విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసమే ప్రభుత్వం హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం చేపట్టినట్లు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం పాత బస్టాండ్ సెంటర్‌లోని జిల్లా పరీక్షా భవన్‌లో కలెక్టర్ చేతుల మీదుగా చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ప్రారంభించారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ వచ్చే ఏడాది ఏప్రిల్ 15 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో ఎదుగుదల లోపాలు గుర్తించేందుకు స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ఆశా, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలతో నిర్వహిస్తామని, సమస్యాత్మక కేసులను సమీపంలోని ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వద్దకు పంపి, వైద్యాధికారి పరిశీలన అనంతరం అవసరాన్ని బట్టి సత్వర చికిత్సా కేంద్రాలకు పంపుతారని చెప్పారు. నిష్ణాతులైన వైద్యులు పరీక్షించి చికిత్స అందజేస్తారని వివరించారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సమాంతరంగా ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలతో ఇంటింటి సర్వేను నిర్వహించి 18 ఏళ్లు పైబడిన వారందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని, సమస్యాత్మక కేసులను వైద్యాధికారి దగ్గరికి పంపుతామని తెలిపారు. వైద్యులు పరీక్షల అనంతరం క్యాన్సర్‌గా అనుమానించిన కేసులను జీజీహెచ్‌లోని క్యాన్సర్ వార్డుకు పంపి, అక్కడ పరీక్షల ద్వారా నిర్ధారణ అయిన కేసులకు చికిత్స అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు, డాక్టర్ సీహెచ్ రత్న మన్మోహన్, డాక్టర్ జయ రామకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, ఉమాదేవి, ఎ.జయప్రద్, ఎన్.వెంకటేశ్వర్లు, శిరీష తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment