విద్యార్థులకు ‘ఆప్తా’ స్కాలర్‌షిప్‌లు
అమలాపురం టౌన్: అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) స్టూడెంట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లోని సుమారు 400 మంది విద్యార్థులకు రూ.2.50 కోట్లతో స్కాలర్ షిప్‌లు సమకూర్చింది. ఈ స్కాలర్ షిప్‌ల పంపిణీని అమలాపురంలోని డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కాపు కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆప్తా సంస్థ ప్రారంభించింది. దీనికోసం ఆప్తా అధ్యక్షుడు ముద్రగడ త్రినాథ్ ఆధ్వర్యంలో అమెరికా నుంచి ఆ అసోసియేషన్‌కు చెందిన 15 మందితో కూడిన బృందం అమలాపురం వచ్చి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందజేసింది. నల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా పవన్‌కుమార్ నిర్వహణలో సభ జరిగింది. ఆప్తా ప్రతినిధులుగా ఆమెరికా నుంచి వి.లక్ష్మీకాంతం, గోపాల్ గూడపాటి, బోగాది రితీస్, పసుపులేని గీతా కిషోర్, మంచిగంటి లక్ష్మీదీప్తి తదితరులు హాజరయ్యారు. ఆప్తా అమెరికా దేశం వేదికగా మన తెలుగు వారు ఎక్కడున్నా పలు రూపాల్లో సేవ చేస్తూ ఉంటామని ఆ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్లా విష్ణుమూర్తి, కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, ఏఎస్‌పీ నల్లా సూర్య చంద్రరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అధికారి వెంకట జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment