ప్రవక్త బోధలు సమాజానికి సంజీవని | Milad Un Nabi Festival Special Article | Sakshi
Sakshi News home page

ప్రవక్త బోధలు సమాజానికి సంజీవని

Published Sun, Nov 1 2020 6:21 AM | Last Updated on Sun, Nov 1 2020 6:33 AM

Milad Un Nabi Festival Special Article - Sakshi

ద్వేషించిన వారిని ప్రేమించడం... తిట్టిన వారిని దీవించడం... ప్రాణశత్రువును సైతం క్షమించడం... ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియకపోవడం... మానవజాతిని సాఫల్యశిఖరాలకు చేర్చడానికి అహర్నిశలూ శ్రమించడం... ఇవి కేవలం ప్రవక్తల్లో మాత్రమే కనిపించే లక్షణాలు. అలాంటి ప్రవక్తల పరంపరలో చివరివారు, మానవ మహోపకారి ముహమ్మద్‌ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం.  ముహమ్మద్‌ ప్రవక్త చదవడం, రాయడం రాని నిరక్షరాసి. అయినా ఆయన బోధనలు యావత్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు, సవాళ్ళకు ఆయన పరిష్కారం చూపారు. ఒక కులానికో, మతానికో ఆయన బోధనలు పరిమితం కాలేదు. యావత్‌ మానవ సమాజానికే సంజీవని వంటివి. 

రబ్బివుల్‌ అవ్వల్‌ మాసం 12 తేదీన ప్రవక్తవారు మక్కా నగరంలో జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్‌ తల్లిదండ్రులు. జననానికి రెండునెలల ముందే తండ్రినీ, ఆరేళ్ళప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య పెంచారు. మక్కానగర ప్రజలు ముహమ్మద్‌ ప్రవక్తను, ఆయన సందేశాన్ని, ఉద్యమాన్ని వ్యతిరేకించారు, ఆయనపట్ల, ఆయన సహచరులపట్ల అమానుషంగా ప్రవర్తించారు. అయినా ఆయన వారిని క్షమించారు. నగరవాసులు కరువుకోరల్లో చిక్కుకున్నప్పుడు, వారికోసం ఆహార సామగ్రి పంపించారు. మక్కాలోని పేదలకు పంచడానికి ఐదువందల బంగారు నాణాలు పంపారు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలపట్ల ఆయన కరుణతో వ్యవహరించారు. మానవుల పట్ల ఆయనకున్న అపార ప్రేమను మక్కా విజయానంతరం మరింత స్పష్టంగా గమనించవచ్చు. ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించి, ద్వేషించిన ప్రాణశత్రువులు, ఇరవై సంవత్సరాల పాటు ఆయనతో యుధ్ధాలు చేసినవారు లొంగిపోయి తలలు దించుకొని, చేతులు కట్టుకొని ఆయన ముందు నిస్సహాయంగా నిలబడినప్పుడు ఆ మహనీయుడు వారందరినీ క్షమించి వదిలేశారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విజేతలు ప్రత్యర్ధుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారు. తలలు కోయండం, ఊచకోతలకు పాల్పడడం, హింసించడం, యావజ్జీవ శిక్షలు విధించడం లాంటి అమానుష చేష్టలకు పాల్పడిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. కాని ప్రాణ శత్రువును క్షమించి వదిలేసిన విజేత ఒక్క ముహమ్మద్‌ ప్రవక్తవారు తప్ప మరొకరు కనబడరు. ఆయన పట్ల శత్రుత్వం వహించినవారు, న్యాయపరంగా, నైతికపరంగా ఏవిధంగా చూసినా దోషులే, శిక్షార్హులే. వారిని శిక్షించడం సమంజసం, న్యాయం. కాని మానవాళిని అపారంగా ప్రేమించే ప్రవక్త మహనీయులు మాత్రం వారి నేరాలన్నిటినీ క్షమించి వదిలేశారు.

అంతేకాదు, ఒక సాధారణ ప్రకటన చేస్తూ, ‘ఈరోజు మీకు ఎలాంటి శిక్షా విధించబడదు. మీరంతా సర్వ స్వతంత్రులు’ అని ప్రకటించారు. తాయెఫ్‌ అనే ఊరిలో కేవలం ధర్మం గురించి మాట్లాడినందుకు ఆయన్ని రక్తసిక్తమయ్యేలాకొట్టి, హింసించారు. అయినా ఆయన వారిని పల్లెత్తుమాట అనలేదు, దైవదూతలు వారిని, ఆఊరిని నాశనం చేస్తామంటే ఆయన అంగీకరించలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు. క్షమించి వదిలేశారు. ఆయన ఏనాడూఎవరి మనసునూ నొప్పించలేదు, ఎవరి హృదయాన్నీ గాయ పరచలేదు. చివరికి ఆయన్ని హత్యచెయ్యాలని కుట్రపన్నిన వారిని, అన్నంలో విషం కలిపిన వారినీ క్షమించారు. ప్రవక్త మహనీయులు చాలా నిరాడంబరమైన జీవితం గడిపారు. అందరితో సమానంగా, నలుగురిలో ఒకడిగా ఉండేవారు. తనకోసం ప్రత్యేకహోదా, గౌరవం ఏనాడూ కోరుకోలేదు.ఆహారం, వస్త్రాల విషయంలోనూ ఎలాంటి ప్రత్యేకతలూ పాటించలేదు. తన దుస్తులు తానే ఉతుక్కున్నారు, తన చెప్పులు తానే కుట్టుకున్నారు. ఇంటిపనుల్లో, వంటపనుల్లో ఇంట్లోవాళ్ళకు సహకరించారు. బహిరంగసభల్లో ఆయన తనకోసం ప్రత్యేక స్థలాన్ని, ఆసనాన్ని కోరుకోలేదు. తనముందు ఇతరులు గౌరవసూచకంగా నిలబడడం, నాయకుడిగా సంబోధించడాన్ని కూడా ఆయన ఇష్టపడలేదు. అలాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. బహిరంగ ప్రదేశాల్లో సైతం సహచరులతో సమానంగా పనిచేసేవారు.

యుద్ధరంగంలో అయినా, ప్రయాణాల్లో అయినా, కందకాలు తవ్వుతున్నప్పుడైనా, మసీదులు నిర్మిస్తున్నప్పుడైనా సహచరులతో సమానంగా కష్టపడ్డారు. ఇటుకలు మోయడం, రాళ్ళు పగలగొట్టడం లాంటి పనులన్నీ చేశారు. మానవ సమానత్వాన్ని ఇంతగొప్పగా ఆవిష్కరించిన మహాప్రవక్త ఆదర్శాలివి. వారసత్వంగా మనకందిన ఈ ఆదర్శాలను, ఆయన అనుచర సమాజంగా మనం మన స్థాయిలో ఆరించవలసిన అవసరం ఉంది. మానవాళి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, సమాజం సంక్షోభానికి గురైనప్పుడు పరిష్కారం కోసం ప్రయత్నించాల్సిన, ముహమ్మద్‌ ప్రవక్త బోధలు, ఉపదేశాలవైపు మరలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఆ మహనీయులు గొప్ప దైవప్రవక్త అయి ఉండి కూడా ఒక సామాన్యుడిలా, సామాజిక కార్యకర్తలా సమాజానికి సేవ చేస్తూ, ప్రజల్ని సన్మార్గపథాన నడిపించారు. ఇహపర వైఫల్యాలనుండి రక్షించారు. సమాజంలోని సమస్త అసమానతలు, అమానవీయతలతో పాటు, అన్నిరకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలను రూపుమాపారు. మానవులంతా ఒక్కటేనని, మనిషీ మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసంగాని, ఆధిక్యతకాని లేదని చాటారు. అందరూ సమానమే, అంతా ఒక తల్లిదండ్రి బిడ్డలే అన్నది ఆయన సందేశం. ఆధిక్యతకు, గౌరవానికి అసలైన కొలమానం నీతి నిజాయితీ, సత్‌ ప్రవర్తనే అన్నది ఆ మహనీయుని నిర్వచనం. మానవ సమానత్వానికి, సామరస్యం, సోదరభావాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. సాటి మానవుల ధన, ప్రాణాలను హరించడం, వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం, వారి మనో భావాలను గాయపరచడం, వారి హక్కులను కాలరాయడం ఆయన దృష్టిలో మహా పాతకం. క్షంతవ్యం కాని నేరం. ఆయన బోధనలు మాత్రమే నేటి మన సమాజానికి సంజీవిని.   – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement