నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ పెన్షన్ కానుకను గుంటూరు జిల్లాలో మంగళవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి వలంటీర్లు అందజేశారు. తొలిరోజు జిల్లాలో 66.41 శాతం పంపిణీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో 2,49,667 మంది లబ్ధిదారులు ఉండగా వారి కోసం ప్రభుత్వం రూ.68.59 కోట్లు కేటాయించింది. మంగళవారం సాయంత్రానికి 1,65,797 మంది లబ్ధిదారులకు నగదు అందజేశారు.
నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్
నరసరావుపేట ఈస్ట్: జవహర్ నవోదయ విద్యాలయాలలో 2024–25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని అర్హత గల విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యేలా చైతన్యపరచాలని కోరారు. ఆసక్తి గల విద్యార్థులు నవోదయ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈనెల 10వతేదీలోగా సమర్పించాలని తెలిపారు. వివరాలకు ఆయా మండల విద్యాశాఖాధికారులను సంప్రదించాలని సూచించారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద మంగళవారం 2,010 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 500 క్యూసెక్కులు, తూర్పుకు 179, పశ్చిమకు 150, నిజాంపట్నంకు 225, కొమ్మమూరు కాల్వకు 1100 క్యూసెక్కులు విడుదల చేశారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.90 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది.
ప్రపంచ ఆర్చరీ
చాంపియన్‌షిప్‌లో ధీరజ్ సత్తా
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో దివంగత చెరుకూరి లెనిన్ (ఇండియన్ ఆర్చరీ కోచ్) వద్ద శిక్షణ పొందిన బొమ్మదేవర ధీరజ్ జర్మనీలోని బెర్లిన్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ మెన్ విభాగంలో క్వాలిఫైయింగ్ రౌండ్‌లో 2వ ర్యాంక్ సాధించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ సోమవారం జరిగిన రికర్వ్ క్వాలిఫైంగ్ రౌండ్‌లో 720 పాయింట్లకు గాను 683 పాయింట్లు సాధించి రెండో ర్యాంక్ సాధించాడు. ధీరజ్‌ను ఆయన తల్లిదండ్రులను, శిక్షకులను చెరుకూరి ఓల్గా అకాడమీ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ అభినందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయల కనిష్ట ధర రూ.800, గరిష్ట ధర రూ.1,600, మోడల్ ధర రూ.1,200 వరకు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment