ఉగ్రవాద బెడద ఇంకా సజీవంగానే ఉన్నదని మన పొరుగునున్న పాకిస్తాన్‌లో తరచు జరిగే దాడులు నిరూపిస్తుండగా మన దేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్‌లలో తన కార్యకలాపాలు విస్తరించుకోవటానికి అల్ కాయిదా పథకరచన చేస్తున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అనుబంధ నివేదిక హెచ్చరిస్తోంది. ఉగ్రవాద సంస్థల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ అవస రమైన ఆంక్షలను సిఫార్సు చేసే విభాగం ఈ నివేదికను రూపొందించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం చెప్పుకోదగ్గ ఫలితం ఇవ్వకపోగా, అన్నివిధాలా దెబ్బతిన్న అమెరికా రెండేళ్ల క్రితం అక్కడినుంచి వెనుదిరిగింది.
దేశంలోని అన్ని వర్గాల మధ్యా సామరస్య సాధనకు ప్రయత్నించటం, అఫ్గాన్ సమస్యతో సంబంధంవున్న దేశాలకు శాంతిప్రక్రియలో చోటీయటం వంటివేమీ చేయకుండానే అమెరికా కాడి కింద పారేసింది. దాని ఫలితంగానే ఆ దేశంలో మహిళలను దారుణంగా అణిచేయటం, ప్రత్యర్థులను కున్నవారిని తుదముట్టించటం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి తమ గడ్డపై నుంచి ఎటువంటి ఉగ్ర వాద కార్యకలాపాలనూ అనుమతించబోమని అమెరికాకు ఇచ్చిన హామీని సైతం తాలిబన్ పాల కులు తుంగలో తొక్కారు. భద్రతా మండలి తాజా నివేదిక దాన్నే ధ్రువీకరిస్తోంది.
తమ భూభాగంలో అల్ కాయిదా లేనేలేదని తరచు బుకాయిస్తున్న తాలిబన్‌ల తీరుకు భిన్నంగా అడపా దడపా ఆ ఉగ్ర సంస్థ జాడల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో అల్ కాయిదా ముఖ్యులు దాదాపు 60 మంది వరకూ ఉండగా, ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే మరో 400 మంది ఉన్నారని భద్రతామండలి నివేదిక తెలిపింది. వీరికి మద్దతుగా నిలబడే బంధువర్గాన్నీ, సన్నిహితులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 2,000 మంది ఉంటా రని ఆ నివేదిక అంచనా వేసింది. అల్ కాయిదా నేతృత్వంలో రూపుదిద్దుకున్న మరో ఉగ్ర సంస్థ భారత ఉపఖండ అల్ కాయిదా (ఏక్యూఐఎస్)కు ప్రస్తుతం 200 మంది ఉగ్రవాదులున్నారని, ఈ సంస్థ పాకిస్తాన్‌లోని తెహ్రీక్–ఏ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో విలీనమై మన దేశంలోని జమ్మూ, కశ్మీర్‌తోపాటు మయన్మార్, బంగ్లాదేశ్‌లలో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నదని భద్రతామండలి నివేదిక అంటున్నది.
టీటీపీ ఆనుపానులు కనిపెట్టడంలో, ఆ సంస్థను నియంత్రించటంలో పాకిస్తాన్ పదే పదే విఫలమవుతోంది. టీటీపీతో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నిరుడు నవంబర్‌లో విఫలమయ్యాక ఉగ్ర దాడులు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఒక మసీదుపై దాడిచేసి 95 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, తాజాగా ఆదివారం ఖైబర్ ఫక్తున్‌ఖ్వా రాష్ట్రంలో ఆత్మా హుతి దాడి జరిపి, 40 మంది మరణానికి కారకులయ్యారు. అయితే ఈ దాడుల వెనక తాము లేమని టీటీపీ చెబుతోంది. ఆ సంస్థకు దన్నుగా నిలుస్తున్న అఫ్గాన్ ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. ఇరుగు పొరుగుకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ చివరకు అదే ఉగ్రవాదం సాలెగూటిలో చిక్కుకుని విలవిల్లాడటం, దాడుల కారకులెవరో కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో పడటం వింతేమీ కాదు. దేశంలో లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తు న్నాయని పాక్ సైన్యం అంచనా వేస్తోంది. ఇవన్నీ అటు సైన్యం పైనా, ఇటు పౌరుల పైనా తరచు దాడులు సాగిస్తున్నాయి. ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు ఏ సంస్థా తన ప్రమేయం ఉన్నదని ప్రకటించటం లేదు. ఇప్పుడు టీటీపీ, అల్ కాయిదాలు విలీనం కాబోతున్న వార్త నిజమే అయిన పక్షంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతోపాటు పాకిస్తాన్‌కు కూడా మరింత ముప్పు ఖాయం. ఈ రెండు సంస్థలూ అఫ్గాన్‌లో ఇప్పటికే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది.
ఆ సంస్థలను అన్నివిధాలా కట్టడి చేస్తున్నామని భ్రమల్లో కూరుకుపోయిన ప్రపంచ దేశాలు ఒకసారి సమీక్షించుకోవటం మంచిది. తమ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని గతంలో ఇచ్చిన హామీకి తాలిబన్‌లు కట్టుబడటం లేదని ఈ పరిణామాలన్నీ నిరూపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టాలి. తగినన్ని నిధులు లేకుండా, ఎవరి అండదండలూ లేకుండా ఉగ్రవాద సంస్థలు వర్ధిల్లటం ఉత్తమాట. దాదాపు 20 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో తిష్ఠ వేసి, కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తాలిబన్ పాలకులకు తెలియదనుకోవటం భ్రమ. తమతోపాటు కలిసినడుస్తున్నట్టు కనిపిస్తున్న నేతల్లో కొందరు వేరే ఉగ్ర సంస్థలకు విధేయులుగా మసులుకుంటున్నారని, వారు వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారని తాలిబన్‌లకు తెలియదనుకోవటం అమాయకత్వం.
ఆ సంస్థల నేత లను ఉద్దేశపూర్వకంగానే అధికారిక వ్యవస్థల్లోకి ప్రవేశపెడుతున్నారని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ సైతం మొదట్లో టీటీపీకి, అల్ కాయిదాకు సహాయ సహకారాలందించిన మాట వాస్తవం. టీటీపీ నాయకత్వం తనకు ఎదురుతిరగటం మొదలయ్యాక దానిపై దాడులు సాగిస్తోంది. ఒక బ్రిగేడియర్‌ను కోల్పోవటంతో సహా ఎన్నో నష్టాలను చవిచూస్తోంది. అటు అమె రికాకు తప్పుడు సమాచారం అందించి తాలిబన్‌లను అఫ్గాన్‌లో పునఃప్రతిష్ఠించటంలో కీలక పాత్ర పోషించి దెబ్బతింది. ఏ విలువలకూ కట్టుబడని పాలకుల చేతుల్లో అఫ్గాన్ ఉండటం దక్షిణాసియా ప్రాంత దేశాలకు మాత్రమే కాదు... ప్రపంచానికే ముప్పు తెస్తుంది. కనుక తాజా నివేదికపై భద్రతా మండలి దృష్టి సారించాలి. ఇతరత్రా అంశాల్లో ఎలాంటి విభేదాలున్నా ఉగ్రవాదాన్ని కట్టడి చేయ టంలో అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాలి.
Comments
Please login to add a commentAdd a comment