సాక్షి ప్రతినిధి, గుంటూరు: కొన్ని రకాల వ్యాధులు, రుగ్మతలను నయం చేసేందుకు వినియోగించే ఔషధాలు కొందరు స్వార్థపరుల చేతుల్లో పడి అసాంఘిక కార్యకలాపాలకు పరోక్షంగా దోహదపడుతున్నాయి. ముఖ్యంగా మత్తును కలిగించే మందులు, సిరప్‌లు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో పనిలేకుండా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న మెడికల్ మాఫియా తీరుతో శాంతిభద్రతల సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఈ మత్తుకు బానిసలు అయిన వారు డబ్బుల కోసం ఇతరులపై దాడులు, హత్యలకు తెగబడుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
కొంత మంది ఔషధ విక్రేతలు విలువలకు తిలోదకాలు ఇచ్చి సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అక్రమార్జనకు అలవాటు పడి వైద్యుల అనుమతి లేకుండా ఔషధాలను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన మేజర్ క్రైం కేసులో నిందితుల వద్ద నుంచి అత్యవసర పరిస్థితుల్లో వాడే 20 ఎంజీ మత్తు ట్యాబ్లెట్లు రెండు షీట్లు దొరికినట్లు సమాచారం. నిద్ర పట్టడం కోసం కేవలం 0.5 ఎంజీ, లేకపోతే 1 ఎంజీ ట్యాబ్లెట్లను డాక్టర్లు రాస్తారు. అయితే ఇవి ఇవ్వాలన్నా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపుల్లో ఇవ్వకూడదు. అటువంటిది అత్యవసర పరిస్థితుల్లో వాడే 10 ఎంజీ, 20 ఎంజీ మందులు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటితో పాటు దగ్గు సిరప్‌లు, శానిటైజర్లు కూడా పెద్ద ఎత్తున మత్తు కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన 20 మంది యువకులు ఐదు నెలల వ్యవధిలో ఫిట్స్ వ్యాధి బారిన పడ్డారు. గుంటూ రు శ్రీనివాస్ న్యూ రో కేర్ సెంటర్ అధినేత, ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ ఘంటా శ్రీనివాస్ సదరు యువకులను పరీక్షించి వీరంతా ఓ మందు బిళ్ల వాడటం వల్ల వ్యాధి బారిన పడుతున్నట్లు నిర్ధారించారు. స్పాస్‌మోప్రాక్సివన్ మందు బిళ్లను ఒక్కొక్కరూ రోజుకు 24 బిళ్లలు చొప్పున తీసుకుంటున్నట్లు బయటపడింది. బిళ్ల మింగగానే వారికి కిక్ వస్తోందని, బాగా నిద్ర పడుతోందని, అందువల్లే అందరూ వాటిని వినియోగిస్తున్న విషయం వైద్యుల పరిశీలనలో తెలిసింది. మందుల షాపుల వారు వైద్యులు సిఫార్సు చేయకుండా మందులు ఇవ్వడం వల్ల వాటిని విచ్చలవిడిగా వినియోగించి రోగాల బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment