నేటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు

Published Tue, Oct 29 2024 1:41 AM | Last Updated on Tue, Oct 29 2024 1:41 AM

నేటి

నేటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు

మార్కెట్‌ యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రజని

తాడికొండ: సీసీఐ కొనుగోలు కేంద్రం ద్వారా తాడికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డు తరుఫున పత్తి కొనుగోళ్లు మంగళవారం నుంచి ప్రారంభించనున్నామని తాడికొండ మార్కెట్‌ యార్డు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి రజిని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7521 చెల్లించనున్నట్టు తెలిపారు. రైతులు సీసీఐ కేంద్రానికి పంటను తీసుకెళ్ళాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాల వద్ద ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌ అందజేయాల్సి ఉంటుందన్నారు. తేమ శాతం 8–12 శాతం మత్రామే ఉన్న పత్తిని కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. తడిచిన, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయరని స్పష్టం చేశారు. ఈ పంట/ ఈ క్రాప్‌ నమోదు చేసుకున్న రైతులు/ కౌలు రైతులు మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రానికి రావాలని వెల్లడించారు. అన్ని అర్హతలు ఉన్న రైతులు గుంటూరు శివారు పత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామంలోని శివసాయి టీఎంసీ సిండికేట్‌ మిల్లుకు పంటను తీసుకొస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పత్తి కొనుగోళ్లు జరుగుతాయని వెల్లడించారు.

వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ సుందరాచారి

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డాక్టర్‌ సుందరాచారి మచిలీ పట్నం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో 1981లో ఎంబీబీఎస్‌ చదివి, అనంతరం న్యూరాలజీ పీజీ చేసి 2001లో జీజీహెచ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా గుంటూరు జీజీహెచ్‌లో పనిచేశారు. గత ఏడాది రాష్ట్ర ఉత్తమ టీచర్‌ అవార్డును ఈయన అందుకున్నారు. న్యూరాలజీ విభాగాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ విభాగంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వార్డులో స్లీప్‌ ల్యాబ్‌, స్ట్రోక్‌ యూనిట్‌ ఏర్పాటుచేసి నాణ్యమైన వైద్య సేవలతో 2018లో ఐఎస్‌ఓ గుర్తింపు సైతం న్యూరాలజీ వార్డుకు లభించడంలో డాక్టర్‌ సుందచారి కృషి ఎనలేనిది. 2022లో ఫెలో ఆఫ్‌ ది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీగా ఎన్నికై అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈఏడాది జనవరిలో డాక్టర్‌ సుందరాచారికి అడిషనల్‌ డీఎంఈగా ప్రమోషన్‌ ఇచ్చి మచిలీపట్నం వైద్య కళాశాలకు బదిలీ చేశారు. ఇప్పుడు తిరిగి గుంటూరు వైద్య కళాశాలకు బదిలీ చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉత్తర్వులు అందుకున్న డాక్టర్‌ సుందరాచారికి పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి మృతి

మార్టూరు: రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి మృతి చెందిన ఘటన మండలంలోని మార్టూరు జాతీయ రహదారిపై నూలుమిల్లు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఏఎస్‌ఐ మహబూబ్‌ బాషా వివరాల మేరకు.. తెనాలికి చెందిన పగడాల కుమార్‌ (45) ద్విచక్ర వాహనంపై తిరుగుతూ వస్త్ర వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తెనాలి నుంచి నెల్లూరుకు బైకుపై బయలుదేరాడు. సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో మార్టూరు జాతీయ రహదారిపై నూలు మిల్లు సమీపంలో వాహనం అదుపుతప్పి రెండు రోడ్ల మధ్యగల డివైడడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కుమార్‌ బైక్‌ సహా ఎగిరి అటువైపు ఒంగోలు నుంచి మార్టూరు వైపు వెళ్లే రోడ్డుపై పడిపోయాడు. ప్రమాద తీవ్రతకు కుమార్‌ తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు కుమార్‌కు భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన ఏఎస్‌ఐ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో శవ పంచనామా చేయించి బంధువులకు అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు 
1
1/1

నేటి నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement