ఈ వారం కథ: రహమాన్‌ కొడుకు | Evaram Katha On Funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: రహమాన్‌ కొడుకు

Published Sun, Oct 6 2024 8:42 AM | Last Updated on Sun, Oct 6 2024 10:03 AM

Evaram Katha On Funday

కోపం, బాధ కారణంగా అతనికి చిరాకుతో పిచ్చెక్కిపోయింది. మాట మాటకి ఆవేశంతో చీదరించుకుంటున్నాడు. అదే సమయంలో గోపి కనక రాకపోయుంటే ఏదో ఒక పిల్లాడి వీపు చితక్కొట్టి తన అక్కసు తీర్చుకునేవాడు. గోపి వచ్చి దూరం నుండే ‘సలాం సాహెబ్, భాయ్‌ రహమాన్‌’ అంటూ పలకరిస్తూ,‘చెప్పు ఏం జేస్తున్నావు?’ అని అడిగాడు.


రహమాన్‌ తలకెక్కిన పిచ్చికోపం కాస్త శాంతించింది. ‘రా, గోపి కాకా సాహెబ్, సలాం’ అన్నాడు. 
‘అంత కోపంగా వున్నావ్, ఏమిటి సంగతి?’ అంటూ గోపి కూర్చున్నాడు. రహమాన్‌ బీడీకట్ట తీసి అతని ముందు పెట్టాడు. తాను ఒక బీడీని వెలిగించుకుంటూ ‘ఏముంటది కాకా, ఈ తరం పిల్లల బుద్ధి భ్రష్టు పట్టింది. ఎలాంటి కాలం వచ్చింది! తల్లిదండ్రులంటే లెక్కలేదు, వాళ్లనర్థం చేసుకోరు..’


గోపి బీడీ వెలిగించి ఒక గట్టి దమ్ములాగి, నవ్వుకుంటూ ‘రహమాన్, పరిస్థితులెప్పుడూ ఇలాగే ఉంటాయి. నాకు చాలా జ్ఞాపకం.. మా నాయన నెత్తి బాదుకుని చెప్పడం, నేను ఆయన మాటను బేఖాతరు చేయడం! ఆయనెంత చెప్పినా నేనెన్నడూ బడికెళ్లి హాజరివ్వలేదు. ఈ ముసలి వయసులో ఆ రోజులన్నీ గుర్తుకొస్తుంటాయి. ఆలోచిస్తూంటాను.. నాయన చెప్పినట్టే చదువుకొనివుంటే, రెండక్షరాలు పొట్టలో పడేవి కదా అని!’ అన్నాడు.

మధ్యలోనే మాటల్ని తుంచేస్తూ రహమాన్‌ ‘ఐతే కాకా, మత్తు ఎక్కిపోతుందా? అక్షరాల్లో మర్యాద కన్నా మత్తు ఉంటుందా? ఈ రెండక్షరాల మత్తుతోనే కదా సలీం ఎగిరెగిరి పడుతున్నాడు? ఈ బస్తీలో ఉండటానికి నా మనసు ఇష్టపడటం లేదు, అందరూ మురికిగా వుంటారు, మాట్లాడే మర్యాద తెలీదు, దొంగతనాలు చేయకుండా ఉండలేరు.. అంటూ వాగుతూ వుండాలా?’
గోపి ఆశ్చర్యంతో ‘సలీం అలా అన్నాడా?’ అడిగాడు. 

‘ ఆ.. ఔను, అలాగే అన్నాడు. ఇంకా ఏమన్నాడో విను! మనం మనుషులమే కాదు అంటాడు. జంతువులం అంటాడు. అంతేకాదు మురికి కాలువల్లోని పురుగుల్లా బతుకుతున్నామంటాడు..’ అంటూ చెప్పుకుపోతున్న రహమాన్‌ కళ్లు ఎర్రబడ్డాయి. శరీరం వణకసాగింది. అప్పటిదాకా తాకని హుక్కాని, కాలితో గట్టిగా తన్ని తనవైపు జరుపుకున్నాడు. ఆ తాకిడికి హుక్కాలోని ‘చిల్లం’ కిందపడిపోయింది. అంతే అందులో వున్న నిప్పు చిందరవందరగా చెదిరిపోయింది. ‘కరీమున్, ఓ మొండిదానా, ఎక్కడ చచ్చావ్‌? తీసుకపో ఈ హుక్కాను, సాలా నన్ను గుండా అంటాడా!’ అంటూ గట్టిగా అరిచాడు.

రహమాన్‌ ఆవేశాన్ని చూసి గోపి ‘వాడి తండ్రి స్కూల్‌లో చప్రాసీగా చేశాడు గదా!’ అన్నాడు. ‘ఔను, అదే ప్రభావం వాడి మీద పడి చెడగొట్టింది. చదువు లేదు, కానీ, ప్రతిక్షణం చదువుకున్న వారి మధ్య మసలుకునేవాడు. కానీ సాలేగాడు ఏం జేశాడు? నిండు యవ్వనంలో కాళ్లు చాపి కాటికిపోయాడు. పెళ్లాన్ని ఎటూ గాకుండా జేశాడు. తెలియదు, ఏం ఖర్మనో, ఎవరి నెత్తి మీది బరువో! వాడి తల్లి వచ్చినా ఎదురుగ ధర్నా చేసి కూర్చుంటుంది. ఆరోజు అలాగే చేసింది. ఈ రోజు కూడా నా నెత్తి మీదే మోపింది. ఎవరైనా చెబితే బాగుండేది. సలీం, రహమాన్‌ కొడుకు కాదని, అదేమైన మాటనా కాకా!’

ఎక్కడినుండో వచ్చి రహమాన్‌ కంట్లో నలుసు పడినట్లుంది. గట్టిగా నులుముకోసాగాడు. అదే సమయంలో.. చెప్పాలా వద్దా అనుకుంటూ గోపి ‘సలీం తల్లి చాలా మంచి మనసుగలావిడ!’ అన్నాడు.వెంటనే రహమాన్‌ అందుకున్నాడు ‘కాకా, ఆమె దేవత, అంత మంచి మనసుగలావిడ ఈ రోజుల్లో వెతికినా కనబడదు. ఆమె భర్త పేరు ఎత్తేదని చెప్పడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ప్రాణమంతా ధారబోసి ఎంతసేవ జేసిందో! ఎప్పుడూ తలెత్తి జూసేదే కాదు. కాకా, దాని ఫలితమే ఇది. నీ నుండి ఏమైనా దాపరికం ఉందా! నన్నెప్పుడైనా అక్కడిక్కడ చూశావా?’ అంటూ.       

గోపి కంగారుగా ‘ఎప్పుడూ లేదు రహమాన్, ముఖం చూసి చెప్పడం కాదు, న్యాయమైన మాటే. ఇదే మాట ఐదు పంచాయతీల పెద్దల ముందు చెప్పమన్నా చెప్పడానికి సిద్ధంగా వున్నాను’ అన్నాడు. ‘ఇక దొంగతనం విషయానికొస్తే, కన్నం వేయడానికి ఎవరింటికి ఎవరెళ్లారు? పొలాల నుండి గడ్డిగాదెం కోసుకొని నువ్వు కూడా తెచ్చుకుంటావు గదా కాకా!’‘ఆ.. తెస్తాను, ఇందులో దాపరికం మాటేముంది? ఐనా, ఎందుకు తెచ్చుకోకూడదు? మనం అంతకు దిగజారివున్నామా? పెద్దమనుషులు రోజూ జేబులు నింపుకొని ఇంటికొస్తారు.

నిజం చెప్పనా రహమాన్‌! జీతం డబ్బులిచ్చేటప్పుడు వేలిముద్ర ముందుగానే తీసుకుంటారు. పైసలిచ్చేటప్పుడు  మాత్రం పేదోడి వైపు చూసి ఎంతలా చీదరించుకుంటారంటే.. పాపం! ఆ  అమాయకుడు మొహం చూస్తూ మాటరాక ఉండిపోతాడు. మంచితనమన్నది ఈ లోకంలో ఎక్కడున్నది? అంతా చీకటి రాజ్యమే! చెప్పుకోవడానికి దిక్కులేని ఈ ప్రభుత్వంలో మన నుదుటి రాత ఎలా వుందో తెలియదు! రాత్రి – పగలు లేకుండా నాలుగు రెట్లు అభివృద్ధి జరుగుతుంది అంటారు. కానీ, గాంధీతాతకు సంబంధించి ఏ విషయం బయటికి రాదు’ అన్నాడు గోపి. 

అతని మాటలు పట్టించుకోకుండానే రహమాన్‌ అంతే వేగంగా సమాధానమిచ్చాడు, ‘పెద్దమనుషుల దాకా ఎందుకు? ఈ అధికారులున్నారు, చూశావా? అందరూ మహానుభావులే.. వారేం తక్కువ గాదు! దేనికీ నయాపైస బయటికి తీయరు. ఇంకా కాకా.. నిన్న మొన్నటి పోరగాడు ఈ సలీం మనల్ని గుండా అంటాడు. వాళ్లే గుండా సాలేగాళ్లు. నిజం కాదా కాకా, క్లబ్బుల్లో వీళ్లు చేసే బద్మాష్‌గిరీ తప్ప ఇంకేముంది? సారా తాగేది వాళ్లే, జూదం ఆడేదీ వాళ్లే, ఇంకా, ఇంకా ..!’ అంటూ.

‘ఇంకా ఏమిటి? మా సాహెబ్‌ దగ్గరకి ప్రతిరోజు క్లబ్‌లో పనిచేసే చప్రాసీ వస్తాడు. అన్నీ చెప్తాడు. ఒకరోజు వంద, ఇంకోరోజు వంద యాభై పోగొట్టుకున్నా.. అతని భార్య వుంది చూశావూ.. అదృష్టాన్ని నెత్తి మీద పెట్టుకొని వస్తుంది. ఎప్పుడు పోయినా వంద రెండొందలు కొట్టుకొని వస్తది.’‘మేమ్‌సాబ్, కాకా నీకేం తెలుసు, ఆమె సంగతే వేరు. ఈ సాహెబ్‌ ఎంత మొనగాడో! ఈ సాహెబే ఎందుకు, పేరు మోసిన వకీళ్లు, బారిస్టర్లు, వ్యాపారులు అందరూ ఈ మధ్య  క్లబ్బులకు అలవాటు పడ్డారు. ముసల్మానులు సారా తాగడం ‘హరామ్‌’ అంటారు. కానీ, అక్కడ కూర్చొని విస్కీ, జిన్, పోర్ట్‌ అన్నీ లాగిస్తారు. 

ఇక ఆడాళ్ల సంగతి చెప్పకు, ఎంతగా దిగజారి పోయారంటే పరాయి మగవారి నడుం మీద చెయ్యి వేసి తిరుగుతారు, కలిసి డాన్స్‌ చేస్తారు. ఇకఇకలు పకపకలతో సంభాషణలు. కాకా, ఎంతసేపు అక్కడ వుంటారో అంతసేపు పక్కవాడి మీద చాడీలు, వెటకారాలు.. రోజంతా గుసగుసలు పోతారు. ఇక అవకాశం దొరికితే ఎవరు ఎవరితో పోతారో తెలియదు. ఒక రోజు గెలిచిన సంతోషంలో డ్రామా వేశారు. పోలీసు పెద్దగా లాలాజీ నటించారు. జనాలను నవ్విస్తూ ఉండిపోయారు. మేజర్‌ సాహెబ్‌.. ఆయన భార్యను డాక్‌ బంగ్లాకు షికారుకు తీసుకెళ్లాడు. ఇదీ పెద్ద మనుషుల నడవడిక. వీళ్లు మనకు పెద్దవాళ్లు. మన అదృష్టాన్ని నిర్ణయించేవారు.’

గోపి మరోమారు గట్టిగా దమ్ములాగి గంభీరంగా ‘రహమాన్, కనబడ్డానికి ఎంత పెద్ద మనుషులో అంత చిన్నగుణం వారిది’ అన్నాడు. 
‘అంతా పైపై మెరుగులే!’‘మరింకేం!’ ‘వీళ్ల కోసమా, సలీం మనల్ని మర్యాద తెలీనివాళ్లు, అనాగరికులు, తెలివి తక్కువవాళ్లు.. ఇంకా ఏమేమి వాగాడో! నేను కూడా నిర్ణయించుకున్నాను, వాడితో తాడోపేడో తేల్చుకోవాలని. వాణ్ణెప్పుడూ పరాయివాడిగా చూడలేదు కాబట్టి వాడన్ని కూతలు కూస్తున్నా ఊరుకున్నాను. లేకపోతేనా, లేకపోతేనా..’ 

గోపి తన చేతికర్ర ఎత్తుకుంటూ,‘రహమాన్, ఏమైనా కానీ, సలీం నీ కొడుకే అని అనుకుంటున్నారు. వయసులో వున్న కుర్రాడు.. ‘అబే , తబే’ అని తిట్టమాకు.. అర్థమైందా! ఈ తరం ఇలాగే నడుస్తుంది. మన ముందు తరాలు కూడా ఇలాగే ఉండేవి. కాకపొతే తన్నులు తిని నోరెత్తకపోయేవారు. కానీ, ఇప్పటి  పిల్లలు ఏకంగా జవాబే ఇచ్చేస్తున్నారు’ అన్నాడు.రహమాన్‌ ఆవేశంతోనే వున్నాడు.. ‘నేను వాడి సమాధానాలేవీ మనసులో పెట్టుకోను కాకా, నరకంలో పడనీ.. నాకేం సంబంధం వాడితో? ఐనా కాకా, నేనెందుకు కొడతాను వాణ్ణి? నా చేతులకేమైనా దురదా? కానీ రెండు మాటలు మాత్రం అడుగుతాను. 

ఆ తరువాత వాడి దారి అటో, ఇటో! ఇంకా కాకా, ఆ సాలేగాని మీద నాకేమీ ఫికర్‌ లేదు. ఫికర్‌ ఏమైనా వుందీ అంటే వాడి తల్లి మీదే.  కన్నకొడుకు కదా, ఏదో కాస్త బుద్ధితో మంచిగుంటాడని ఆమెకు ఆశ ఉంటుంది కదా కాకా. ఎంతోకొంత చదివి, ఎక్కడో ఇంత గుమస్తా ఉద్యోగం చేసుకుంటూ వాడి వంశం పేరు నిలబెడతాడని అనుకున్నాను. చదువెన్నడూ చెడిపోదు గదా, ఆ చదువు సంగతి దేవుడెరుగు, ఎవ్వరితోనూ సక్కగుండడు’ అన్నాడు.‘ఔను రహమాన్, చదివిన చదువు ఎన్నడూ వృథా పోదు. యజమాని అనుకున్నా చదువును చెరిపేయలేడు. ఇంత గాఢమైన గీత ఆ చదువుల తల్లే గీసింది. మన ఇజ్జత్‌ మన చేతుల్లోనే వుంది. ఎక్కువగా మందలించకు. చదువుకున్న వారికి అభిమానం ఎక్కువ, అర్థమైందా?’ అన్నాడు గోపి. 

‘అర్థమైంది కాకా!’గోపి లేచి నిలబడ్డాడు. తన కర్ర తీసుకొని గడ్డి మోపుని భుజాన వేసుకొని ‘సలాం’ అంటూ వెళ్లిపోయాడు. ఎటూ తోచని స్థితిలో వున్న రహమాన్‌ శూన్యంలోకి చూస్తూండిపోయాడు. మనసులో అర్థం కాని ఆలోచనలు చెలరేగి అలజడి సృష్టి్టస్తున్నాయి. అవి జలపాతపు దూకుడులా వేగంగా వున్న అనుభవాన్నిస్తూ బాధిస్తున్నాయి.  ఆలోచనలు, అలజడి, బాధ తీవ్రత ఎక్కువగావడం తప్ప మరేమీ లాభం లేదు. సానుభూతి, విషాదం లాంటి పలకరింపులు ఆ బాధ నుండి ఉపశమనం కలిగించలేవని తెలిసి చివరికి లేచి లోపలికెళ్లిపోయాడు.ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం కమ్ముకుంది. 

పిల్లలు ఆడుకొని ఇంకా ఇంటికి రానేలేదు. రహమాన్‌ భార్య రొట్టెలు కాలుస్తోంది. కమ్మటి కూర వాసన అతని నాసికకు చేరింది. తన దృష్టిని మరల్చి భార్య వైపు చూశాడు. ప్రశాంతంగా తన పనిలో నిమగ్నమైపోయింది. రొట్టెలు చేస్తూ వుంటే ఆమె చెవుల జుంకాలు  వేగంగా కదుల్తున్నాయి. నెత్తికి చుట్టుకున్న మురికి గుడ్డ జారి భుజంపై పడింది. 

వయసు పైబడుతున్నా ముఖం మీద ఆ యవ్వన ఛాయలు ఇంకా తేలిపోలేదు. మేని ఛాయ తెలుపు కాదు, అలాగని నలుపూ కాదు. ఆమె కళ్లల్లో ఏదో తెలియని మత్తు వుంది. ఆ కళ్లే ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఎవరైనా ఆమె వైపు ఒక్కసారి చూస్తే చాలు అలా చేష్టలుడిగి నిలబడిపోవాల్సిందే. రహమాన్‌ అలా నిశ్చేష్టుడైపోయేగదా.. ఆమె మత్తెక్కించే కళ్లల్లో మునిగిపోయాడు. లేకపోతే..!

అతన్ని చూసి అతని భార్య,‘అంతలా ఆవేశపడి పోతావెందుకు? బయటి వాళ్లకు ఇంటి విషయాలు చెప్పుకుంటారా ఎవరైనా?’ అంది.  
రహమాన్‌ కాస్త సంభాళించుకొని ‘బయటివాళ్లెదురుగా ఏమి? ఇప్పుడు నీళ్లు నెత్తి మీదికి వచ్చాయి. రేపు ఇంటి నుండి వెళ్లిపోతే ఈ సమాజం చెవుల్లో దూది నింపుకొని ఉండిపోతుందా.. లేక కళ్లు మూసుకొని వుండిపోతుందా!’ అన్నాడు.


భార్యకు బాధ కలిగింది. ‘తండ్రీకొడుకులు ప్రపంచంలో ఎక్కడా విడిపోరా?’‘ఎవరన్నారు వాడు నా కొడుకని?’ ‘మరి ఎవరి కొడుకు?’ ‘నాకేం తెలుసు?’ ‘ఏదీ ఓసారి ఇటు చూడూ.. నన్ను కూడా విననీ?’విసుక్కుంటూ, ‘ఏం వింటావ్‌? నాకే పుడితే ఇలా అంటాడా? నాలుక పీకేసే వాడిని సాలేగానిది?’‘చూస్తాను, ఎవరెవరి నాలుకలు పీకేస్తావో! ఇప్పటిదాకా ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేదు!’ ‘పిల్లలు, వయసొచ్చిన వారు ఒక్కటే అంటావా?’ ‘కాకపోవచ్చు కానీ, వాడి లక్షణాలు చూస్తూంటే ముందు ముందు ఏమౌతాడో తెలుస్తోంది. వయసులోకొచ్చాడు అంటున్నావు, ఏమంత వయసొచ్చింది? పచ్చి వయసు. 

ఏదో ఒకమాట నోరు జారాడు.. దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు. నీకు సంబంధం లేదంటున్నావు కదా! అందుకేనేమో, నీకే  సంబంధముంటే ఇంతలా డప్పు వాయించుకుంటూ తిరుగుతావా! మన తప్పులు మన కళ్లకు కనబడవు. వేరే వాళ్లదైతే చిన్న తప్పైనా కొండలా చేసుకొని తిరుగుతావు.’  రహమాన్‌ ఎలాంటి వాడైనా అంత మూర్ఖుడు కాదు. అతనికర్థమైంది.. తాను భార్య మనసును నొప్పించాడని! కానీ ఏం జేయగలడు? సలీం అంటే తనకేం ప్రేమ లేదా? కడుపు కట్టుకొని తనే కదా అతన్ని స్కూలుకి పంపింది. అతని కోసమే గదా, అవసరం పడితే పెద్దమనుషుల ముందు, డిప్టీల ముందు, అధికారుల ముందు కాళ్లావేళ్లా పడి దేహీ అని అర్థిస్తాడు. తల్లడిల్లిపోతాడు. ఇంత గాఢమైన ప్రేమ వుంది కనుకనే ఇంతలా బాధపడేది. పరాయివాడైతే..’

అప్పుడే రహమాన్‌ నలుగురు పిల్లలు బయట నుండి అల్లరి చేస్తూ వచ్చారు. దుమ్ము, ధూళి కొట్టుకుపోయి వున్నారు. మురికిగా వున్నా, అర్ధనగ్నంగా వున్నా వాళ్లు సంతోషంగా వున్నారు. అందరి కంటే పెద్దమ్మాయి పన్నెండేళ్ల వయసుంటది. వస్తూనే సంతోషంతో, ‘అమ్మీ, ఈ రోజు మేము భయ్యా వెళ్లే చోటుకి వెళ్లాం’ అంది. రహమాన్‌కు ఆశ్చర్యం కలిగింది. కానీ మొహం మాడ్చుకొనే వున్నాడు. గట్టి గొంతుతో ‘ఎక్కడికి పోయినవే దయ్యమా?’ అడిగాడు.  అమ్మాయి భయపడిపోయింది. ‘భయ్యా వెళ్లిన చోటికి’ గాభరాపడుతూ అంది.  ‘ఏ చోటు?’
‘భయ్యా అక్కడికెళ్తుంటాడు గదా, దూరం..’ చిన్నకొడుకు పదేళ్ల వయసుంటుంది, వెంటనే అందుకున్నాడు.‘అబ్బా.. అక్కడ చాలామంది వున్నారు.’ 

మూడోవాడు ఎనిమిదేళ్ల కుర్రాడు ముందుకొచ్చి,‘అక్కడ లెక్చర్‌ ఇచ్చారు’ అన్నాడు. రహమాన్‌ తికమకచెంది ‘లెక్చరా?’ అన్నాడు. ‘ఔను, అబ్బా.. లెక్చర్లు అయినయి. భయ్యా కూడా లెక్చర్‌ ఇచ్చాడు. వచ్చిన జనాలు చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు’ అని కూతురు చెప్పింది.అది విన్న అమ్మ ముఖం వికసించింది. గర్వంగా ఒకసారి రహమాన్‌ వైపు చూసి మళ్లీ అడిగింది, ‘ఏం చెప్పాడు?’   అప్పటిదాకా భయంతో ముడుచుకుపోయిన కూతురు తల్లి ప్రశ్నకు రెట్టించిన ఉత్సాహంతో ‘అమ్మీ.. భయ్యా చాలా చాలా మాటలు చెప్పాడు. మనం మురికిగా ఉంటామని, మనకు చదువు రాదని, మనం దొంగతనాలు చేస్తామని, మనకు తిండి దొరకదు, మనకు మాట్లాడే పద్ధతి తెల్వదని.. ఇలా ..’

చిరాకుపడుతూ రహమాన్‌ ‘విన్నావా, నువ్వే?’ అన్నాడు.భార్య విసుక్కుంటూ ‘విన్నాను, ఔను, ఇంకా ఏం సంగతులు లాతీ?’ అడిగింది. 
పిల్లాడు చెప్పాడు, ‘నేను చెప్పనా అమ్మీ.. భయ్యా ఇంకా ఏమన్నాడంటే, ఇందులో మన తప్పే వుంది అన్నాడు.’‘ఔను’ కూతురు అందుకుంది. ‘పెద్దమనుషులు కావాలనే మనల్ని తోక్కేస్తున్నారు. ఐనా మనం నోరు విప్పం’ అంటూ తండ్రి వైపు తిరిగి ‘అబ్బా, ఈ మనుషులు ఎవరు?’ అడిగింది.  అబ్బా మాత్రం దయ్యం పట్టినట్లు కూర్చున్నాడు. ఏమంటాడు? పిల్లాడు చెప్పసాగాడు,‘అబ్బా, వాళ్లలో ఎవరైతే పెద్దమనుషులుగా వున్నారో అందరూ ఇదే మాట అన్నారు. మేము కూడా మనుషులమే, మాకూ జీవించే హక్కు వుంది, మనమంతా మేల్కోవాలి అని!’ 

అమ్మీ ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. ముఖం వెలుగుతో నిండిపోయింది . ‘వింటున్నావా, సలీం మాటలు..’ రహమాన్‌ ఇప్పుడు కూడా నోరు విప్పలేదు. కూతురు అంది,‘ఇంకా అమ్మీ.. భయ్యా నాతో అన్నాడు, ఇక నేను ఇంటికి రాను అని.’‘రానన్నాడా?’
‘ఔను అమ్మీ..’రహమాన్‌ మత్తు ఒక్కసారిగా దిగిపోయింది, ‘ఎందుకు రాడు, మనం మురికిగా, అసహ్యంగా ..?’‘కాదు అబ్బా..’  కూతురు గాంభీర్యాన్ని పులుముకొని చెప్పింది.. ‘భయ్యా నాతో చెప్పాడు, ఇక నుండి ఈ ఇంట్లో ఉండను, కొత్త ఇల్లు తీసుకుంటాను, చాలా మంచి ఇల్లు, శుభ్రంగా వుండే ఇల్లు. అబ్బాతో చెప్పు, అక్కడే ఉంటే గొడవలవుతాయి.. మనపై ఎప్పుడూ పోలీసులు ఒక కన్నేసి వుంచుతారు. ఒకవేళ  పోలీసులే వస్తే అబ్బా ఉద్యోగం వున్నది కూడా ఊడిపోతుంది అని..!’కానీ, తను అబ్బా ఐతే కదా చెప్పడానికి.. భూకంపం వచ్చినట్లు అతని తల పగిలి పోసాగింది. తలగిర్రున తిరగసాగింది, ఆగకుండా!  

 మూల రచయిత పరిచయం :
సుప్రసిద్ధ హిందీ రచయిత విష్ణు ప్రభాకర్‌  ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో, 1912 జూన్‌ 21న జన్మించారు. కథ, నవల, కవిత్వం, విమర్శ, నాటకం, బాల సాహిత్యం ఇలా అనేక ప్రక్రియల్లో రచనలు చేసిన సాహితీవేత్త. ఆయన రాసిన నవలల్లో ఢల్‌ తీ రాత్, స్వప్నమయి, అర్ధనారీశ్వర్, పర్‌ఛాయీ, కథల్లో ‘రహమాన్‌ కా బేటా’ ప్రముఖమైనవి. మూర్తి దేవి సమ్మాన్, సాహిత్య అకాడమీ, సోవియట్‌ల్యాండ్‌ నెహ్రూ అవార్డు, పద్మభూషణ్‌ వంటి పురస్కారాలందుకున్నారు. 2009, ఏప్రిల్‌ 11న ఢిల్లీలో మరణించారు.

రహమాన్‌ ఎలాంటి వాడైనా 
అంత మూర్ఖుడు కాదు. అతనికర్థమైంది.. తాను భార్య మనసును నొప్పించాడని! కానీ ఏం జేయగలడు? సలీం అంటే తనకేం ప్రేమ లేదా? కడుపు కట్టుకొని తనే కదా అతన్ని స్కూలుకి పంపింది. అతని కోసమే గదా, అవసరం పడితే పెద్దమనుషుల ముందు, డిప్టీల ముందు, అధికారుల ముందు కాళ్లావేళ్లా పడి దేహీ అని అర్థిస్తాడు. తల్లడిల్లిపోతాడు. ఇంత  గాఢమైన ప్రేమ వుంది కనుకనే ఇంతలా బాధపడేది.

హిందీ కథ :  రహమాన్‌ కా బేటా 
మూల రచయిత :  విష్ణు ప్రభాకర్‌ 
తెలుగు అనువాదం: 
డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement