తల్లిదండ్రులు సాగర తరంగాలపై చేపల వేటను సాగిస్తుంటే, వారి బిడ్డలైన ఇద్దరు ఆడపిల్లలు వాలీబాల్ క్రీడలో గెలుపు కెరటాలయ్యారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్), విశాఖలో అకుంఠిత సాధన చేస్తున్నారు. తండ్రిని చిన్నవయసులోనే కోల్పోయిన మరో బాలిక వాలీబాల్ క్రీడలో మరో ఆశాకిరణం. ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల సీనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా జట్టుకు ఆడి, తొలిసారిగా జిల్లా మహిళల జట్టును విన్నర్స్ అనే గెలుపు తీరానికి చేర్చారు. సరికొత్త చరిత్రను లిఖించారు. – తెనాలి
రాణిస్తున్న అన్నదమ్ముల పిల్లలు
● సత్తా చాటుతున్న మట్టిలో మాణిక్యాలు ● దేశం తరపున ఆడాలని అభిలాష
చేపల వేటతో జీవనం సాగించే తీరప్రాంత కుటుంబాల్లోని ఆడపిల్లలు వాలీబాల్ క్రీడలో జాతీయ పోటీలకు ఆడుతుండటం నిజంగా విశేషమే. ఆ ఇద్దరూ సికినం మానస. సికినం మౌనిక. ఒకే కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల బిడ్డలు. బాపట్ల జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కలిగిన నిజాంపట్నం సొంతూరు.
మానస తల్లిదండ్రులు లక్ష్మి, శేషయ్య. చేపల వేటే జీవనాధారం. ఇద్దరు అన్నయ్యల తర్వాత కుమార్తె మానస. ప్రస్తుతం ఖాజీపాలెంలోని డిగ్రీ కాలేజిలో ఫైనలియర్ చదువుతోంది. నిజాంపట్నంలో స్కూల్లో చదువుతుండగా, అథ్లెటిక్స్‌లో పాల్గొంటూ వచ్చింది. డిగ్రీ ఫస్టియర్‌లో ఉండగా గ్రామంలో వాలీబాల్ అడుతుండే ఎస్.శేషగిరి, బొమ్మిడి శ్రీనివాసరావు (జెట్లి) అనే ఇద్దరి ప్రోత్సాహంతో వాలీబాల్ సాధన చేసింది. రెండేళ్లలోనే జూనియర్ నేషనల్స్‌లో, యూత్ నేషనల్స్‌లో రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఆడింది. ఏడాది కాలంగా ‘శాయ్’ స్పోర్ట్స్ హాస్టల్‌లో సాధన చేస్తోంది. కేరళలో ఇటీవల ఇండియాలోని అంతర శాయ్ హాస్టళ్ల జట్ల మధ్య జరిగిన చాంపియన్‌షిప్‌లో విశాఖ శాయ్‌కు విజయం కట్టబెట్టినవారిలో మానస ఒకరు.
ఇదే విజయంలో నిజాంపట్నంకు చెందిన మరో క్రీడాకారిణి సికినం మౌనికకు భాగస్వామ్యం ఉంది. ‘శాయ్’లో శిక్షణ పొందుతున్న మౌనిక తల్లిదండ్రులు జాలమ్మ, ప్రసాద్ కూడా మత్స్యకారులే. గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 8వ తరగతి రోజుల్నుంచీ మౌనికకు వాలీబాల్ ఆటలో ప్రవేశముంది. మానసను ప్రోత్సహించిన క్రీడాకారులే తన గురువులు కూడా. జూనియర్ నేషనల్స్, యూత్ నేషనల్స్‌లో ఒక్కో ఛాంపియన్‌షిప్‌లో రెండేసిసార్లు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఒడిశాలో గత ఏడాది జరిగిన సీనియర్ నేషనల్స్‌కు ఆడి, జట్టుకు క్వార్టర్ ఫైనల్స్ వరకు తీసుకెళ్లగలిగింది. మానస, మౌనిక ఇద్దరూ తెనాలి స్టేడియంలో అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకుని విశాఖ స్పోర్ట్స్ హాస్టల్‌కు ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment