అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: మార్గశిర మాసం.. అమావాస్య ముందు శని త్రయోదశి పర్వదినం కావడంతో శనివారం అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వందలాదిగా భక్తులు తరలివచ్చి, ఆలయ ప్రాంగణం చుట్టూ క్యూలైన్‌లో వేచి ఉండి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. వందలాదిగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. దాతల ఆర్థిక సాయంతో 8 వేల మందికి అన్న సమారాధన నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి శనివారం భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, ఉచితంగా ప్రసాదాలు కూడా పంపిణీ చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఆలయంలో కొత్తగా ప్రారంభించిన స్వామి వారి పుష్పాలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం వంటి కార్యక్రమాలకు భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని చెప్పారు.
4న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక శ్రీ సత్యసాయి గురుకులంలో వచ్చే నెల 4న జిల్లా స్థాయి దక్షిణ భారత విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఎస్‌ఐఎస్‌ఎఫ్) నిర్వహించనున్నారు. జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కంది వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం) సహకారంతో నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఫెయిర్‌ను ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్నామన్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, ఎర్త్, స్పేస్ సైన్స్, పర్యావరణ శాస్త్రం, ఇంజినీరింగ్, బయోసైన్స్/బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అంశాలపై ఈ ప్రదర్శన జరుగుతుందని వివరించారు. వ్యక్తిగత విభాగంలో ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు, గ్రూప్ కేటగిరీలో ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, టీచర్ కేటగిరీలో ఒక టీచర్ మాత్రమే పాల్గొనాలని సూచించారు. ఈవిధంగా పాఠశాల, మండల స్థాయిల్లో పోటీలు నిర్వహించాలని, మండల స్థాయి ఉత్తమ ప్రాజెక్టులను జిల్లా సైన్స్ ఫెయిర్‌కు పంపాలని తెలిపారు. ప్రాజెక్టు నమూనాలు, సమకాలీన సమాజ సమస్యలకు పరిష్కారం చూపేలా, నూతనత్వంతో, తార్కికంగా ఆలోచింపజేసే వర్కింగ్ మోడల్స్ మాత్రమే ప్రదర్శించాలని స్పష్టం చేశారు. థర్మకోల్‌తో ఎటువంటి మోడల్స్ తయారు చేయవద్దని సైన్స్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్‌ఎస్ నెహ్రూను సంప్రదించాలని వాసుదేవరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment