ప్రపంచంలోని పేరున్న స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ రోమా అగర్వాల్‌  | Roma Agrawal: Structural engineers are unsung heroes | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోని పేరున్న స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ రోమా అగర్వాల్‌ 

Published Sat, Aug 12 2023 6:28 AM | Last Updated on Sat, Aug 12 2023 10:11 AM

Roma Agrawal: Structural engineers are unsung heroes - Sakshi

ప్రపంచంలోని ఎన్నో అద్భుత నిర్మాణాల వెనుక రోమా అగర్వాల్‌ సృజనాత్మక కృషి ఉంది. ‘నీ ఆసక్తే నీ గురువు’ అంటున్న రోమా అగర్వాల్‌ ప్రపంచంలోని ప్రసిద్ధ స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ (ఎనలైజ్, డిజైన్, ప్లాన్, రీసెర్చ్‌)లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. చరిత్రలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. ఆ అద్భుత నిర్మాణాలకు ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఔపోసన పట్టినవాళ్లే విజేతలు అవుతారు. రోమా అగర్వాల్‌ ఈ కోవకు చెందిన విజేత...

ముంబైలో పుట్టిన రోమా అగర్వాల్‌కు చిన్నప్పుడు ‘లెగో’ ఆడడం అంటే ఇష్టం. స్కూల్‌ రోజుల నుంచి తనకు ఫిజిక్స్, మ్యాథ్స్‌లు ఆసక్తికరమైన సబ్జెక్ట్‌లు. ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ అయిన తండ్రి, అగర్వాల్‌కు వచ్చే ఎన్నో సందేహాలను క్షణాల్లో తీర్చేవాడు.
‘యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌’లో ఫిజిక్స్‌లో డిగ్రీ చేసిన అగర్వాల్‌ ‘ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌’లో స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌సీ చేసింది. యూనివర్శిటీలలో పాఠాల కంటే ప్రాక్టికల్‌ వర్క్‌ ఎక్కువగా ఉండేది. దీనికితోడు అద్భుతమైన ప్రతిభ ఉన్న విద్యార్థులతో స్నేహం తనకు ఎంతగానో ఉపకరించింది.

చదువు పూర్తయిన తరువాత ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ సంస్థ ‘డబ్ల్యూ ఎస్పీ’లో చేరింది. ఒక ఫుట్‌బ్రిడ్జి కోసం పని చేయడం తన ఫస్ట్‌ ప్రాజెక్ట్‌. లండన్‌లోని ది షార్డ్‌ (షార్డ్‌ లండన్‌ బ్రిడ్జి) ప్రాజెక్ట్‌ కోసం ఆరు సంవత్సరాలు పని చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను తన కెరీర్‌ హైలైట్‌గా చెబుతుంటుంది అగర్వాల్‌.
‘ఇలాంటి ప్రాజెక్ట్‌లు కెరీర్‌లో అరుదుగా మాత్రమే వస్తాయి’ అంటుంది. ‘ఒక ప్రాజెక్ట్‌ కోసం పనిచేయడం ఆషామాషీ విషయం కాదు. ఎంతో మంది ఇంజనీర్‌లు, ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెంట్‌లు, సర్వేయర్‌లు, క్రియేటివ్‌ విజన్‌ ఉన్నవారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తమవైన నైపుణ్యాలు, ఆలోచనా విధానం ఉంటుంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్లానింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్‌ మీద నిర్మాణ నమూనాను గీసుకోవడం నుంచి అది నిర్మాణ రూపంలో కనువిందు చేసే వరకు ప్రతి దశలో ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది’ అంటుంది అగర్వాల్‌.

తాను ‘డబ్ల్యూ ఎస్పీ’లో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలో స్త్రీలు తక్కువగా ఉండేవారు. ‘ది షార్డ్‌’ కోసం పనిచేస్తున్న రోజుల్లో ‘ఈ రకంగా పనిచేస్తున్నాం’ అని వివరించడానికి స్కూల్స్‌కు వెళ్లి క్లాసులు నిర్వహించేది అగర్వాల్‌. తాను చెబుతున్నప్పుడు అమ్మాయిలలో ఎలాంటి ఆసక్తి లేకపోవడాన్ని గమనించి బాధగా అనిపించేది.
‘అద్భుతమైన కెరీర్‌ను అమ్మాయిలు మిస్‌ అవుతున్నారు’ అనుకునేది అగర్వాల్‌.

‘అయ్యో!’ అనుకోవడానికే పరిమితం కాకుండా ‘యువర్‌ లైఫ్‌ క్యాంపెయిన్‌’ ఫౌండింగ్‌ మెంబర్‌గా ఎన్నో పాఠశాలల్లో సైన్స్, ఇంజనీరింగ్‌లపై ఆసక్తి కలిగేలా, పెరిగేలా అవగాహన సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. సైన్స్, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి టీవీలలో ఎన్నో ప్రోగ్రామ్స్‌ చేసింది.
‘ఒకప్పుడు ఇంజనీరింగ్‌ చేసిన మహిళలు అంటూ ఉండేవారు కాదు. ఆ తరువాత వేళ్ల మీద లెక్కబెట్టగలిగే స్థాయిలో ఉండేవారు. ఆ తరువాత వారి సంఖ్య పెరుగుతూ పోయింది. రాత్రికి రాత్రే మార్పు రాదు అనేదానికి ఇదే నిదర్శనం’ అంటుంది అగర్వాల్‌.

ప్రపంచంలోని పేరున్న స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రోమా అగర్వాల్‌ తాను చేసిన ప్రయాణం గురించి ఇలా అంటోంది...
‘సైన్స్, మ్యాథ్స్‌పై ఆసక్తి వల్ల ఏదో సాధించాలనే తపన మొదలైంది. ఏం సాధించాలి? ఎలా సాధించాలి? అనేది మాత్రం తెలియదు. అయితే ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మన కోసం ఎన్నో ద్వారాలు తెరుచుకుంటాయి. మనం ఏం సాధించాలి, ఎలా సాధించాలి అనేది ఆ ప్రయాణ అనుభవాలే పాఠాలై బోధిస్తాయి’       

ప్రపంచాన్ని మార్చిన ఏడు ఆవిష్కరణలు
స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌గా పేరు తెచ్చుకున్న అగర్వాల్‌ మంచి రచయిత్రి కూడా. గతంలో బిల్ట్‌: ది హిడెన్‌ స్టోరీస్‌ బిహైండ్‌ అవర్‌ స్ట్రక్చర్స్, హౌ వాజ్‌ దట్‌ బిల్ట్‌? అనే పుస్తకాలు రాసింది. తాజాగా ‘నట్స్‌ అండ్‌ బోల్ట్స్‌’ పేరుతో పుస్తకం రాసింది. చక్రం నుంచి లెన్స్‌ వరకు ప్రపంచాన్ని మార్చేసిన ఏడు శాస్త్రీయ ఆవిష్కరణలను ఈ పుస్తకంలో ప్రస్తావించింది. అసాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించిన అసాధారణ శాస్త్రవేత్తలు, ఇంజనీర్‌ల గురించి రాసిన ఈ పుస్తకం యువతరానికి శాస్త్రీయ విషయాలపై ఆసక్తి కలిగించేలా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement