విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 526.00 అడుగుల వద్ద ఉంది. ఇది 160.4430 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 5,088, ఎడమకాలువకు 5,018, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 7,840, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 19,746 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 6,510 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 804.70 అడుగుల వద్ద ఉంది. ఇది 31.3963 టీఎంసీలకు సమానం.
216 క్యూసెక్కులు విడుదల
తాడేపల్లిరూరల్(దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 216 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 58 క్యూసెక్కులు, తూర్పు కెనాల్‌కు 102 క్యూసెక్కులు, నిజాంపట్నం కాలువకు 122 క్యూసెక్కులు, కొమ్మమూరు కాల్వకు 420 క్యూసెక్కులు విడుదల చేశారు.
సంగీత పరీక్షలు
విజయవాడ కల్చరల్: దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరారవు ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆదివారం వార్షిక సంగీత పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కేఎస్ గోవిందరాజన్ తెలిపారు. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించిన గాత్రం, కూచిపూడి, భరతనాట్యం, వీణ, తబల, మృదంగం అంశాలకు సంబంధించి థియరీ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నిర్వహించామన్నారు. 750 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. సోమవారం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే ఫైనల్స్ జూలైలో జరిగే అవకాశం ఉందన్నారు.
నిత్యాన్నదానానికి
రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ గుణదలకు చెందిన కోనేరు నాగమణి, యుగంధర్ రూ. 1,00,116ల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
దుర్గమ్మ సేవలో సాయిధరమ్‌తేజ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సాయిధరమ్‌తేజ్‌ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
చాంబర్ ఆఫ్ కామర్స్
రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎంఎస్‌ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఎంఎస్‌ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సర్వసభ్య సమావేశం చైర్మన్ దాసరి దేవరాజ్, వైస్ చైర్మన్ వి. శివానంద్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా టి.కిరణ్‌కుమార్, కార్యదర్శిగా జి.సాంబశివరావు, జాయింట్ సెక్రటరీగా ఎస్.సుబ్బారావు, కోశాధికారిగా జి.వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment