గుంటూరు ఎడ్యుకేషన్: 1998 డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా మినిమం టైం స్కేల్‌పై పని చేసేందుకు అంగీకరించిన అభ్యర్థులకు గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు డీఈఓ పి.శైలజ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి 17 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను deognt. blogspot. com లో ఉంచినట్లు పేర్కొన్నారు. జాబితాలో పేర్లు పొందుపర్చిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్‌కార్డు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, డీఎస్సీ–98 హాల్ టిక్కెట్‌తో హాజరు కావాలని సూచించారు.
గురజాల డీఎస్పీగా పల్లపురాజు
గురజాల: గురజాల సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా పల్లపురాజు బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు విధులు నిర్వహించిన బెజవాడ మొహర్ జయరాం ప్రసాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. పల్లపురాజు దిశ పోలీస్ స్టేషన్ ఒంగోలు నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా గురజాలకు బదిలీ అయ్యారు.
జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్
చీరాల అర్బన్: పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన జాబ్ పోర్టల్‌ను కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ ఈ జాబ్‌పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. ఈ జాబ్ పోర్టల్‌లో ఉన్నత విద్యతో అనుసంధానమైన వివిధ కంపెనీలు రిజిస్టరై ఉంటాయన్నారు. ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత వారి విద్యార్హతలకు అనుగుణంగా కంపెనీ ఇంటర్వ్యూకు ఎంపిక అవుతారన్నారు. కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేస్తున్న 80 మంది విద్యార్థినులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. కళాశాల విద్య అధికారులు శ్రీధర్, కవిత, ప్రిన్సిపాల్ సీహెచ్ రమణమ్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.
1,14,895 బస్తాల
మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,10,068 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,14,895 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.22,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.24,000 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,500 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 80,562 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 522.70 అడుగుల వద్ద ఉంది. ఇది 154.2455 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 1,800 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 804.40 అడుగుల వద్ద ఉంది. ఇది 31.2203 టీఎంసీలకు సమానం.
Comments
Please login to add a commentAdd a comment