నరసరావుపేట టౌన్: ప్రత్యేక లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఒ.వెంకట నాగేశ్వరరావు శుక్రవారం కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 22న ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదాలత్‌లో మోటారు వాహన ప్రమాదాల కేసులు, ముందస్తు వ్యాజ్యాలు, భూసేకరణ కేసులు మాత్రమే రాజీ మార్గం ద్వారా పరిష్కరించనున్నట్టు వివరించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు.
36,990 ఓటర్ కార్డులు
గుంటూరు వెస్ట్: కొత్తవి, చిరునామా మార్చుకున్నవి మొత్తం 36,990 ఓటర్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో చంద్రమౌళీ నగర్ పోస్టల్ శాఖాధికారులకు ఓటరు కార్డులు ఉన్న కవర్లను అందజేశారు. జిల్లాలోని 7 నియోజవర్గాల్లో అర్హులకు ఈ కార్డులు స్పీడ్ పోస్ట్ ద్వారా తపాలా శాఖ అందించనుంది.
22న పుస్తకాల పంపిణీ
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 22న ఆయా పాఠశాలల్లోనే పుస్తకాలు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వాహనాల ద్వారా 20వ తేదీనే పుస్తకాలను సంబంధిత పాఠశాలలకు చేర్చాలన్నారు.
అలాగే, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వచ్చే నెల నుంచి టేక్ హోం రేషన్ అందజేయాలన్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంను కిలోకు రూ.40 వెచ్చించి ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం కొనుగోలు చేస్తోందన్నారు. వాటిని అక్రమ మార్గంలో విక్రయించినా, కొనుగోలు చేసినా నేరమని తెలిపారు. ఈ బియ్యాన్ని అన్నం, టిఫిన్స్, తినుబండారాల్లోనూ వాడుకోవచ్చని తెలిపారు. సమావేశంలో డీఎస్‌ఓ కోమలి పద్మ, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ జి.లక్ష్మి, డీఈఓ శైలజ, బి.మనోరంజని జిల్లా అధికారులు పాల్గొన్నారు.
యార్డులో 29,955
బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 26,968 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 29,955 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,800 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,500 నుంచి రూ.26,000 వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.13,000 నుంచి 22,300 వరకు ధర లభించింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ. 11,000 నుంచి రూ. 24,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.14,500 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 9,098 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 518.60 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ఎడమ కాలువకు 4,547 ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 5,897 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 809.00 అడుగుల వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment