స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ , వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్లలోని ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో సోమవారం నిర్వహించిన 55వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులు, అందుకు కారకులైన అధ్యాపకుల్ని ఆయన ప్రశంసించారు. యూనివర్సిటీ విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనపరిచి ఐసీఏఆర్ అవార్డులు సాధించడం, పీజీ స్కాలర్‌షిప్‌లు పొందడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి కోసం యూనివర్సిటీ చేస్తున్న కృషిని కొనియాడారు. విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ. విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఐసీఏఆర్ 2021 డిసెంబర్ 3న అగ్రికల్చరల్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సిస్టం (ఏయూఆర్‌ఎస్) కింద జాతీయ ర్యాంకింగ్‌లను ప్రకటించగా, 2020–21 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 11వ, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 7వ స్థానాన్ని సాధించిందని తెలిపారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగంలో స్కాచ్ సిల్వర్ అవార్డు– 2022, స్కాచ్ ఆర్డర్ అఫ్ మెరిట్ అవార్డు లభించినట్లు చెప్పారు. తిరుపతిలో అభివృద్ధి చేసిన రెండు యంత్రాలు (మల్టీ టాస్క్ టూల్ బార్, నాప్సాక్ వీడర్) వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ ద్వారా వినూత్న వ్యవసాయ యంత్రాలుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దీనికి గానూ భారత ప్రభుత్వం కాపీరైట్ కార్యాలయం ద్వారా 2020 జూన్ 8న విశ్వవిద్యాలయం ఫర్టిలైజర్ ప్లానర్ 2015కు కాపీ హక్కు (పేటెంట్) మంజూరు చేశారని తెలిపారు. ఐసీఏఆర్‌లో అత్యధిక సంఖ్యలో స్కాలర్‌షిప్‌లు పొందిన యూనివర్సిటీల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్నందుకు సహకరించిన సిబ్బందికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
పలు అవార్డుల ప్రదానం
స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ అధ్యాపకులు, విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. టీచింగ్ విభాగంలో మెరిటోరియస్ టీచర్ అవార్డు, రీసెర్చ్ శాస్త్రవేత్తలు, విస్తరణ శాస్త్రవేత్తలు, యువ శాస్త్రవేత్తల అవార్డుల్ని నలుగురికి అందజేశారు. పీజీకి సంబంధించి 22 మందికి, అండర్ గ్రాడ్యుయేషన్‌కు సంబందించి 10 మందికి పురస్కారాలు అందజేశారు. అనంతరం స్నాతకోత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కోన రఘుపతి, కళాశాల అసోసియేట్ డీన్ వి. శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జీవితం అంత తేలిక కాదు.. మీలో మీరు బలంగా ఉన్నప్పుడే తేలికగా కనిపిస్తుంది. నీ కష్టాలకంటే నీవు పెద్దవాడివి.. నిన్ను జయించేలా చేసేందుకు నిన్ను మించినవాడు లేడు. నీ లక్ష్యాల్ని చేరుకోవడానికి నీకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. మీరు మాత్రమే మీ కలల్ని నేరవేర్చుకోగలరు. నక్షత్రాలకు ఎగరాల్సిన వారు పర్వతాన్ని అధిరోహించడం చాలా చిన్న విషయం...
– గవర్నర్
విద్యార్థులు ఐసీఏఆర్ అవార్డులు సాధించడం హర్షణీయం ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
Comments
Please login to add a commentAdd a comment