సెప్టెంబర్ 17.. తెలంగాణ తరతరాల బానిస సంకెళ్లను తెంచుకుని స్వాభిమానంతో తలెత్తుకున్న రోజు.. నాడు ఈ దేశహోంమంత్రి సర్దార్ పటేల్ అప్పుడే స్వాతంత్య్రం పొంది, స్వదేశీ సంస్థానాలను ఏకం చేసే పనిలో భాగంగా తెలంగాణకు విముక్తి కల్పించి, దేశ ఏకత్వాన్ని సంపూర్ణం చేస్తే.. నేడు దేశం అవినీతి కోరలలో చిక్కుకుని దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో నలిగి, కృశించిపోతున్న సమయంలో నరేంద్రమోదీ ప్రజలకు ఒక ఆశాకిరణంగా కనిపించి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి 70 ఏళ్ల తర్వాత అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయ ప్రతిష్ట తెచ్చాడు. నాడు సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేసే తన పనిని సెప్టెంబర్ 17 నాడు పూర్తి చేస్తే, నేటి నరేంద్రమోదీ జన్మదినం సెప్టెం బర్ 17 కావడం యాదృచ్ఛికం. ఇలా సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజ లను జాతీయ సంఘటనా పథంతో కలపడం తెలంగాణ సుకృతం.
2004–14 మధ్యకాలంలో సోనియాగాంధీ నేతత్వంలో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎన్నో జరిగాయి. ఆ ప్రభుత్వం చేయని కుంభకోణం లేదు. జరుపని అవినీతి లేదు. భూమ్యాకాశాలను ఏకం చేసిన మహా స్కాంలు ఆ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ఇలాంటి దుస్థితినుండి ఈ దేశాన్ని కాపాడేందుకు దేశ ప్రజల్లో 2014కు ముందు ఓ ‘నిశ్శబ్ద విప్లవం’ వచ్చింది. దేశ ప్రజలం దరూ సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్రమోదీని ఈ దేశ కాపలాదారుగా చేద్దామనుకొన్నారు. అంతే..! దేశం ఓ భరతమాత ముద్దుబిడ్డను అక్కున చేర్చుకొంది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ తన పని తాను చేసుకొంటూ గుజరాత్‌ను ఒక ఆదర్శ అభివద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం మోదీని అనేక విషమ పరీక్షలకు గురిచేసింది. అనేక విధాలుగా ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి చిరాకు కలిగించింది. అయినా ‘ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్’ అన్నట్లుగా మోదీ రాచమార్గంలో వెళ్లిపోయారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, మునుపెన్నడూ లేనివిధంగా పార్లమెంటునే దేవాలయంగా భావించి, అవినీతి రహిత సుపరిపాలనలో తన ముద్ర వేసి తన ప్రతి అడుగూ దేశ ప్రజలవైపు, తన ప్రతి రక్తపుబొట్టూ దేశం కోసం, తన ప్రతిక్షణం భారతమాతకు అంకితం చేస్తూ ఈ రోజు ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడిగా నిలిచారు. 2019లో అఖండమైన మెజార్టీతో రెండవసారి ప్రధాని అయ్యాక ఈ దేశం మునుపెన్నడూ చూడని అద్భుతమైన విజయాలను మోదీ స్వంతం చేసుకొన్నారు. అయోధ్య, కాశ్మీర్ ఆర్టికల్ 370, 35ఎ రద్దు, ముస్లిం మహిళల కష్టాలను తీర్చే ట్రిపుల్ తలాక్ చట్టం రూపకల్పన, ఇతర దేశాలలో మైనార్టీలయిన హిందువుల కష్టాలు తీర్చే సిఎఎ చట్టం వంటి చట్టాలను ఎంతో సాహసవంతంగా తెచ్చి అన్ని వర్గాల ప్రజల గుండెల్లో విలువైన స్థానం సంపాదించారు.
కరోనా జీవాయుధాన్ని ప్రపంచ మానవాళిపై వదిలి చోద్యం చూడటమే గాక, భారత్‌ను.. ఇతర ఇరుగు పొరుగు దేశాలకు చీకాకులు కలిగిస్తున్న చైనా నడ్డి విరవడంలో నేడు మోదీ చూపిస్తున్న తెగువ, సాహసం అనన్యసామాన్యం. అతి భారీ విస్తీర్ణం, అత్యంత ఆయుధ సంపత్తి కలిగిన చైనా పట్ల ఇటువంటి కఠిన వైఖరి అవలంబించడానికి ఇంతకుముందటి మనదేశ ఏ నాయకుడూ కనీసం ఆలోచన చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. కానీ నేడు మోదీ ప్యాంగాంగ్ సరస్సులోని కొండ శిఖరాలను భారత స్వాధీనంలోకి తెచ్చారు, చైనా వస్తువులను వాడొద్దని ప్రజలకు పిలుపునిస్తూ, చైనా యాప్స్‌ను నిషేధిస్తూ, ఆర్ధికంగా, సైనికంగా అనూహ్య ఎత్తుగడలతో చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
దేశంలో ప్రతి ఎన్నికల ముందూ మోదీకి వ్యతిరేకంగా ఏదో ఒక యుద్ధ వాతావరణం సృష్టించి, తమ పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు చేసిన ప్రతిపక్షాలకు మోదీ ఎప్పటికప్పుడు తన సత్తా చూపిస్తూనే దేశ ప్రధానిగా నిప్పు కణిక వలె తన స్వచ్ఛతను నిరూపించుకుంటూనే ఉన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ చోక్సి, లలిత్ మోదీ వంటి అవినీతిపరులను నరేంద్రమోదీయే తయారుచేశారంటూ నోరు పారేసుకున్నారు. కానీ వాళ్లను ఎవరు తయారుచేశారనేది ప్రజలకు తెలుసు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2008 వరకు మన బ్యాంక్‌లు 18 లక్షల కోట్లు అప్పులు ఇస్తే, యూపీఏ పాలనలో 2008 నుండి 2013 వరకు కేవలం ఆరేళ్లలో 34లక్షల కోట్ల ఋణం ప్రభుత్వం ఇచ్చింది. ఎగవేతదారులకు బ్యాంక్ తలుపులను బార్లా తెరచిన వారే నీతులు చెపుతూ మోదీపై దుష్ప్రచారం చేయడం ప్రజలు పూర్తిగా గమనించే 2019లో తమ తీర్పు వెలువరించారు. మోదీకి మరింత మెజారిటీ కట్టబెట్టారు. తనను తాను దేశ ప్రధాన మంత్రిగా కాక, ప్రధాన సేవకుడిగా చెప్పుకుంటూ; ఒక్కరోజూ తన క్షేమం చూసుకోకుండా, ప్రతిరోజూ రోజుకు 20 గంటల పాటు దేశ సంక్షేమం కోసం కష్టపడే వ్యక్తి మనదేశ ప్రధాని కావడం భారతీయులందరి అదృష్టం. ఆ కర్మయోగికి జన్మదిన శుభాకాంక్షలు.
(నేడు ప్రధాని మోదీ జన్మదినం)
వ్యాసకర్త: డా‘‘ కె.లక్ష్మణ్, భాజపా నాయకులు, తెలంగాణ
నిరంతర శ్రామికుడు మన ప్రధాని
Published Thu, Sep 17 2020 2:01 AM | Last Updated on Thu, Sep 17 2020 2:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment