వలంటీర్ల వ్యవస్థ అమలు చేయాలి
కొయ్యలగూడెం : వలంటీర్లను పునర్వ్యవస్థీకరించి, రూ.10 వేల వేతనం ఇవ్వాలని, ప్రభుత్వం నిరంకుశ ధోరణి విడనాడాలని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిక్కాల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఏలూరు నుంచి కాకినాడ వరకు దుర్గాప్రసాద్ చేపట్టిన పాదయాత్ర శనివారానికి కొయ్యలగూడెం మండలానికి చేరుకుంది. రోటరీ క్లబ్ కల్పవృక్ష వృద్ధాశ్రమంలో దుర్గాప్రసాద్ పాదయాత్రను అభినందిస్తూ వృద్ధులు హారతులు పట్టి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు 1వ తేదీన పొందాల్సిన పెన్షన్లు అందలేదని, సాంకేతిక కారణాల వల్ల ఇవ్వడం లేదని అధికారులు అంటుండడంతో వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ తాను చేపట్టిన పాదయాత్ర ఆరు రోజులు పూర్తయిందని ఇంతవరకు 118 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టానని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. సీసీఎస్ రద్దు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, ప్రైవేటు లెక్చరర్లు, టీచర్లకు ప్రత్యేక చట్టం, హెల్త్ కార్డు అమలే తన ధ్యేయం అన్నారు. ఎమ్మెల్సీగా గెలిస్తే వాటి సాధనకు కృషి చేస్తానని దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. 6వ రోజు వై.జంక్షన్ వద్ద పాదయాత్ర ప్రారంభం కాగా నరసన్నపాలెం, సీతంపేట, బయ్యనగూడెం, కొత్తూరు అడ్డరోడ్డు, కొయ్యలగూడెం, అచ్యుతాపురం గ్రామాల మీదుగా కొనసాగింది. కొయ్యలగూడెం గణేష్ సెంటర్‌లో నిరుద్యోగులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రసాద్‌ను సత్కరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఇళ్ల భాస్కరరావు, తుమ్మలపల్లి గంగరాజు, నూకల రాము, తేలే శ్రీను, తోట జయబాబు, శంకు కొండ, గొలిశెట్టి ప్రసాద్, కొప్పుల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment