‘ఫోస్‌ డీయోన్‌’.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే..! | Sakshi
Sakshi News home page

‘ఫోస్‌ డీయోన్‌’.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే..!

Published Sun, Apr 14 2024 2:04 PM

Have You Heard About The Secret Of The Creation Of Fosse Dionne Underground Watercourse - Sakshi

సృష్టి రహస్యాల్లో.. ప్రకృతి ఒడిసిపట్టిన అందాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి సోయగానికి మానవనిర్మాణం జతకలిస్తే ఇదిగో ఇలానే.. అద్భుతం అనిపిస్తుంది. ‘ఫోస్‌ డీయోన్‌’.. ఇదో భూగర్భం జలాశయం. చూడటానికి పెద్ద బావిలా కనిపిస్తుంది. కానీ  నిరంతర ఊట లాంటిది ఇది. ఫ్రాన్స్‌కు ఈశాన్యంలో ఉన్న టోనెరే నగరం నడిబొడ్డునున్న ఈ నీటి కొలను.. 18వ శతాబ్దంలో బయటపడిందట. ఆ వెంటనే ‘షెవాలీర్‌ డి ఇయాన్‌’ అనే రాయబారి దీన్ని అందమైన కట్టడంగా మార్పించాడు. గుండ్రటి పెద్ద నుయ్యి.. లోపలికి బయటికి కొన్ని మెట్లు.. అర్ధచంద్రాకారంలో ఇల్లు మాదిరి పెంకులతో చూరు కట్టించాడు. ఒకవైపు ఆ ప్రహరీకి ఆనుకుని పెద్దపెద్ద బిల్డింగ్స్‌ ఉంటే.. మరోవైపు ఆ జలాశయానికి తోవ ఉంటుంది.

నీటిధారకు అనువుగా ఎత్తుపల్లాలతో నిర్మించిన ఈ నిర్మాణం.. స్వచ్ఛమైన నీళ్ల మధ్య ఆకుపచ్చని నాచుమొక్కలతో.. పరిసరాల ప్రతిబింబాలతో.. ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఈ పురాతనమైన నుయ్యి.. పైకి కనిపించినంత రమ్యమైనది మాత్రం కాదు. దీని లోతెంతో.. మూలమేంటో.. నేటికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలలో చాలామంది ప్రాణాలనే కోల్పోయారు. ఈ బావి నుంచి ప్రతి సెకనుకు 311 లీటర్ల నీరు బయటికి వస్తుంది. అయితే కాలానికి తగ్గట్టుగా దీని వేగం.. పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. దీనిలోపల పెద్దపెద్ద గుహలు, సున్నపురాయితో ఏర్పడిన సన్నటి సందులు, మలుపులు ఉంటాయి.

అయితే ఫ్రెంచ్‌ ఇతిహాసాలు.. ఈ జలాశయం గురించి చాలా కథలను వినిపిస్తాయి. మధ్యయుగంలో మనుషులు.. ఈ నీటిని ఉపయోగించుకునే జీవనం కొనసాగించారట. 7వ శతాబ్దంలో ఈ కొలనును కాకాట్రైస్‌ అనే పాములాంటి జీవి ఆక్రమించుకుని.. మనుషుల్ని దరిదాపుల్లో తిరగనిచ్చేది కాదట. ఈ జీవి డ్రాగన్స్‌లా రెండు కాళ్లతో.. సగం కోడిపుంజులా.. సగం బల్లిలా కనిపిస్తుందట. ‘సెయింట్‌ జీన్‌ డి రీమ్‌’ అనే సన్యాసి.. అప్పట్లో ఈ కాకాట్రైస్‌ను చంపి.. ఈ బావిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడట.

ఈ ఫోస్‌ డీయోన్‌లో పొంగుతున్న నీరు.. ఎక్కడినుంచి వస్తుందో తేలలేదు. ఎంత ప్రత్యేక శిక్షణపొందిన డైవర్‌ అయినా సరే.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే. మొదటిసారి 1974లో ఇద్దరు డైవర్స్‌.. దీని లోతును, జన్మస్థానాన్ని కనిపెట్టడానికి లోపలికి వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. 1996లో మరొక డైవర్‌ అదే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో చాలా ఏళ్లపాటు దీనిలో ఈతకు అనుమతుల్లేకుండా పోయాయి. ఇక 2019లో డైవర్‌ పియరీ–ఎరిక్‌ డిజైనే.. దీనిలో 1,214 అడుగుల (370 మీటర్లు) మార్గాలను అన్వేషించారు.

అదృష్టవశాత్తు అతను సజీవంగా తిరిగి వచ్చాడు కానీ.. దీని మూలాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు. అయితే అతడికి ఆ బావిలో ఎలాంటి పాములు, చేపలు, అతీంద్రియశక్తులు కనిపించలేదట. కానీ లోపల మార్గం మాత్రం.. ఎంతటి తెలివైన వారినైనా తికమక పెట్టేలానే ఉందట. ఏది ఏమైనా ఈ జలాశయం ఎక్కడ పుట్టింది.. దీని లోతెంత? ఇందులో నిరంతరం నీరు ఎలా ఊరుతోంది? వంటి సందేహాలు తేలకపోవడంతో ఇది.. మిస్టీరియస్‌గానే మిగిలిపోయాయి. — సంహిత నిమ్మన

ఇవి చదవండి: 'ఖైమర్‌ అప్సర'గా భారత దౌత్యవేత్త!

Advertisement
Advertisement