విద్యాశాఖ సమావేశ భవనంలో, అమలాపురం డివిజన్ పరిధిలో 50 మందికి అమలాపురం ఎంపీడీఓ సమావేశ భవనం, కొత్తపేట డివిజన్‌లో 35 మంది డీఆర్పీలకు కొత్తపేట ఎంపీడీఓ కార్యాలయ సమావేశ భవనంలో ఓరియంటేషన్ జరగనుంది. ఈ ప్రోగ్రామ్‌కు కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి బీవీవీ సుబ్రహ్మణ్యం జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు ఎస్‌ఎంసీ చైర్మన్లు, ముగ్గురు ఉపాధ్యాయులు డీఆర్పీలుగా వ్యవహరిస్తారు. ఒక రోజు ఓరియంటేషన్ అనంతరం శిక్షణ పొందిన డీఆర్పీలు మండల స్థాయిలో జనవరి 2, 3 తేదీల్లో మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి ప్రతి పాఠశాల నుంచి ఒక హెచ్‌ఎం, ఎస్‌ఎంసీ చైర్మన్ హాజరు కానున్నారు.
4న జిల్లా స్థాయి
విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు
అమలాపురం రూరల్: పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనవరి 4న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ షేక్ సలీమ్ బాషా ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం మండల స్థాయిలో విద్యా వైజ్ఞానిక పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయి పోటీలకు 22 మండలాల నుంచి మండలానికి ఐదు ప్రాజెక్ట్‌ల చొప్పున 110 ప్రాజెక్ట్‌లను ఎంపిక చేస్తామన్నారు. జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, కమిటీ కన్వీనర్, డీఈఓ బాషా, డీవైఈఓ గుబ్బల సూర్యప్రకాశం, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో క్విజ్ ఫెయిర్ ప్రదర్శన, బుక్ ఫెయిర్ ప్రదర్శన, సైన్స్ రంగవల్లుల ప్రదర్శన, సైన్స్ తోలుబొమ్మల ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. వీటిపై సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం సెల్‌ఫోన్ నంబర్ 96401 88525కు చేసి నివృత్తి చేసుకోవాలని డీఈఓ విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులకు మధ్యంతర
భృతి ప్రకటించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పోతంశెట్టి డిమాండ్
అమలాపురం టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, పాత పీఆర్సీ బకాయిలను చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు డిమాండ్ చేశారు. స్థానిక మద్దాలవారిపేటలో ఆదివారం జరిగిన అమలాపురం పట్టణ ఎస్టీయూ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు నిల్వలో ఉన్న పీఎఫ్ సొమ్మును వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఎస్టీయూ పట్టణ అధ్యక్షుడు ఎన్.బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ పళ్లంరాజు, జిల్లా నాయకులు ఎన్.సత్యనారాయణ, ఆర్‌ఆర్‌కే ప్రసాద్, ఎంఎస్‌ఎన్ మూర్తి, మొయిద్దీన్. కె.సౌజన్య తదితరులు ప్రసంగించారు.
కౌలురైతు ఆత్మహత్య
మలికిపురం: మట్టపర్రు గ్రామంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన కౌలురైతు తాడి రాంబాబు (53) శనివారం మృతి చెందాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సురేష్ చెప్పారు. అయితే, రాంబాబు స్థానికంగా సుమారు ఐదెకరాలు సాగు చేసి అప్పుల పాలై, శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామానికి చెందిన సరిహద్దు రైతు తాడి నరసింహారావు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment