ఆనందం.. ఆహ్లాదం
గలగల పారే సెలయేరులాంటి పసిపిల్లల నవ్వులు.. కోయిలమ్మల్లా మధుర కంఠాలతో ఆకట్టుకున్న బాలల గానామృతాలు.. పచ్చని ప్రకృతి ఒడిలో కొండల మధ్యన చెంగు చెంగున గంతులేసే లేడిపిల్లల్లా చిన్నారుల ఉరుకులు.. పురివిప్పి ఆడే నెమలి పిల్లల్లా అలరించిన నవ నాట్యమయూరాలతో వీవీఐటీ బాలోత్సవ్–2024 శుక్రవారం కోలా హలంగా ప్రారంభమైంది. చిట్టి చేతులు గీసిన అందమైన చిత్రలేఖనాలు అబ్బురపరిచాయి. తేటతెలుగు తియ్యని పద్యగానాలు వీనులవిందు చేశాయి. ఏకపాత్రాభినయాలు, శాసీ్త్రయ జానపద నృత్యాలు, రంగురంగుల విచిత్ర వేషధారణలు ఆహూతులను కట్టిపడేశాయి.
విద్యార్థిని నాట్య ప్రదర్శన
పెదకాకాని: తెలుగు జాతి గొప్పతనాన్ని, గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పడానికి బాలోత్సవ్ దోహదపడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చెప్పారు. ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీ బాలోత్సవ్–2024 వేడుకలను వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో శుక్రవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గంట మోగించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీసే అద్భుత ప్రయత్నం బాలోత్సవ్ అని కొనియాడారు. ఈ బాలోత్సవ్‌లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభతో అంతర్జాతీయ యవనికపై తెలుగు కీర్తిపతాకను ఎగరేయాలని ఆకాంక్షించారు. తెలుగు జాతి సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. మాతృభాష గౌరవాన్ని నిలపాలని పేర్కొన్నారు. వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ చిన్నారులు ఆనందంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారన్నారు. మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగే పోటీల్లో ప్రతిభ చాటాలని చెప్పారు.
ఉత్సాహంగా ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీ బాలోత్సవ్–2024 అట్టహాసంగా ప్రారంభం తొలిరోజు పాల్గొన్న 13వేల మందికిపైగా విద్యార్థులు
తొలిరోజు వివిధ అంశాల్లో పోటీలు
తొలిరోజు శుక్రవారం 13 వేల మందికిపైగా చిన్నారులు వివిధ అంశాల్లో పోటీపడ్డారు. 20 అంశాలు, 61 విభాగాల్లో మూడు రోజులపాటు 30 వేదికలపై పండుగ వాతావరణంలో పోటీలు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ కండె గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment