● సివిల్స్‌లో జిల్లా విద్యార్థుల సత్తా
● రెంటచింతల యువకుడికి 292వ ర్యాంకు
● అచ్చంపేట అభ్యర్థికి 550వ ర్యాంకు
రెంటచింతల: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లా యువకులు సత్తాచాటారు. టాప్ ర్యాంకుల్లో మెరిశారు. రెంటచింతలకు చెందిన పాల్వాయి విష్ణువర్ధన్‌రెడ్డి 292వ ర్యాంక్ సాధించి పల్నాటి కీర్తిప్రతిష్టలను నలుదిశల చాటాడు. విష్ణువిర్ధన్‌రెడ్డి రెంటచింతల సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియంలో 7వ తరగతి వరకు, విజయవాడ నిర్మల హైస్కూల్‌లో 8 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియెట్ విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాల (ఇంద్ర టవర్స్)లో, గోవా బిట్స్ పిలానిలో బీటెక్ ఈఈఈ పూర్తిచేశాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌లో (ఐఎఫ్‌ఎస్) 2020 ఫలితాలలో నాలుగో ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో 3వ ర్యాంక్ సాధించాడు. చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీస్‌పై ఉన్న మక్కువ ఉన్న విష్ణు వర్ధన్‌రెడ్డి ఎప్పటికై న సివిల్ ర్యాంక్ సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుని 2017లో న్యూడిల్లీలో ఓ ప్రవేట్ శిక్షణ కేంద్రంలో చేరి కృషి, పట్టుదల, అకుంటిత దీక్షతో 5వ ప్రయత్నంలో 2022లో 292 ర్యాంక్ సాధించి పల్నాడు ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం పుణేలో పీజీ చేస్తున్నాడు.
కుటుంబ నేపథ్యం
విష్ణువర్ధన్‌రెడ్డి తల్లిదండ్రుల స్వగ్రామం వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తండ్రి నరసింహారెడ్డి విజయవాడ కానూరులోలోని శస్త్ర అకాడమీ డైరెక్టర్‌గా, తల్లి పద్మావతి తుళ్ళూరు మండలం మందడం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీజీటీ ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సోదరి తేజశ్రీ ఏలూరు జిల్లా పిఎన్ కొలన్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్నారు.
సమాజసేవ చేయడమే లక్ష్యం..
ఐపీఎస్‌లో శిక్షణపొంది సమాజసేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ 292 సాధించి పల్నాడు జిల్లాకే గర్వకారణంగా నిలిచిన విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శొంఠిరెడ్డి నర్శిరెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నవీన్ చక్రవర్తి ప్రతిభ
అచ్చంపేట: తాళ్లచెరువు గ్రామానికి చెందిన రేపూడి నవీన్‌చక్రవర్తి 550వ ర్యాంకు సాధించాడు. నవీన్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి రేపూడి జయ్‌పాల్ రాజుపాలెం జిల్లా పరిషత్ హైస్కూలులో ప్రధానోపాధ్యాయునిగా, తల్లి విజయలక్ష్మి గుంటూరు మునిసిపల్ హైస్కూలులో సెకండరీగ్రేడ్ టీచరుగా పనిచేస్తున్నారు. 30 ఏళ్ల వయస్సు కలిగిన నవీన్‌చక్రవర్తి ప్రాథమిక విద్యను ఆర్సీఎం స్కూల్ జగ్గయ్యపేటలో, ఉన్నత విద్యను నల్లపాడు లయోలా హైస్కూలులో, జూనియర్ ఇంటర్ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, మెడిసిన్ కోర్సును సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో పూర్తిచేశారు. అయితే డాక్టర్ ప్రాక్టీస్ చేయకుండా సివిల్స్‌లో సీటు సాధించేందుకు గత ఏడాది ఢిల్లీలో కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించలేక పోయాడు. అయినా నిరుత్సాహ పడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఏడాది కూడా ఢిల్లీలోనే కోచింగ్ తీసుకుని ర్యాంకు సాధించాడు. తాను ఐఏఎస్, ఐపీఎస్ , ఐఆర్‌ఎస్‌లలో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో ఉన్నానని, వచ్చిన ర్యాంకును బట్టి మూడింటిలో ఏది వచ్చినా సంతోషంగా చేస్తానని నవీన్‌చక్రవర్తి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment