పోలీసుల ద్వంద్వనీతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు పోలీసుల వ్యవహారశైలి విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ నేతలపై పెడుతున్న కేసుల విషయంలో వారి వైఖరి కుటిల నీతికి అద్దం పడుతోంది. వైఎస్సార్ సీపీ నేతలైతే ఒక లెక్క.. అధికార పార్టీ నేతలైతే మరో లెక్క అన్నట్లుగా వారి తీరు ఉంటుంది. అధికార పార్టీ సామాజికవర్గం వారైతే ఉదాసీనంగా వ్యవహరించి.. మరొకరైతే కఠినంగా ముందుకు పోతుండడంతో బ్రాహ్మణ మహాసభ నిరసన వ్యక్తం చేస్తోంది.
పాల‘కులం’టే ప్రేమా..!
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథియావాలా) నేత బోరుగడ్డ అనిల్‌కుమార్ అరెస్టు తదనంతర పరిణామాలలో గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటనలు వివాదాస్పదమయ్యాయి. తొలుత ఆయనను రాజమండ్రి తరలిస్తున్న సమయంలో ఒక రెస్టారెంట్‌కు తీసుకువెళ్లి భోజనం పెట్టించిన వీడియో వైరల్ కావడంతో ఏడుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తర్వాత అరండల్‌పేట స్టేషన్‌లో కస్టడీ విచారణ సమయంలో అనిల్‌కు రాచమర్యాదలు జరిగాయంటూ వీడియో ఫుటేజ్‌లు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. తాము కోర్టు ఆదేశాల మేరకే అతనికి సదుపాయాలు కల్పించామంటూ స్వయంగా ఎస్పీ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు కూడా. అయితే తర్వాత అరండల్‌పేట పోలీస్‌స్టేషన్
సీఐ కె.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపారు. రాచమర్యాదలు చేస్తున్న వీడియో ఫుటేజ్ బయటకు రావడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల టెక్నీషియన్ అరండల్‌పేటకు చెందిన శేషు, ఓ పత్రిక క్రైం రిపోర్టర్ కన్నెగంటి అరుణ్ కుమార్‌లపై ఈనెల 9న రాత్రి కేసు నమోదు చేశారు. ఐపీసీ 66, 66–డీ, 67సీ ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నీషియన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. విలేకరి అరుణ్‌కుమార్ అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో అతడిని అరెస్టు చేయలేదు. మరోవైపు దర్యాప్తులో తాను, అరుణ్‌కుమార్‌లతో పాటు టీవీ–5 కెమెరామెన్ వంశీ కూడా ఉన్నట్లు శేషు వెల్లడించాడు. దీంతో పోలీసులు వంశీపైనా కేసు నమోదు చేశారు.
టీవీ5 కెమెరామెన్‌కు మద్దతుగా టీడీపీ నేతలు
దీంతో పోలీసులు గురువారం టీవీ 5 కెమెరామెన్ వంశీని స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకుని అధిష్టానంతో మాట్లాడటంతో అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వంశీకి 41 నోటీసు ఇచ్చి పోలీసులు పంపేశారు. అతని పేరు చేరుస్తూ అల్టర్ చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని ఇప్పటి వరకు బయటపెట్టలేదు. విచారణ పూర్తి కాలేదని అందుకే 41 నోటీసు ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో కన్నెగంటి అరుణ్‌కుమార్ పరారీలో ఉన్నాడని పేర్కొంటున్నారు. కులమతాలకు అతీతంగా సమన్యాయం చేయాల్సిన పోలీసులే కులాలకు, పార్టీలకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రుల
ఫిర్యాదులపై స్పందనేదీ!
వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రి విడదల రజినిపై, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆయన సతీమణి, కుమార్తెలపై ఐటీడీపీ మీడియాలో అత్యంత దారుణంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసినా వాటిని పోలీసులు చెత్త బుట్టలో పడేస్తున్నారు. రజిని జిల్లా ఎస్పీతోపాటు డీజీపీకి ఫిర్యాదు చేసి 20 రోజులైనా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. కానీ తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారని 2018లో చేసిన పోస్టులపైనా పలుచోట్ల కేసులు నమోదు చేస్తుండడంపై ప్రజలు విస్తుపోతున్నారు.
బ్రాహ్మణ మహాసభ ఆందోళన
శేషు బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రిమాండ్‌కు పంపుతున్నారని, ఆయనతోపాటు నిందితులుగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను ఎందుకు అరెస్టు చేయలేదని బుధవారం బ్రాహ్మణ మహాసభ ప్రశ్నించింది. గత బుధవారం మహాసభ అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో నేతలు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment