గత ప్రభుత్వంలో వేగంగా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పథకంలో గృహనిర్మాణాలు వేగంగా సాగాయి. ఇంటి పట్టాలు మంజూరు చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కావడం.. ఆ ప్రక్రియ నిరంతరాయంగా సాగడంతో జిల్లాలో గృహ నిర్మాణ పనులు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాయి. దీనికి తోడు సకాలంలో బిల్లులు రావడంతో లబ్ధిదారులు త్వరితగతిన పనులు చేపట్టారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు మూడు రకాల ఆప్షన్లు ఇచ్చారు. వారి అభీష్టం మేరకే నిర్మించుకునే అవకాశం కల్పించారు. పనులకు అవసరమైన సిమెంట్, ఇసుక, స్టీల్ అతి తక్కువ ధరకే గృహ నిర్మాణ శాఖ ద్వారా అందజేశారు. ఒక్కో ఇంటికి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణం సైతం మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 25,316 గృహాలు అన్ని హంగులతో పూర్తయ్యాయి.
సాక్షి, రాజమహేంద్రవరం: పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం ఛిద్రం చేసే దిశగా అడుగులు వేస్తోందా? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఉన్న అక్కసుతో నిరుపేదలకు అన్యాయం చేస్తోందా? గృహ నిర్మాణాలు ప్రారంభించలేదన్న నెపంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాల పట్టాలు రద్దు చేసేందుకు పావులు కదుపుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. స్థలం మంజూరై పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పేదల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రారంభం కాని గృహ నిర్మాణ పనులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు తిగుతుండటం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న లబ్ధిదారుల్లో ఉత్పన్నమవుతోంది. పనులు పూర్తయి పేదలు తమ సొంత ఇళ్లలోకి వెళితే.. గత ప్రభుత్వానికి పేరు వస్తుందని భావిస్తున్న కూటమి సర్కారు ఇలాంటి చర్యలకు దిగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 3,128 పట్టాలు రద్దు?
పట్టాలు పొంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా 3,128 మంది పట్టాలు తొలగించనుంది. వీరందరూ సొంతింటి కలకు దూరం కానున్నారు. తమకు ప్రభుత్వం స్థలం మంజూరు చేసిందన్న వారి సంతోషం ఆవిరి కానుంది. తమకు స్థలం ఉందని, రూ.5 లక్షలకు పైగా ఆస్తి ఉందన్న భరోసాతో తమ పిల్లల చదువులు, పెళ్లిలకు కొందరు అప్పులు చేశారు. ప్రస్తుతం అది తమ చేజారిపోతోందన్న ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం చేసిన తప్పులకు తాము బలికాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. గృహ నిర్మాణాలకు పూర్తిగా సహకరించకుండా పనులు ఎలా ప్రారంభించాలంటూ ప్రశ్నిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక నత్తనడక
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గృహ నిర్మాణాలకు నత్తకు మేనత్తను తలపిస్తున్నాయి. పక్కా ఇళ్లకు మార్చి నెల తర్వాత కేంద్రం నిధులు నిలిపివేస్తుందని, అప్పటిలోగా పూర్తి చేసుకోవాలని టార్గెట్ పెట్టారు. లక్ష్యాలు సైతం నిర్దేశించిన ప్రభుత్వం సాధనకు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. ఆరు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులపై దృష్టి సారించకపోవడంతో పురోగతి పడకేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెరసి ఎక్కడి నిర్మాణ పనులు అక్కడే నిలిచిపోయాయి. కాలనీలు పిచ్చిమొక్కలతో నిండుతున్నాయి.
ఫలించని వంద రోజుల ప్రణాళిక
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 4,875 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వీటిని గతేడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని భావించారు. అనుకున్న సమయానికి కేవలం 331 మాత్రమే పూర్తి చేశారు. ఇంకా పూర్తి చేయాల్సిన 4,544 ఇళ్లు ఈ ఏడాది సంక్రాంతికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకుని విఫలమయ్యారు.
ప్రస్తుతం ఇలా..
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 431 లేఅవుట్లలో 65,075 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో 47,053 ఇళ్లు, ప్రైవేటు స్థలాల్లో 18,022 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికారు. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది డిసెంబర్ నెలాఖరు వరకు పురోగతి పరిశీలిస్తే.. 26,359 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 17,965 పురోగతిలో ఉన్నాయి. పునాది ప్రారంభ దశలో 17,623, బేస్‌మెంట్ లెవల్‌లో 6,485, లింటల్ లెవెల్ 2,087, రూఫ్ లెవెల్ 1,289, పైకప్పు స్థాయిలో 1,584 ఉన్నాయి. ఇంకా ప్రారంభం కానివి 25 వేలకు వరకు ఉన్నాయి. గత ప్రభుత్వం స్థలాలిచ్చి ఇళ్లు మంజూరు చేసింది. మార్చి వరకు పూర్తి కాకపోతే నిధులు మంజూరు కావని ప్రభుత్వం చెబుతోంది.
పేదలపై కూటమి సర్కారు సరికొత్త కుట్ర
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాల రద్దుకు రంగం
నిర్మాణాలు ప్రారంభించలేదన్న నెపంతో
వాటిని తొలగించేందుకు సిద్ధం
తమ పార్టీల నేతలకు
కట్టబెట్టేందుకు పావులు
జిల్లా వ్యాప్తంగా 3,128 ఇళ్ల స్థలాలు రద్దయ్యే అవకాశం
ఆందోళనలో లబ్ధిదారులు
Comments
Please login to add a commentAdd a comment