సిరినామ సంవత్సరం | Funday Cover Story About Millets | Sakshi
Sakshi News home page

Funday Cover Story: సిరినామ సంవత్సరం

Published Sun, Feb 5 2023 8:40 AM | Last Updated on Sun, Feb 5 2023 8:58 AM

Funday Cover Story About Millets  - Sakshi

నేను చిన్న గింజనే.. కానీ చాలా గట్టిదాన్ని. ఇతర పంటలు మనలేని చోట్ల నేను పెరుగుతాను. ప్రతికూల వాతావరణాన్ని, కరువునూ తట్టుకుంటాను. ఏ పంటలూ చేతికి రాని కష్టకాలంలోనూ మీ కడుపు నింపుతాను. భూమిని, పర్యావరణ వ్యవస్థలను, జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తాను.  నాలో ఎన్నెన్నో పోషకాలున్నాయి. విభిన్న రంగులు, రుచులున్నాయి. ఎన్నో రూపాల్లో దొరుకుతాను.. ప్రాచీన సంస్కృతులు, సంప్రదాయాలను బాగా ఎరిగిన ప్రత్యక్ష సాక్షిని నేను. 

ఆవిష్కరణలకు నేనొక సుసంపన్న చెలిమను. నా సుగుణాలను ప్రజలందరితోపాటు భూగోళానికి కూడా పంచి పెట్టాలన్నది నా ఆశ.  కానీ, ఆ పనిని నేనొక్కదాన్నే చెయ్యలేను. అందుకే, మీ సాయం కోరుతున్నాను.. నన్ను మళ్లీ మీ భోజనాల్లోకి తెచ్చుకోమంటున్నాను. ‘వారసత్వ సుసంపన్నత.. సంపూర్ణ సామర్థ్యం’ ఇవీ నా భుజకీర్తులు. నేనేనండీ.. మీ చిరుధాన్యాన్ని!  

ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా అంతర్జాతీయ సమాజం అడుగులు వేస్తున్న సందర్భం ఇది.æముతక ధాన్యాలని, తృణధాన్యాలని ఛీత్కారాలతో చిరుధాన్యాలను దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశాం. భూతాపం, జీవన శైలి జబ్బుల విజృంభణతో తెలివి తెచ్చుకొని ‘పోషక ధాన్యాల’ (న్యూట్రి–సీరియల్స్‌) ఆవశ్యకతను గుర్తించాం. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నాం. చిరుధాన్యాలకు సుసంపన్న వారసత్వం ఉంది. సంపూర్ణ పౌష్టికాహార, ఆరోగ్య రక్షణ ఇవ్వగల సామర్థ్యం ఉంది. వరికి ఇచ్చిన స్థాయిలో సాగు, క్షేత్రస్థాయి ప్రాసెసింగ్‌ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ వరకు చిరుధాన్యాల ప్రోత్సాహక వ్యవస్థను నిర్మించటంపై ప్రభుత్వాలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన తరుణం ఇది.  

చిరుధాన్యాలు.. సిరిధాన్యాలు.. చిన్న చిన్న విత్తనాలతో కూడిన గడ్డి జాతి పంటల సమూహానికి చెందిన పంటలే ఈ చిరుధాన్యాలు. మనుషుల ఆహార అవసరాలతో పాటు పశువులు, చిన్న జీవాలకు మేత కోసం వీటిని ప్రపంచం అంతటా పండిస్తారు. ఇవి చాలా ప్రాచీనమైన పంటలు. మన పూర్వీకులు మొట్టమొదటిగా సాగు చేసిన పంటలు చిరుధాన్యాలే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొద్దిపాటి వర్షాలకే పండే పంటలివి. వీటిని మొట్టమొదటగా భారత్‌లో సాగైన అనేక రకాల చిరుధాన్యాలు తదనంతరం పశ్చిమ ఆఫ్రికాతోపాటు చైనా, జపాన్‌ తదితర 130 దేశాలకు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతల్లో ఆహార ధాన్యపు పంటలుగా విస్తరించాయి.  

ప్రాచీన సాహిత్యంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. మన దేశంలో చిరుధాన్యాల వినియోగం కాంస్య యుగం కన్నా ముందు నుంచే ఉన్నదని చరిత్ర చెబుతోంది. 50 ఏళ్ల క్రితం వరకు వ్యవసాయంలో చిరుధాన్యాలే ప్రధాన పంటలుగా ఉండేవి. స్థానిక ఆహార సంస్కృతిలో ఇవి అంతర్భాగమై కనబడేవి. పట్టణ ప్రాంతాల వినియోగదారులు ఎక్కువగా రిఫైన్డ్‌ ధాన్యాలపైనే ఆసక్తి చూపడంతో, రాను రాను చిరుధాన్యాల ప్రాధాన్యం తగ్గింది. ఆహారానికి వైవిధ్యాన్ని అందించే చిరుధాన్యాల స్థానంలో వరి, గోధుమల వినియోగం బాగా పెరిగింది. 

చిరుధాన్యాలు వర్షాధార, మెట్ట ప్రాంతాలకు అనువైన పంటలు. వీటిలో పోషక విలువలు ఎక్కువ. పండించడానికి ప్రకృతి/ఆర్థిక వనరుల ఖర్చు చాలా తక్కువ. అందుకే వీటిని అత్యంత మక్కువతో ‘సిరిధాన్యాలు’, ‘అద్భుత ధాన్యాలు’ లేదా ‘భవిష్య పంటలు’ అంటూ అక్కున చేర్చుకుంటున్నాం. ఈ చైతన్యాన్ని జనబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లటం పాలకులు, పర్యావరణ ప్రేమికులు, ఆరోగ్యాభిలాషులందరి కర్తవ్యం. 

అంతర్జాతీయ చిరు సంవత్సరం
2023.. ఇది అంతర్జాతీయ చిరుధాన్యాల పండుగ సంవత్సరం. భారత్‌ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ రెండేళ్ల క్రితం నిర్ణయించింది. 72 దేశాల మద్దతుతో ఈ అంతర్జాతీయ చిరుధాన్యాల పండుగ అమల్లోకి వచ్చింది. ఆరోగ్యపరమైన ప్రయోజనాలకు తోడుగా పర్యావరణ పరిరక్షణ పరంగా కూడా ఇవి మేలైన పంటలు. ఈ ఏడాదంతా చిరుధాన్యాలపై అవగాహన పెంచడం, ఆరోగ్య, పోషకాహార ప్రయోజనాల దృష్ట్యా, వీటి వినియోగం పెంచడానికి, సాగును విస్తృతం చేయడానికి అనువైన విధానాలు రూపొందించటంపైన మాత్రమే కాకుండా, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే రీతిలో మార్కెట్‌ అవకాశాలు పెంపొందించడంపైన కూడా దృష్టి సారించాల్సిన సమయమిది. 

మేజర్‌.. మైనర్‌ మిల్లెట్స్‌
పోషకాల గనులైన చిరుధాన్యాలను ప్రాథమికంగా రెండు విధాలుగా విభజించ వచ్చు. జొన్నలు, సజ్జలు, రాగులు.. గింజలపై పొట్టు తియ్యాల్సిన అవసరం లేని పెద్ద గింజల పంటలు. మేజర్‌ మిల్లెట్స్‌. కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగలు, అండుకొర్రలు.. గింజలపై నుంచి పొట్టు తీసి వాడుకోవాల్సిన చిన్న గింజల పంటలు. మైనర్‌ మిల్లెట్స్‌. పొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి రావటం వల్ల మైనర్‌ మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ క్లిష్టతరమైన పనిగా మారింది. అందువల్లనే ఇవి కాలక్రమంలో చాలా వరకు మరుగున పడిపోయాయి. 

ప్రపంచవ్యాప్తంగా అధికంగా సాగవుతున్న పంట జొన్న. మొత్తం చిరుధాన్యాల్లో దీని వాటా 55.8 శాతం. 2010 నాటికి 4.22 కోట్ల హెక్టార్లలో జొన్న సాగు చేయగా 6.02 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. 2019 నాటికి జొన్న సాగు విస్తీర్ణం 4.02 కోట్ల హెక్టార్లకు, దిగుబడి 5.79 కోట్ల టన్నులకు స్వల్పంగా తగ్గింది. భారత్‌లో 1.38 కోట్ల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. హెక్టారుకు సగటున 1,248 కిలోల చొప్పున 1.72 కోట్ల టన్నుల దిగుబడి వస్తోంది. మన దేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత నాలుగో ముఖ్యమైన పంట జొన్న. 40.9 లక్షల హెక్టార్లలో 34.7 లక్షల టన్నుల జొన్నలు పండుతున్నాయి. 

అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, అర్టెంటీనా, నైజీరియా, సూడాన్‌లో జొన్న విస్తారంగా సాగవుతోంది. భారత్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో సజ్జలు బాగా పండుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే.. 99.9% ఊదలు, 53.3% రాగులు, 44.5% సజ్జలు మన దేశంలోనే పండుతున్నాయి. అరికెలు, సామలైతే మన దేశంలో తప్ప మరెక్కడా పండించటం లేదని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్‌) తెలిపింది. చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగంగా మార్చుకొని  పౌష్టికాహార భద్రత పొందాలని ఐఐఎంఆర్‌ సూచిస్తోంది. 

14 రాష్ట్రాలు.. 212 జిల్లాలు..
భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశాన్ని చిరుధాన్యాల అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ఆహార భద్రతా మిషన్‌ కింద 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంపుదలకు కృషి ప్రారంభమైంది. 2022–23లో 205 లక్షల టన్నుల చిరుధాన్యాల దిగుబడి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఐఐఎంఆర్‌ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, ఆధునిక ఆహారోత్పత్తులను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసే కంపెనీలు, స్టార్టప్‌లకు నాలెడ్జ్‌ పార్టనర్‌గా చేదోడుగా నిలుస్తోంది. చిరుధాన్యాలతో 67 రకాల సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక చిరుతిళ్లను వ్యాప్తిలోకి తెస్తోంది. 

కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అనేక చోట్ల రెండు రోజుల మిల్లెట్‌ మహోత్సవాలను నిర్వహిస్తోంది. దేశంలో రెండో మిల్లెట్‌ మహోత్సవం ఇటీవలే విజయనగరంలో జరిగింది. చిరుధాన్యాలు సాగు చేసే రైతులు, స్వయం సహాయక మహిళా బృందాలకు, స్వచ్ఛంద సంస్థలకు, స్టార్టప్‌లకు ఈ మహోత్సవాలు మార్కెటింగ్‌ అవకాశాలను పెంపొందిస్తూ కొత్త ఊపునిస్తున్నాయి. మిల్లెట్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ముందుకొచ్చింది. 

బెంగళూరులో ప్రతి ఏటా జనవరిలో జరిగే అంతర్జాతీయ మిల్లెట్స్, ఆర్గానిక్‌ ట్రేడ్‌ఫెయిర్‌ సేంద్రియ చిరుధాన్యాల సాగు, వినియోగం వ్యాప్తికి దోహదం చేస్తోంది. మిల్లెట్‌ మిషన్‌ ద్వారా ఒడిశా ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిరుధాన్యాల సాగుకు, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. మిల్లెట్‌ బోర్డును ఏర్పాటు చేసింది. పంటల వారీగా మిల్లెట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయటం ద్వారా ఈ ఏడాది 4.87 లక్షల టన్నులకు చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టింది.

డయాబెటిస్, బీపీలకు చెక్‌ 
ప్రొటీన్లు, ఎసెన్షియల్‌ అమినో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చిరుధాన్యాలు పోషక సంపన్న ఆహారంగా గుర్తింపు పొందాయి. వరి, గోధుమలతో పోల్చితే డైటరీ ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడే వారికి చిరుధాన్యాలు అనువైనవి. ఆరోగ్యాన్ని పెంపొందించే ఫెనోలిక్‌ కాంపౌండ్స్‌తో కూడి ఉన్నందున అనేక జీవన శైలి సంబంధమైన వ్యాధులను ఎదుర్కోవడానికి మిల్లెట్స్‌కు మించిన ఆహారం లేదంటే అతిశయోక్తి కాదు. 

మైనర్‌ మిల్లెట్స్‌ను రోజువారీ ప్రధాన ఆహారంగా తినగలిగితే ఏ జబ్బయినా కొద్ది కాలంలో తగ్గిపోతుందని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌ వలి చెబుతున్నారు. ఊరూరా తిరిగి సభలు పెట్టి మరీ ప్రజలకు ‘సిరిధాన్యాలతో ఆహార వైద్యం’ చేస్తున్నారు. జబ్బులు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నా, జబ్బుల్ని సమూలంగా పారదోలాలన్నా సిరిధాన్యాలు, గానుగ నూనెలు, తాటి/ఈత బెల్లం వంటి దేశీయ ఆహారాన్ని రోజువారీ ఆహారంగా తీసుకోవటమే మార్గమని చెబుతూవస్తున్నారు. డా. ఖాదర్‌ చెబుతున్న విషయాలన్నీ ‘సాక్షి’ చొరవ, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల కృషితో ఉచిత పుస్తకాలు, యూట్యూబ్‌ వీడియోల రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.   

సబ్సిడీ ఇవ్వాల్సింది పోయి జీఎస్టీ పెంపా?!
పౌష్టికాహార లోపం ఎక్కువగా ఎదుర్కొంటున్న పేద ప్రజల ఆహారంలోకి చిరుధాన్యాలను తిరిగి తేవాలంటే.. వరితో సమానంగా చిరుధాన్యాలపై కూడా ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. అంతర్జాతీయ సంవత్సరం పేరుతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించటం, మీటింగ్‌లు, రోడ్‌షోలు పెట్టడంతో సరిపెడుతోంది. స్టార్టప్‌లు చిరుతిళ్లను అమ్మినంత మాత్రాన, ఎగుమతి చేసినంత మాత్రాన చిరుధాన్యాలు తిరిగి పళ్లాల్లోకి రావు. ఈ పని జరగాలంటే తగిన విధాన నిర్ణయాలు జరగాలి. చిరుధాన్య రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి. ఎమ్మెస్పీ ప్రకటించినా ప్రభుత్వ సేకరణ లేదు. సామలు, అండుకొర్రలు తప్ప తక్కువ ధరకే రైతులు అమ్ముకుంటున్నారు. రెండు, మూడు పంచాయతీలకు ఒక చోటైనా స్మాల్‌ మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయాలి. గోదాముల్లో నిల్వ చేయడానికి (రాగులు, కొర్రలకు తప్ప) ప్రమాణాలను నిర్ణయించలేదు. వరి బియ్యం స్థానంలో 25% చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వగలిగితేనే ప్రజల పళ్లాల్లోకి చిరుధాన్యాలు వస్తాయి. కానీ, కేంద్రం ఈ ఏడాదే చిరుధాన్యాల ఉత్పత్తులపై, ప్రాసెసింగ్‌ యంత్రాలపై జీఎస్టీని 5 నుంచి 18%కి పెంచింది. ప్రజాపంపిణీ వ్యవస్థలోను, అంగన్‌వాడీలకు సబ్సిడీపై చిరుధాన్యాలు ఇవ్వాలి. ఈ దిశగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. 
– ఎ. రవీంద్ర, డైరెక్టర్, వాసన్, స్వచ్ఛంద సంస్థ

ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని దేశంలో విస్తృతం చేయడానికి కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తూ చిరుధాన్యాల సాగు, వినియోగంపై విజ్ఞానాన్ని పంచుతున్నాం. మేలైన చిరుధాన్య వంగడాలను రూపొందించి, విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. కొత్తగా చిరుధాన్యాలను తినటం ప్రారంభించే వారు తొలుత ఉదయం/రాత్రి దోసెలు, ఇడ్లీలు వంటి టిఫిన్లతో మొదలు పెట్టటం మంచిది.

కొంత అలవాటైన తర్వాత అన్నంగా తీసుకోవచ్చు. మిల్లెట్‌ అటుకుల ఉప్మా చాలా బావుంటుంది. ఓట్స్‌కు బదులుగా వాడొచ్చు. వరి, గోధుమల్లో కన్నా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకేసారి మూడుపూటలా కేవలం చిరుధాన్యాలనే తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలను రోజుకు మూడు పూటలా అన్ని రకాల ఆహారాల్లోనూ నిక్షేపంగా తీసుకోవచ్చు.

చిరుధాన్యాలతో 67 రకాల ఆహారోత్పత్తులను తయారు చేసే ఆధునిక సాంకేతికతలను ‘న్యూట్రిహబ్‌’ ద్వారా అభివృద్ధి చేశాం. ఆహారోత్పత్తుల కంపెనీలకు, స్టార్టప్‌ సంస్థలకు అందిస్తున్నాం. ప్రతి నెలా 3వ శనివారం మా కార్యాలయంలో గృహిణులకు చిరుధాన్య వంటకాలపై నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్నాం. వివరాలకు మా వెబ్‌సైట్‌ చూడవచ్చు. 
– డా. సి.వి. రత్నావతి, సంచాలకులు

ఆయన చెప్పినట్లు కషాయాలు తాగి, సిరిధాన్యాలు తిని అనంతపురం జిల్లాలో ఓ గ్రామంలో 30 మంది డయాబెటిస్, బీపీల నుంచి బయటపడ్డారు. రెడ్స్, ఆర్‌డిటి స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో ఉచిత కామన్‌ కిచెన్‌ను నిర్వహిస్తూ, వైద్య పరీక్షల ద్వారా శాస్త్రీయంగా అన్ని వివరాలనూ నమోదు చేయటం విశేషం. ఇటువంటి అద్భుత ప్రయత్నాలు అన్ని చోట్లా జరగాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇటువంటి క్షేత్రస్థాయి ప్రయోగాలపై పరిశోధనలు చేపట్టాలి. ఆరోగ్య భారతాన్ని నిర్మించడటం ద్వారా ప్రపంచానికి సిరిధాన్యాల సత్తా చాటాలి. 

మిల్లెట్‌ మిక్సీలు 
చిరుధాన్యాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నది ఇటీవలి సంవత్సరాల్లోనే. కానీ, కొన్ని దశాబ్దాలుగా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న విశేష కృషిని మరువరాదు. తెలుగు రాష్ట్రాల్లో డెక్కన్‌ డవలప్‌మెంట్‌ సొసైటీ, టింబక్టు, సహజాహారం, వాసన్, ఎర్త్‌ 360, సంజీవని, మన్యదీపిక, సహజ సమృద్ధ వంటి స్వచ్ఛంద సంస్థలు చిరుధాన్యాల సాగును పెంపొందిం చడంతో పాటు వాటిని తిరిగి ప్రజల ఆహారంలోకి తేవడానికి ఉద్యమ స్థాయిలో విశేష కృషి చేస్తుండటం మంచి సంగతి. సహజ సమృద్ధ ఆధ్వర్యంలో ప్రచురితమైన ‘మిల్లెట్‌ క్యాలెండర్‌’ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ సంస్థల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టాలి. 

కొర్రలు, సామలు వంటి స్మాల్‌ మిల్లెట్స్‌ ధాన్యం పైన పొట్టు తీసి బియ్యం తయారు చేయడానికి సాధారణ మిక్సీలకు స్వల్ప మార్పులు చేస్తే చాలు. డా. ఖాదర్‌ వలితో పాటు వాసన్‌ స్వచ్ఛంద సంస్థ మిల్లెట్‌ మిక్సీలను రైతులకు, ప్రజలకు పరిచయం చేశారు. గ్రామ స్థాయిలో స్మాల్‌ మిల్లెట్స్‌ వినియోగంతో పాటు రైతుల ఆదాయం పెరగడానికి ఇది దోహదపడుతుంది. స్వావలంబనను సాధించే ఇటువంటి విజయాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.  

ప్రజల ఆహార అలవాట్లలో చిరుధాన్యాలను మళ్లీ భాగం చేయడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలకు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఓ మంచి అవకాశం. మన దేశంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. పంచాయతీ స్థాయిలో ప్రాసెసింగ్, వినియోగ అవకాశాలను, పోషకాహార భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి. నిర్మాణాత్మక కృషి చెయ్యాలి. ఆహారం సరైనదైతే ఔషధం అక్కరలేదు. ఆహారం సరిగ్గా లేకపోతే ఏ ఔషధమూ పని చేయదు’. ఆరోగ్యమే మహాభాగ్యమని చాటే మన సంప్రదాయ చిరుధాన్యాల ఆహారం తిరిగి మన వంట గదుల్లోకి, పళ్లాల్లోకి ఎంత ఎక్కువగా తెచ్చుకోగలిగితే పుడమికి, మనకు అంత మేలు. చిరుధాన్యాల పునరుజ్జీవానికి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఒక ఊతంగా మారి ప్రజా ఉద్యమంగా రూపుతీసుకుంటుందని ఆశిద్దాం
- పంతంగి రాంబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement