అబార్షన్ల విషయంలో మహిళల రాజ్యాంగ హక్కుని కాలరాస్తూ నిరుడు జూన్‌లో తీర్పునిచ్చిన అమెరికా సుప్రీంకోర్టు... జాతి ఆధారంగా విద్యాసంస్థల అడ్మిషన్లలో ప్రాధాన్యం కల్పించే విధానా నికి మంగళం పాడి తనది వెనకడుగేనని మరోసారి నిరూపించుకుంది. గత అరవైయ్యేళ్లుగా అమల వుతున్న ఈ విధానం రాజ్యాంగంలోని 14వ అధికరణ కు విరుద్ధమని 6–3 మెజారిటీతో ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. ధర్మాసనంలో అత్యధికులు రిపబ్లికన్‌ల ఏలుబడిలో వచ్చినవారే. మన దేశంలో శతాబ్దాలుగా వివక్ష ఎదుర్కొంటున్న అట్టడుగు కులాలకు కోటా కల్పించిన విధంగానే అమెరికా విద్యాసంస్థల్లో కూడా నల్లజాతీయులు, ఇతర మైనారిటీ వర్గాలకు ప్రవేశాల్లో ప్రాధాన్య మిస్తున్నారు.
ఆ వర్గాలపై శతాబ్దాలుగా అమలవుతున్న వివక్షపై డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్VŠ జూనియర్ నేతృత్వంలో సాగిన చరిత్రాత్మక పోరాటాల ఫలితంగా అక్కడి సమాజం తనను తాను సరిదిద్దుకునే క్రమంలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఈ క్రమం అసంపూర్ణంగానే ఉన్న దని తరచు నిరూపణ అవుతూనే ఉంది. వర్ణ వివ క్ష, దాన్ని వెన్నంటి ఉండే వ్యవస్థీకృత హింస ఇంకా సమసిపోలేదు.
ఎలాంటి నేర నేపథ్యమూ లేని జార్జి ఫ్లాయిడ్ అనే ఒక నల్లజాతీయుణ్ణి 2020లో మినియాపొలిస్ నగరంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత క్రూరంగా, ఎంత నిర్దాక్షిణ్యంగా హత మార్చాడో, దాని పర్యవసానంగా ఎంత హింస చెలరేగిందో ప్రపంచమంతా చూసింది. ఆ ఘటనకు ముందూ వెనుకా అనేకానేకమంది నల్లజాతీయులు పోలీసు హింసకు బలయ్యారు. వందల ఏళ్ల పాటు బానిసత్వంలో మగ్గిన పర్యవసానంగా వారు చదువులకు దూరమయ్యారు.
కనుక మెరుగైన ఉపాధికి వారు దూరం. అసలు 1964 వరకూ పౌరహక్కులే లేవు. ఆ మరుసటి ఏడాది వారికి తొలిసారిగా ఎన్నికల్లో ఓటేసే హక్కు లభించింది. ఇదంతా నల్లజాతీయుల మొక్కవోని పోరాటాల, త్యాగాల ఫలితం. ఆ హక్కులకు కొనసాగింపుగానే 1965 జూన్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ‘నిశ్చయాత్మక చర్య’కు సంసిద్ధం కావాలని, నల్లజాతీయులకూ, ఇతర మైనారిటీ లకూ ప్రవేశాల్లో ప్రాధాన్యతనీయాలని విద్యాసంస్థలకు పిలుపునిచ్చారు. ఆరు దశాబ్దాలుగా అమల వుతున్న ఈ విధానంతో ఎంతోమంది అత్యున్నత స్థానాలకు ఎదుగుతున్నారు. తమ మేధస్సుతో అమెరికన్ సమాజం సుసంపన్నం కావటానికి దోహదపడుతున్నారు. అయినా ఈనాటికీ
విద్యా సంస్థల్లో నల్లజాతీయులు 7 శాతం మించరు. శ్వేత జాతి అమెరికన్లు 46 శాతం వరకూ ఉంటారు. ఏదో మేరకు జరుగుతున్న కాస్త మంచినీ తాజా తీర్పు ఆవిరిచేసింది. విద్యారంగంలో ‘నిశ్చయాత్మక చర్య’కు ముందు అత్యున్నత శ్రేణి విద్యా కేంద్రాలుగా పేరున్న హార్వర్డ్, యేల్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీల్లో 1960ల నాటికి కేవలం 15 (0.5 శాతం) మంది నల్లజాతి విద్యార్థులుండేవారు. వైద్య విద్యలో పేరెన్నికగన్న యూసీఎల్‌ఏలోనూ, మరికొన్నిచోట్లా 1955–1968 మధ్య 764 మంది వైద్య పట్టాలు పొందితే నల్లజాతీయులు ఒక్కరు కూడా లేరు. దీన్ని గమనించాకే లిండన్ జాన్సన్ విద్యాసంస్థలకు అర్థమయ్యేలా చెప్పారు.
అనేకానేక ఏళ్లపాటు సంకెళ్లలో బందీ అయిన వ్యక్తికి విముక్తి కల్పిస్తూ ‘ఇకపై నీకు స్వేచ్ఛనిస్తున్నాం. ఇప్పుడు ఎవరితో నైనా నువ్వు పోటీపడొచ్చు. ఆ పోటీ పూర్తి న్యాయబద్ధంగా ఉంటుంది’ అనడం ఎంత అన్యాయమో గ్రహించమని కోరారు. ఆ తర్వాతే విద్యాసంస్థలు తమ అడ్మిషన్ విధానాల్లో మార్పులు చేశాయి.
తమ తీర్పు దీన్నంతటినీ దెబ్బతీస్తుందన్న వాదనలతో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఏకీభ వించటం లేదు. వివక్ష అంతానికి ప్రవేశపెట్టిన ఈ విధానమే వివక్షతో కూడుకున్నదని ఆయన అభిప్రాయం. ఇకపై వ్యక్తులుగా ఎవరు ఎలాంటి వివక్ష ఎదుర్కొన్నారో తెలుసుకుని దాన్నిబట్టి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన సూచన.
ఆచరణలో ఇదంతా ఏమవుతుందో తెలియనిది కాదు. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో జాతిపరమైన వైవిధ్యత మాయమవుతుంది. శ్వేత జాతి అమెరికన్ల ఆధిపత్యం పెరుగుతుంది. ప్రస్తుతం తీర్పు వెలువడిన కేసు అక్కడ మొదటిదేమీ కాదు. ‘నిశ్చయాత్మక చర్య’ మొదలై పదేళ్లు గడవకుండానే దానిపై వివిధ న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. వాటిల్లో స్వల్ప మెజారిటీతో గండం గట్టెక్కిన కేసులే అధికం. 2003లో ఈ విధానానికి అనుకూలంగా తీర్పు వెలువడినా, ధర్మాసనంలోని మహిళా న్యాయమూర్తి ‘మరో పాతికేళ్లకు జాతిని కాక ప్రతిభను పరిగ ణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంద’ని అభిప్రాయపడ్డారు.
కానీ అంతకు చాలాముందే సుప్రీంకోర్టు ఆ విధానానికి స్వస్తి పలికినట్టయింది. అసలు ఈ విధానాన్ని కాలిఫోర్నియా, ఫ్లారిడాలతో సహా తొమ్మిది రాష్ట్రాలు అమలు చేయటంలేదు. అమెరికన్ సమాజంలో ఈ విధానాన్ని వ్యతిరేకించే వర్గం క్రమేపీ పెరగటం కనిపిస్తుంది. రిపబ్లికన్ పార్టీ ఈ విధానికి మొదటినుంచీ బద్ధ వ్యతిరేకం. అనుకూలంగా ఉండే డెమొక్రటిక్ పార్టీ కూడా ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేయలేదు. అందుకే ప్రస్తుత తీర్పు మెజారిటీ జనాభా దృక్పథాన్నే ప్రతిబింబిస్తోంది.
ఇది విద్యాసంస్థలకు సంబంధించిందే అయినా మున్ముందు మిలిటరీ, నావీ అకాడమీ ప్రవేశాల్లోనూ, కార్పొరేట్ రంగ ఎంపికల్లోనూ అమలు చేసే పరిస్థితులు ఏర్పడొచ్చు. ఈ విధానంవల్ల లాభపడు తున్న ఆసియన్ అమెరికన్లను, శ్వేతజాతి మహిళలను కూడగట్టడంలో నల్లజాతీయులు విఫలం కావటంవల్లే ఈ తీర్పు వెలువడిందని కొందరి విశ్లేషణ. ఆ మాటెలావున్నా మొత్తంగా అమెరికన్ సమాజంలో జాతిపరమైన సంకుచితత్వం పెరుగుతోందనటానికి ఈ తీర్పు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment