తెనాలి: అయోధ్యలో రామమందిరం ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా ఆలయ నమూనా మినియేచర్‌ను తెనాలి సూర్యశిల్పశాల నిర్వాహకుల్లో ఒకరైన కాటూరి శ్రీహర్ష రూపొందించారు. త్రీడీ టెక్నాలజీలో నిపుణుడైన శ్రీహర్ష, అదే సాంకేతికతను వినియోగించి తీర్చిదిద్దిన నమూనా, సోమవారం తమ శిల్పశాల ఎదుట ప్రదర్శనగా ఉంచనున్నట్టు తెలియజేశారు. రామభక్తులు విచ్చేసి ఆలయ నమూనాను తిలకించాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
ఎంసీహెచ్‌కు
రూ. 2 కోట్లు విరాళం
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల 1965 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ తాతినేని గోపాలరావు, బీనా దంపతులు గుంటూరు జీజీహెచ్‌లో నిర్మాణమవుతున్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) నిర్మాణం కోసం రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు. అందులో భాగంగా ఆదివారం జింకానా కో–ఆర్డినేటర్ డాక్టర్ వెనిగళ్ల బాలభాస్కరరావును కలిసి రూ.75 లక్షల చెక్కును అందజేశారు. ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ వెంకటేశ్వరరావు పేరు మీదుగా డాక్టర్ తాతినేని గోపాలరావు దంపతులు చెక్కు అందజేశారు. విరాళం అందజేసిన వైద్యులకు డాక్టర్ బాలభాస్కరరావు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
తిరుపతమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
పెనుగంచిప్రోలు: స్థానిక తిరుపతమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
సజావుగా సీ–టెట్
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీ–టెట్) ఆదివారం గుంటూరు జిల్లాలో సజావుగా జరిగింది. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన పేపర్–1, 2 పరీక్షలకు దరఖాస్తు చేసిన 1,550 మంది అభ్యర్థుల్లో 1,090 మంది హాజరయ్యారు. గుంటూరు నగరంలోని శ్రీపాటిబండ్ల సీతారామయ్య స్కూల్, డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్, శ్రీవేంకటేశ్వర బాలకుటీర్‌తో పాటు పొన్నూరులోని నాట్కో స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల పరిధిలో అభ్యర్థులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు హాజరైన అభ్యర్థులే తిరిగి మధ్యాహ్నం జరిగిన పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.
విధులకు హాజరు కాని అంగన్‌వాడీలపై చర్యలు
నెహ్రూనగర్: గుంటూరు జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ అంగన్‌వాడీ వర్కర్స్ సోమవారం నుంచి విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వం విధించిన గడువులోపు విధులకు హాజరు కాని అంగన్‌వాడీ సిబ్బందిపై ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా వారిని విధుల నుంచి తొలగించడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment