మన్యంలో ప్లాస్టిక్‌పై సమరం
ఆదివారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2025
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని అడవుల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా మార్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటీవల పాపికొండల అభయారణ్యంలో పర్యటించిన అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ బీఎన్‌ఎన్‌మూర్తి మన్యంలో పర్యాటకులు పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేసి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు బుట్టాయగూడెం మండలం ముంజులూరు సమీపంలో ఉన్న ఏనుగుతోగు జలపాతం, జారుడు కాల్వ సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా..
పాపికొండల అభయారణ్యంలోని ఏనుగుతోగు జలపాతంతోపాటు జారుడుకాల్వ సమీపంలో ఉన్న ప్రదేశం, జలతారువారు, కొరుటూరులో ఫా రెస్ట్ శాఖ ఏర్పాటుచేసిన కాటేజీలు, శివగిరి తదితర ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి ఉంటుంది. అధిక సంఖ్యలో పర్యాటకులు ఆయా ప్రాంతాలను పర్యటించిన సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. దీనిని నివారించేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఆయా ప్రాంతాల సమీపంలో ఉన్న గ్రామాల్లోని యువకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకువెళ్తే వారికి రూ.20 టికెట్ పెట్టారు. తీసుకువెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలను వెనక్కి తీసుకువచ్చిన వారికి తిరిగి రూ.20 చెల్లించనున్నారు. ఎవరైనా అక్కడే వ్యర్థాలను వదిలివేస్తే వారు చెల్లించిన సొమ్ములతో ఆ వ్యర్థాలను పరిశుభ్రం చేసేలా అధికారులు ఏర్పాట్లుచేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రకృతికి నష్టం వాటిల్లుతుందని, పర్యాటకులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
కలప రవాణాపై నిఘా
అటవీ సంరక్షణలో భాగంగా ఇప్పటికే అడవిలో అక్రమ కలప రవాణాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. కన్నాపురం రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎ.శివరామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. రేంజ్ పరిధిలో నెల రోజుల్లో సుమారు రూ.15 లక్షల విలువైన టేకు, బండారు, వెదురు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 13 వాహనాలను సీజ్ చేశారు.
న్యూస్‌రీల్
పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి
అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి
స్థానిక యువకులతో కమిటీ ఏర్పాటు
అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు
పర్యాటకులు సహకరించాలి
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతుంది. వన్యప్రాణులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. వన్యప్రాణు లు, అడవుల సంరక్షణ, ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా పర్యాటక ప్రదేశాలు తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. పర్యాటకులు ఫారెస్ట్ శాఖ అధికారులకు సహకరించాలి.
– ఎ.శివరామకృష్ణ, రేంజ్ అధికారి, కన్నాపురం
అటవీ సంరక్షణ అందరి బాధ్యత
అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అక్రమ కలప రవాణా జరగకుండా చూడటంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల అడవులకు ముప్పు వాటిల్లకుండా చూడాలి. అందుకు మా వంతు సహకారం అందిస్తాం. ఫారెస్ట్ అధికారుల కృషిని అభినందిస్తున్నాం.
– కెచ్చెల ముక్కారెడ్డి, సర్పంచ్, ముంజులూరు
Comments
Please login to add a commentAdd a comment