ప్రణాళికతో శ్రమిస్తే విజయం సొంతం
పెదకాకాని: ప్రణాళికాబద్ధంగా కష్ట పడితే విజయం సొంతం అవుతుందని వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి వై. సత్యనారాయణ అన్నారు. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల కౌండిన్య ఐఏఎస్ అకాడమీ భవనంలో ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులను స్మరిస్తూ ‘విద్యావకాశాలు– ఉద్యోగాల సాధన’ అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ... పూలే దంపతులు స్ఫూర్తి ప్రదాతలు అన్నారు. నేటి యువతకు ఎన్నో సదుపాయాలు, అద్భుత అవకాశాలు ఉన్నాయని గుర్తుచేశారు. అకాడమీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఈవీ నారాయణ మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన పేద, మధ్యతరగతి విద్యార్థులను ప్రోత్సహించడమే తమ లక్ష్యం అన్నారు. ఐటీ విశ్రాంత ప్రధాన అధికారి టి. తిరుమల కుమార్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా కఠిన శ్రమ చేస్తే ఎలాంటి ఉద్యోగమైనా వచ్చి తీరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారి మస్తానయ్య మాట్లాడుతూ.. చిన్న వయసు నుంచే తమ వృత్తి, ప్రవృత్తితోపాటు సామాజిక బాధ్యతను కూడా ప్రతిఒక్కరు స్వీకరించాలన్నారు. అప్పుడే సమాజం బాగుంటుందని చెప్పారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఏపీఎస్‌డీఏడబ్ల్యూసీ ఎండీ ఎంఏ కుమార్ రాజా కంప్యూటర్ పరిజ్ఞానం అవసరాన్ని తెలిపారు. తొలుత పూలే దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ నారాయణ, ప్రసాద మూర్తి, గౌడ జన సేవాసమితి సభ్యులు పామర్తి సాంబశివరావు, జల్లెడ శ్రీనివాసరావు, వాకా రాంగోపాల్ గౌడ్, బెల్లంకొండ సదాశివ గౌడ్, డాక్టర్ టి. సేవ కుమార్, డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ– బస్సుల నిర్వహణ
ఆర్టీసీకే అప్పగించాలి
లక్ష్మీపురం: విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా కాకుండా నేరుగా ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి టి.వి.జి. రవిశంకర్ ఆదివారం పేర్కొన్నారు. అలా చేయకుంటే ఆర్టీసీ గ్యారేజ్‌లన్నీ మూతపడతాయని, క్రమంగా ఆర్టీసీ నామమాత్రంగా మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీలో ఆర్టీసీకి సబ్సిడీ వచ్చేలా మార్పు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని కోరారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీకి కేటాయించాలని కోరుతూ మంగళవారం విజయవాడలో రాష్ట్ర కమిటీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment