దాచేపల్లి : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బోగీల దగ్ధం నేపథ్యంలో నడికుడి రైల్వేస్టేషన్‌లో రేపల్లె ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపివేశారు. అందులోని సూమారుగా 350 మంది ప్రయాణికులను 7 బస్సుల ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ రూట్లో రైళ్లను అధికారులు నిలిపివేశారు.
పోలీసు క్లినిక్‌కు డాక్టర్ నియామకం
నరసరావుపేట: బాపట్ల జిల్లా కనగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం.స్రవంతి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న పోలీస్ క్లినిక్‌కు మెడికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేయాలని డాక్టర్ స్రవంతికి ఎస్పీ సూచించారు.
తుళ్ళూరు మండలంలో 12.4 మి.మీ. వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా తుళ్ళూరు మండలంలో 12.4 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా దుగ్గిరాల మండలంలో 0.8 మి.మీ. వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... తాడికొండ 7.2, తాడేపల్లి 6.8, మంగళగిరి 6.6, మేడికొండూరు 3.2, పెదకాకాని మండలంలో 1 మి.మీ చొప్పున వర్షం పడింది.
యార్డులో 36,041 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 33,294 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 36,041 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.24,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.26,000 వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.11,500 నుంచి 24,000 వరకు ధర లభించింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ.11,000 నుంచి రూ.25,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,500 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 11,772 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1000, గరిష్ట ధర రూ.2,200, మోడల్ ధర రూ.1,400 వరకు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment