రెక్కలకు సెక్యూరిటీ చీఫ్‌ | Usha Padhee Is New Director General Of The Civil Aviation Security Agency | Sakshi
Sakshi News home page

రెక్కలకు సెక్యూరిటీ చీఫ్‌

Published Mon, Aug 31 2020 12:54 AM | Last Updated on Mon, Aug 31 2020 12:54 AM

Usha Padhee Is New Director General Of The Civil Aviation Security Agency - Sakshi

పౌర విమానయాన భద్రతా సంస్థ కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఉషా పథి

గాలిలో ప్రయాణం! పక్షితో కూడా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట నేత్రాలు ఉంటాయి. హైజాకర్‌లు.. బాంబర్‌లు.. ఇంకా.. ఊహించని ఉపద్రవాలు. వాటి నుంచి భద్రతకే బి.సి.ఎ.ఎస్‌. ఆ బి.సి.ఎ.ఎస్‌.కు కొత్త బాస్‌.. 
ఉషా పథి, ఐఏఎస్‌. తొలి మహిళా డైరెక్టర్‌ జనరల్‌.

ఒడిశా క్యాడర్‌ ఐ.ఎ.ఎస్‌ అధికారి ఉషా పథి. 1996 బ్యాచ్‌. కర్ణాటక అమ్మాయి. బి.టెక్‌. సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌ డివిజన్‌. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఢిల్లీలో ఉద్యోగం. తొంభై ఆరు అంటే ఇప్పటికి ఇరవై నాలుగేళ్లు. పదవీ విరమణ వయసు అరవై ఏళ్లు కనుక ఇంకా తొమ్మిదేళ్లు ప్రభుత్వానికి ఆమె ఒక ధీమా. 1969లో జన్మించారు ఉష. సర్వీసు లెక్కలు, వయసు లెక్కలు కాదు. గత రెండున్నర దశాబ్దాలలో దేశమంతటా వివిధ హోదాల్లో ఆమె చేపట్టిన బాధ్యతల జాబితా ఓ గవర్నమెంట్‌ ఫైల్‌ అంత ఉంటుంది. అయితే అందులో ఒక్క అవార్డు పత్రం కూడా ఉండదు. ఆమె పనితీరే ఆమెకు గుర్తింపు.

ఫొటోలలో ఆమె అబ్దుల్‌ కలామ్‌తో, ప్రణబ్‌ ముఖర్జీతో కనిపించవచ్చు. విధుల నిర్వహణ లో భాగంగా మాత్రమే తన ప్రమేయం లేకుండా వాళ్లతో కలిసి ఉన్నప్పటి ఫొటోలే అవన్నీ. సర్వీసులో ఉండగానే ఎం.బి.ఎ. ఫారిన్‌ డిగ్రీ చేశారు. న్యూఢిల్లీ, బెంగళూరు, ముస్సోరి, కోయంబత్తూరు, పంచాగ్ని (మహారాష్ట్ర)లలో పాలనాపరమైన శిక్షణ పొందారు. అంటే క్షణం కూడా ఎక్కడా ఆగలేదని! ఐఎఎస్‌ ఆఫీసర్‌ల మిడ్‌ కెరీర్‌ ప్రోగ్రామ్‌లో కూడా శిక్షణ తీసుకున్నారు. ఉషకి కొత్తగా ఎక్కడికి పోస్టింగ్‌ వచ్చినా.. ఆమె కన్నా ముందుగా ఆమె కెరీర్‌ వెళ్లి ఆ సీట్లో కూర్చుంటుంది! లైఫ్‌ సైజ్‌ను కూడా దాటిపోయిన కెరీర్‌ ఆమెది!

ఉషా పథి శనివారం కొత్త విధుల్లోకి వచ్చారు. ఢిల్లీలోని ‘బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ’ (బి.సి.ఎ.ఎస్‌.) డైరెక్టర్‌ జనరల్‌ ఆమె ఇప్పుడు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ! నలభై రెండేళ్ల నుంచీ ఉంది బి.సి.ఎ.ఎస్‌. ‘డైరెక్టొరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ యావియేషన్‌’లో ఒక విభాగంగా 1978లో బి.సి.ఎ.ఎస్‌. ఏర్పాటైంది. అంతకు రెండేళ్ల క్రితం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌ అయిన అనుభవంతో  ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బి.సి.ఎ.ఎస్‌. స్వతంత్ర విభాగం అయింది. ఆ విభాగానికే ఉష ఇప్పుడు డైరెక్టర్‌ జనరల్‌.

ఇక నుంచి భారతదేశ విమానాల, విమాన ప్రయాణికుల భద్రత బాధ్యత ఉషదే! ఆమే కేర్‌ తీసుకోవాలి. గగనతలానికి కనురెప్ప ఉషా పథీ. ఈ పోస్టులోకి  రాకముందు శుక్రవారం వరకు ఆమె పౌర విమానయాన మంత్రిత్వశాఖలో జాయింట్‌ సెక్రటరీ. కొత్త కుర్చీలోకి వచ్చి కూర్చోగానే.. ‘ఎట్‌ లాస్ట్‌ ఎ శ్రీమతి.. ఈ పొజిషన్‌లోకి’ అని ఉష ట్వీట్‌ చేశారు. తొలి మహిళే కాదు, బి.సి.ఎ.ఎస్‌. డైరెక్టర్‌ జనరల్‌ అయిన మూడో ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌గా కూడా ఆమెకు ఇదొక గుర్తింపు. సాధారణంగా ఈ విభాగానికి చీఫ్‌లుగా ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌లు ఉంటారు. 

ఇరవై నాలుగేళ్ల కెరీర్‌లో నలభై ఎనిమిదేళ్ల సర్వీసు అనిపిస్తుంది ఉష గురించి వింటే. తొంభై ఆరులో సివిల్స్‌ పాస్‌ అయితే.. తొంభై ఎనిమిది వరకు ట్రైనింగ్‌. తర్వాత నుంచి లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ ఛాలెంజింగ్‌. సబ్‌ కలెక్టర్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్, కలెక్టర్, కలెక్టర్‌ అండ్‌ డీఎం. అలా 2004 వరకు వివిధ జిల్లాలు, ప్రాంతాలు! 2005 నుంచి డైరెక్టర్‌. సాంఘిక సంక్షేమం, పంచాయితీరాజ్, ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్, స్కూల్‌ అండ్‌ మాస్‌ ఎడ్యుకేషన్, టెక్స్‌టైల్‌ అండ్‌ హ్యాండ్లూమ్‌ శాఖలు. ఇవన్నీ 2015 వరకు. ఆ తర్వాతి నుంచీ సివిల్‌ ఏవియేషన్‌. ఒక ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌కు ఇదంతా మామూలే అనిపించవచ్చు. అయితే ఉష చేపట్టిన బాధ్యతలేవీ మామూలు శాఖలు కాదని ఈ లిస్ట్‌ చూస్తే అర్థమౌతుంది. సంక్షేమం, విద్య.. ఉద్యోగం.. ఎంత కీలకమైనవి. వాటిని ఉష సమర్థంగా నడిపించారు. ఉద్యోగంలోనే ఒక భాగం అయిన మరొక ప్రపంచం ఆమెకు.. భర్త అరవింద్, కొడుకు తేజ్‌. 

ఉషా పథీ భర్త అరవింద్‌ పథీ కూడా ఐ.ఎస్‌.ఎస్‌. ఆఫీసరే. ఇద్దరిదీ లవ్‌ మ్యారేజ్‌. ముస్సోరీ ఐ.ఎ.ఎస్‌. శిక్షణలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డారు. సివిల్స్‌ రాయకముందు ఉష లవ్‌ ఇంట్రెస్ట్‌ మాత్రం మెడిసిన్‌. తన తల్లిలా తనూ డాక్టర్‌ అవాలని అనుకున్నారు కానీ మెడిసిన్‌లో సీటు రాలేదు. ఇంజినీరింగ్‌ చదివి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ని ఎంచుకున్నారు. మంచిదైంది. అందించవలసిన సేవలు, చక్కబెట్టాల్సిన అనారోగ్య పరిస్థితులు వైద్యరంగంలో మాత్రమే ఉండవు కదా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement