ఈ సంక్రాంతి.. మన బులిరాజుదే
నిడమర్రు: ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా విడుదలైన ఈ సినిమాలో అందరి కామెడీ ఒకెత్తయితే.. వెంకటేష్ కొడుకు బులిరాజు పాత్ర చేసిన కామెడీ మరో ఎత్తు. ఇంతకీ ఈ బులిరాజు పాత్ర చేసిన రేవంత్‌ది మన జిల్లానే. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లి అతని స్వగ్రామం. ఏమాత్రం సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని ఈ పదేళ్ల బాలుడు తన తొలి చిత్రంతోనే ఒకేసారి పాపులర్ అయిపోయాడు. సినిమాలో బులిరాజు ఎంట్రీ ఇచ్చాడంటే థియేటర్‌లో విజిల్స్ మోతెక్కిపోతున్నాయంటే ఆ పాత్ర ఏ స్థాయిలో జనానికి నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్‌లతో బిజీబిజీగా ఉన్న మన బులిరాజు ఆదివారం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సాయంత్రం 5.30 గంటలకు జరిగే సక్సెస్ మీట్‌లో చిత్ర బృందంతో కలసి సందడి చేసేందుకు చానమిల్లికి రాగా.. ‘సాక్షి’ పలుకరించగా వెల్లడించిన విశేషాలివీ..
గోదావరి స్లాంగ్‌తో అక్కడికక్కడే ఎంపిక
బులిరాజుగా గుర్తింపు పొందిన రేవంత్ పూర్తి పేరు భీమాల రేవంత్ పవన్ సాయి సుభాష్. బావాయిపాలెంలోని శ్రీచైతన్య స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. రేవంత్‌కి యూట్యూబ్ రీల్స్ చేయడం అలవాటు. ఇప్పటివరకు 20 రీల్స్ చేశాడు. పలు వీడియోలు డైరెక్టర్ అనిల్ వరకు వెళ్లడంతో.. రేవంత్ తండ్రికి ఫోన్ చేసి ఆడిషన్స్‌కి రప్పించారు. ఆడిషన్స్‌లో గోదావరి స్లాంగ్ మాట్లాడుతుండటంతో రేవంత్‌ని అక్కడికక్కడే ఎంపిక చేశారు. స్కూల్లో అందరినీ ఇమిటేట్ చేసే అలవాటు ఉంది. పవన్ కల్యాణ్ పాత్రలను ఎక్కువగా ఇమిటేట్ చేసేవాడు.
షూటింగ్‌లోనే యాక్టింగ్ ప్రాక్టీస్...
సినిమా కోసం యాక్టింగ్ స్కూల్లో చేర్పించాలని రేవంత్ తండ్రి అనుకోగా.. షూటింగ్‌లోనే ప్రాక్టీస్ చేయిస్తామని అనిల్, దిల్‌రాజు ప్రోత్సహించారు. కలలో కూడా సినిమాల్లో నటిస్తానని అనుకోని రేవంత్.. తొలిసారి సినిమాలో నటించే అవకాశం రావడంతో కంగారుపడ్డాడు. చిత్ర బృందం ప్రోత్సాహంతో ఉత్సాహంగా నటించగలిగాడు. హీరో వెంకటేష్ తనను కుటుంబసభ్యుడిలా ఆదరించారని రేవంత్ సంతోషం వ్యక్తం చేశాడు. 72 రోజుల షూటింగ్‌లో రోజుకు 10 నుంచి 12 గంటలపాటు తన తండ్రితో కలసి సెట్ వద్దే ఉండేవాడు. షూటింగ్ వల్ల 3 నెలలు పైగా స్కూల్‌కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా అతని తండ్రి, ప్రిన్సిపాల్ సహకారంతో నోట్సులు వాట్సాప్‌లో తెప్పించి చదివించారు.
అవకాశాల వెల్లువ..
ఈ సినిమా తర్వాత రేవంత్‌కి 15 సినిమాల్లో, ఒక వెబ్ సిరీస్‌లో అవకాశాలు వచ్చాయి. భవిష్యత్తులో డాక్టర్ అయ్యి.. గ్రామీణ ప్రజలకు వైద్యసేవలందించాలనేది రేవంత్ లక్ష్యం. ఇకపై సినిమా అవకాశాలు వచ్చినా వేసవి, సంక్రాంతి సెలవుల్లోనే షూటింగ్ ప్లాన్ చేసుకుంటానని చెబుతున్నాడు. చదువును మాత్రం నిర్లక్ష్యం చేయనంటున్నాడు. రేవంత్‌కి సినిమాల్లోని ఫన్ పాత్రలంటేనే ఇష్టం. నీ కోసమైనా సినిమా మరోసారి చూస్తానని హీరో మహేష్‌బాబు అనడం మరిచిపోలేని విషయమని చెబుతున్నాడు.
కొల్లేరు గ్రామం చానమిల్లి నుంచి టాలీవుడ్‌లో బుల్లి స్టార్‌గా
అసలు పేరు రేవంత్.. నేడు అందరినోటా బులిరాజుగా గుర్తింపు
నేడు భీమవరంలో సక్సెస్ మీట్‌లో సందడికి సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment