అన్నదాతకు యంత్రలాభం
● స్ట్రా బేలర్‌తో సులువుగా ఎండుగడ్డి సేకరణ
● క్రమంగా తీరుతున్న పశుగ్రాసం కొరత
ఆలమూరు: వ్యవసాయంలో వరి కోత యంత్రాల వాడడంతో పశుగ్రాసానికి ఉపయోగించే ఎండుగడ్డి నిరుపయోగంగా మారుతోంది. దీనివల్ల పాడిరైతులను ఎండి గడ్డి కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనిని నివారించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విరివిగా స్ట్రా బేలర్ యంత్రాలను రాయితీపై అందించింది. అప్పటి వరకూ రైతులు ఇతర జిల్లాల నుంచి స్ట్రాబేలర్ యంత్రాలను తీసుకువచ్చి ఎండుగడ్డిని సేకరించేవారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో స్థానికంగా లభ్యమయ్యే స్ట్రాబేలర్ యంత్రాల సాయంతో ఎండుగడ్డిని సేకరిస్తున్నారు. ట్రాక్టర్‌కు దమ్ము చక్రాలు అమర్చినట్టుగానే స్ట్రాబేలర్ యంత్రాన్ని వినియోగించి గడ్డి సేకరణ జరుపుతుండటం వల్ల ఇటు రైతులకు, అటు కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉంటోంది. గతంలో స్థానికంగా ఉండే పాడి రైతులు ఒకవేళ గడ్డిని సేకరిద్దామనుకున్నా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండటం వల్ల యంత్రంతో కోసిన వరిగడ్డిని పొలంలోనే వదిలేసి నిప్పు పెట్టేవారు. దీంతో ఎండుగడ్డి కొరత ఎక్కువై ఏటా ధర పెరుగుతూ వస్తోంది. మరి కొంతమంది రైతులు పెట్టుబడి ఎక్కువైనా కూలీలతో కోయించి వరిగడ్డిని భద్రపరచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో గోసంరక్షణ కేంద్రాలకు, డెయిరీఫాంలకు, పేపర్ మిల్లులకు ఎండుగడ్డి సేకరణ కష్టంగా మారింది. దీంతో వారంతా స్ట్రాబేలర్ యంత్రాలను తీసుకువచ్చి ట్రాక్టర్ సాయంతో పొలాల్లో వ్యర్థంగా పడి ఉన్న ఎండుగడ్డిని సేకరించి తీసుకువెళుతున్నారు. తమ పొలాల్లో లభ్యమయ్యే ఎండుగడ్డికి అధిక ధర లభ్యం కావడంతో అనేకమంది రైతులు సమీప పేపరుమిల్లులకు విక్రయాలు జరుపుతున్నారు, దీనివల్ల స్థానికంగా లభ్యమయ్యే ఎండుగడ్డికి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో పాడి రైతులను తరచూ ఎండు గడ్డి కొరత వేధిస్తోంది. ఈ స్ట్రాబేలర్ యంత్రాల పనితీరును గుర్తించిన స్థానిక రైతులు రాయితీపై గతంలో మాదిరిగా ఇవ్వాలని వ్యవసాయశాఖకు విజ్ఞాపనలు చేస్తున్నారు.
కాలుష్యాన్ని నివారించవచ్చు
వరి చేలల్లో పండించిన పంటను తీసుకుని అందులో వదిలేసిన గడ్డిని తగులబెట్టకుండా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పశుగ్రాసం కొరత తీరుతుంది. గడ్డిని తగులబెట్టడం వల్ల కలిగే అగ్ని ప్రమాదాలను అరికట్టవచ్చు.
– కె.నాగేశ్వరరరావు, వ్యవసాయశాఖ ఏడీ,
ఆలమూరు
ఎండు గడ్డి కొరత తీరనుంది
ట్రాక్టర్‌కు వెనుక భాగాన స్ట్రాబేలర్ యంత్రాన్ని అనుసంధానం చేసి గడ్డిని సేకరించడం వల్ల పశుగ్రాసం కొరత నుంచి ఉపశమనం కలుగుతుంది. ట్రాక్టర్ యజమానులకు ఈ యంత్రాన్ని రాయితీపై ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
– ఆకుల రామకృష్ణ పాడి రైతు, మోదుకూరు
అందుబాటులోకి రావాలని ఆకాంక్ష
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 1.68 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా అందులో 3.38 లక్షల టన్నుల ఎండు గడ్డి లభించవలసి ఉంది. అయితే 90 శాతం మేర వరికోత యంత్రాల సాయంతోనే రైతులు మాసూళ్లు చేయడంతో కేవలం 2.5 లక్షల టన్నుల ఎండుగడ్డి మాత్రమే లభిస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతంలో మాదిరిగా పొలాల్లోని గడ్డిని తగులబెట్టకుండా కొంతమంది రైతులు మాత్రం స్ట్రాబేలర్ యంత్రాన్ని వినియోగించుకుని గడ్డిని సేకరించుకుంటున్నారు. స్ట్రాబేలర్ యంత్రంతో సేకరిస్తే ఎకరాకు దాదాపు రెండు టన్నుల గడ్డి లభిస్తుంది. స్ట్రాబేలర్ యంత్రం 20 కేజీల చొప్పున మూట కట్టిన గడ్డిమోపులను పొలంలోనే పడవేస్తుంది. ఎకరాకు సుమారు 90 నుంచి 105 వరకూ గడ్డి మోపులు లభిస్తున్నాయి. తమ పొలాల్లో సేకరించే ఎండుగడ్డిని మోపుల రూపంలో గడ్డిమేట్లు వేసుకుని పశువుల దాణాగా అందించే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇతర పాడి రైతులు ఒక్కొక్క గడ్డిమోపునకు రూ.30 చొప్పున ధర రైతుకు చెల్లించి తీసుకువెళుతున్నారు. వరికోత యంత్రాల మాదిరిగానే స్ట్రాబేలర్ యంత్రాలు విరివిగా అందుబాటులోకి రావాలని పాడి రైతులు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment