కార్తిక దీపం ప్రకాశివంతం
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానం శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడింది. తెల్లవారుజామునే సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులు యజ్ఞాల బావి వద్ద పుణ్యస్నానాలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఓం నమః శివాయ నామంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం భక్తులు కార్తిక దీపాలు వెలిగించి స్వామిని ఆరాధించారు. పొంగళ్ళు పొంగించి స్వామికి నైవేద్యం సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామిని దర్శించుకున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ కేబీ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్త వల్లభుడిని సులభంగా దర్శించుకునేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు దాతల సహకారంతో పాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. అంతరాలయ దర్శనాలు, అభిషేకాలు, ఏకవారాభిషేక పూజలు, అన్న ప్రాశనలు, నామకరణలు, రాహుకేతు పూజలు అధిక సంఖ్యలో జరిగాయి. ఒక్కరోజులో స్వామికి వివిధ సేవా కార్యక్రమాల ద్వారా రూ.7,50,000ల ఆదాయం లభించినట్లు డెప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జరిగిన కోటి దీపోత్సవం జ్వాలా తోరణ పూజల్లో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ దంపతులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ కేబీ శ్రీనివాస్ స్వామి శేషవస్త్రం అందించి సత్కరించి స్వామి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
పౌర్ణమి పూజలు శివనామస్మరణతో మార్మోగిన పెదకాకాని భక్తులతో కిటకిటలాడిన ఆలయం భక్తిశ్రద్ధలతో కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం
Comments
Please login to add a commentAdd a comment