పేద మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం
నరసరావుపేట: ఏమాత్రం సంపాదించే అవకాశంలేని ఓ పేద మహిళకు కలెక్టర్ ఎల్.శివశంకర్ రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. చిలకలూరిపేటకు చెందిన నంబూరు నాగ సత్యవాణి కలెక్టర్ శివశంకర్ లోతేటిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తన భర్త శివప్రసాద్, చిన్న కుమార్తె అనారోగ్యంతో మృతిచెందారని, వితంతువైన పెద్ద కుమార్తె తన వద్దనే ఉంటుందని, ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని, ఏమాత్రం సంపాదనకు అవకాశం లేనందున ఆర్థిక సాయం అందించాలని విన్నవించుకుంది. తక్షణం స్పందించిన కలెక్టర్ మానవతా దృక్పథంతో రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద అందజేశారు. జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం పాల్గొన్నారు.
నలుగురికి డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది ఎస్‌హెచ్‌ఓ (సీఐ)లకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో గుంటూరు రేంజ్ పరిధిలోని నలుగురు సీఐలు ఎం.హనుమంతరావు, టి.వి.రత్న స్వామి, షేక్.అబ్దుల్‌కరీం, కె.వెంకటేశ్వరరావు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి పొందారు. వీరికి వెంటనే ప్రభుత్వం డీఎస్పీలుగా పోస్టింగ్‌లూ ఇచ్చింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పీటీసీలో ఉన్న ఎం.హనుమంతరావును సీఐడీ డీఎస్పీగా, గుంటూరు జిల్లాలో వెయింటింగ్‌లో ఉన్న రత్నస్వామిని గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచి (ఎస్‌బీ) డీఎస్పీగా, ప్రస్తుతం సీఐడీలో ఉన్న షేక్.అబ్దుల్ కరీంను పీసీఎస్/ఎస్‌డీఎస్పీగా, వేమూరు సర్కిల్ (జీటీఆర్)లో ఉన్న కె.వెంకటేశ్వరరావును విజిలెన్స్/ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా ఉన్నతాధికారులు నియమించారు. గుంటూరు జిల్లా ఎస్‌బీ డీఎస్పీని ఇటీవల అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీఆర్‌కు పంపించినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ప్రస్తుతం టి.వి.రత్నస్వామితో ఆ పోస్టును భర్తీచేశారు.
13న ప్రభుత్వ మహిళా
పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో భర్తీ కాగా మిగిలిన సీట్లను పూరించేందుకు ఈనెల 13న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. ప్రభాకరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపీసీ రెగ్యులర్‌గా పూర్తి చేసిన విద్యార్థినులతోపాటు దూరవిద్య విధానం ద్వారా పూర్తి చేసిన విద్యార్థినులూ అర్హులేనని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, రూ.6,300 ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలో వసతి సదుపాయం కలదని, స్పాట్ అడ్మిషన్ ద్వారా సీటు పొందే విద్యార్థినులకు ఎటువంటి ఫీజు రాయితీ, స్కాలర్‌షిప్ వర్తించబోవని స్పష్టం చేశారు.
పురాతన శివాలయం పునర్నిర్మాణానికి శ్రీకారం
యడ్లపాడు: సుమారు రెండు శతాబ్దాల నాటి పురాతన శివాలయ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వంకాయలపాడులోని శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం శిథిలావస్థకు చేరింది. ఆరు నెలల కిందట ధర్మకర్తలు ఆలయం పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల సహకారంతో మూడు నెలల కిందట ఆలయాన్ని పూర్తిగా తొలగించారు. కార్తికమాసం శుక్రవారం ఉదయం 9.40 గంటలకు నూతన ఆలయానికి ముహూర్తం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరుకు చెందిన నాగేశ్వరం రాఘవేంద్రశర్మ పర్యవేక్షణలో రుత్వికుల వేదమంత్రోచ్చరణల మధ్య హోమపూజలు చేశారు. ఆయా పూజల్లో దంపతులు పాల్గొన్నారు. గ్రామస్తుల సంపూర్ణ సహకారంతో సుమారు రూ.కోటి వ్యయంతో దీనిని నిర్మిస్తున్నట్లు ధర్మకర్తలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment