పట్నంబజారు: జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఉమ్మడి జిల్లాల పరిధిలోని న్యాయమూర్తులకు రిలవెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఇన్ క్రిమినల్ కేసెస్ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించా రు. జిల్లా ప్రధానన్యాయమూర్తి వై.వి.జి.వి.ఎస్.పార్థసారథి అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాపునకు హైకోర్టు న్యాయమూర్తి వి.ఆర్.కె.కృపాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. న్యాయమూర్తి కృపాసాగర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క న్యాయమూర్తి నాణ్యమైన తీర్పు ఇచ్చేలా పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి సత్వర తీర్పులను ఇవ్వాలన్నారు. అనంతరం న్యాయవాదులు న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, న్యాయమూర్తి కృపాసాగర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయస్థానాల న్యాయమూర్తులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
యూపీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ప్రోత్సాహకాలు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కింద సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన/వెనుకబడిన వర్గాల అభ్యర్థులు యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేస్తుందని సోషల్ వెల్ఫేర్ డీడీ డి మధుసూదనరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రూ.50వేలు ఆర్థిక సాయం కింద నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. 2023లో నిర్వహించిన యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అర్హులైన అభ్యర్థుల నుంచి నగదు ప్రోత్సాహకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన అభ్యర్థులు జ్ఞానభూమి.ఏపీ.జీఓవీ.ఇన్ పోర్టల్‌లో ఈనెల 19వ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
కేవీకేలో ఉద్యోగ అవకాశాలు
గుంటూరురూరల్: గుంటూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఈనెల 29వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ సుబ్రమణ్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్తి విభాగంలో స్పెషల్ ప్రాజెక్ట్‌కుగానూ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ –1లో మూడు పోస్టులు, యంగ్ ప్రొఫెషనల్–2లో ఒక పోస్టుకుగానూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. 29న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌ఆర్‌ఆర్‌యూ.ఈడిఏ.ఇన్ వెబ్‌సైట్‌ను గానీ, 9989051559 సెల్ నంబర్‌ను గానీ సంప్రదించాలన్నారు.
నేటి నుంచి ధనుర్మాసం పూజలు
అమరావతి: వైష్ణవ ఆలయాలలో ఆదివారం నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల రోజుల పాటు ప్రతిరోజూ గోదాదేవికి తిరుప్పావై పాశురాలను ప్రవచించి అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో పూజలు నిర్వహించటం ధనుర్మాస విశిష్టతగా చెబుతారు. మండలంలోని వైకుంఠపురం, అమరావతి, కోదండరామాలయం, పాండురంగస్వామి ఆలయం, మల్లాది వటవృక్షాంతర్గత వేంకటేశ్వరస్వామి ఆలయాలలో ధనుర్మాస పూజలు నిర్వహించటానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment