ఆ కుస్తీ శాలకు వెళితే 35 మంది యువతులు భారీ కసరత్తులు చేస్తూ కనిపిస్తారు. హర్యానాలోని సోనిపట్‌లో ‘యుద్ధవీర్ అఖాడా’ మహిళా రెజ్లర్ల గురుకులంగా వాసికెక్కింది.
ఉదయం 4.30 గంటలు.
ఆ అమ్మాయిలంతా లేచి మొదట చేయవలసిన పని బాదం పప్పును మెత్తగా నూరి చిక్కటి పా లతో తీసుకోవడం. ఆ తర్వాత శరీరంలో చురుకుదనం తెచ్చే చిన్నపా టి వ్యాయామాలు చేయడం. ఆ తర్వాత వ్యాయామ స్థాయిని పెంచుకుంటూ వడం. ఆపై గోదాలో దిగి ఒకటి రెండు కుస్తీలు ఆడటం. ఉదయం 8.30 వరకూ ఈ శిక్షణ సాగుతుంది. ఏ మాత్రం మార్పు ఉండదు. మళ్లీ సాయంత్రం ఇలాగే నాలుగు గంటల శిక్షణ ఉంటుంది.
ఢిల్లీకి గంటన్నర దూరంలో ఉన్న సోనిపట్ (హర్యాణ) అనే ఒక మోస్తారు పట్టణం శివార్లలో ఆవాల చేల పక్కన ఉన్న ‘యుద్ధ్‌వీర్ అఖాడా’ కేవలం మహిళా రెజ్లర్లకు ఉద్దేశించబడినది. దీనిని స్థాపించిన యుద్ధవీర్ స్వయంగా కుస్తీ యోధుడు. విశాలమైన ఈ శిక్షణా కేంద్రంలో గోడల నిండా అతడు తెచ్చిన మెడల్స్ వేలాడదీసి ఉంటాయి. ప్రస్తుతం అతడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నందువల్ల అతని తండ్రి, శిక్షకులు ఈ అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
2016 నుంచి వచ్చిన ఊపు
హర్యాణలో ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి పంపడం, ఆటలకు దూరంగా ఉంచడం ఆనవాయితీ. అయితే 2016 రియో ఒలింపిక్స్‌లో హర్యాణ నుంచి సాక్షి మాలిక్ ఒలింపిక్స్‌లో పతకం తేవడంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రమంతా మహిళా కుస్తీ గురించి చర్చించుకోవడం మొదలెట్టింది.
అదే సంవత్సరం ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ వచ్చి ఆడపిల్లల కుస్తీని కథాంశంగా చూపి సూపర్‌హిట్ కొట్టడంతో అక్కడి తల్లిదండ్రులు, ఆడపిల్లలు కుస్తీని తమ భవిష్యత్తుకు ఒక మంచి మార్గంగా భావించారు. అది గమనించిన యుద్ధ్‌వీర్ ఆ మరుసటి సంవత్సరం ఈ అకాడెమీని తెరిచాడు.
గురుకుల విద్య
యుద్ధ్ వీర్ అఖాడాలో 10 ఏళ్లు నిండిన వయసు నుంచి 15 ఏళ్ల లోపు చేరవచ్చు. 20 ఏళ్ల వయసు వచ్చేవరకు సాధన చేయాల్సి వుంటుంది. అన్నాళ్లు అక్కడే ఉండివాలి. అయితే ఈ విద్య ఉచితం కాదు. ఒక్కో స్టూడెంట్ నెలకు కనీసం 15 వేలు చెల్లించాలి. శిక్షణ ఇస్తూ మంచి ఆహారం కూడా ఇవ్వాలంటే కనీసం ఈ మాత్రం ఫీజు అవసరం అని నిర్వాహకులు అంటారు.
సంప్రదాయ జిమ్‌తో పా టు కొయ్యదుంగను ఈడ్చడం, టైర్లను సుత్తితో బాదడం, మట్టి గోదాలో కుస్తీ ఆడటం వంటి శిక్షణ ఉంటుంది. నడుముకు బలం రావడానికి, చేతుల్లో ఒడుపు రావడానికి రకరకాల వ్యాయామాలు చేయిస్తారు.
ఆశలు... ఆకాంక్షలు
ఇక్కడ చేరిన వారంతా ఇప్పటికే అండర్ 15, అండర్ 17 కుస్తీ పోటీల్లో జాతీయ స్థాయిలో ఆడి పతకాలు తెస్తున్నారు. జూనియర్ ఛాంపియన్ బిపా ష దహియా ఇక్కడ ఇంకా శిక్షణలో ఉంది. కామన్‌వెల్త్, ఒలింపిక్స్‌లో ఆడి ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవాలని, ఆర్మీలో చేరాలని వీరంతా భావిస్తున్నారు.
‘మేము ఐదుగురం అక్కాచెల్లెళ్లం. కొడుకు లేని కారణాన మా నాన్న మాలో ముగ్గుర్ని ఇక్కడికి పంపించాడు. మేము దృఢంగా, బలంగా ఉండాలని ఆయన కోరిక’ అని ఒకమ్మాయి అంది. సమాజంలో స్త్రీలపై ఉండే వివక్ష, హింసను తట్టుకోవడానికి మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.రెండు నిమిషాల్లో ఎత్తి కిందపడేయగల వీరిని చూస్తే ఎవరైనా సరే ఒళ్లు దగ్గర పెట్టుకోక తప్పదు మరి.
అలంకరణ లేదు
ఇక్కడ చేరే అమ్మాయిలందరూ మిలట్రీలోలాగా క్రాఫ్ చేయించుకోవాల్సి ఉంటుంది. టీషర్టులు, ట్రాక్ ప్యాంట్లు తప్పనిసరి. గబుక్కున చూస్తే వీరంతా అబ్బాయిలకు మల్లే కనిపిస్తారు. ఆదివారం రోజు ఇచ్చే వెసులుబాటులో సరదాగా వంట చేయడం, ఆ సాయంత్రం నృత్యంతో సేద తీరడం చేస్తారు. ‘మేమంతా స్నేహితులమే అయినా గోదాలో ఉన్న కాసేపు శత్రువులమే’ అని నవ్వుతారు. ‘ఓడినవారు ఐదు నిమిషాల్లో మాట కలిపేయాలి అనేది నియమం’ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment