మల్లేశ్వరుని సేవలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
పెదకాకాని: శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు శుక్రవారం సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం ఆయన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
40,639 బస్తాల
మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 36,928 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 40,639 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 15,600 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 17,000 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ.9,000 నుంచి రూ. 15,000 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ.8,000 నుంచి రూ.17,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 23,602 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర కమిటీలో నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, మెట్టు వెంకటప్పారెడ్డి పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. వీరు పార్టీ అనుబంధ విభాగ కమిటీల ఏర్పాటు, అనుబంధ విభాగ కార్యక్రమాల సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఆంజనేయుడికి లక్ష
తమలపాకుల పూజ
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రజన్నాంజనేయ స్వామికి పౌర్ణమి సందర్భంగా శుక్రవారం లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం ఉభయదాతలు, దేవస్థాన సిబ్బంది, అర్చకులు దేవస్థాన ఏసీ తిమ్మనాయుడు దేవస్థానం చుట్టూ ప్రదక్షిణలు చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 3,800 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 172 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్‌కు 738 క్యూసెక్కులు, తూర్పు కెనాల్‌కు 140 క్యూసెక్కులు, పశ్చిమ కెనాల్‌కు 90 క్యూసెక్కులు, నిజాంపట్నం కాలువకు 187 క్యూసెక్కులు, కొమ్మమూరు కాలువకు 2180 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment