కొండవీడు కొండల్లో మహిళా కేడెట్ల ట్రెక్కింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కొండవీడు కొండల్లో మహిళా కేడెట్ల ట్రెక్కింగ్‌

Published Sun, Jan 19 2025 1:30 AM | Last Updated on Sun, Jan 19 2025 1:31 AM

కొండవ

కొండవీడు కొండల్లో మహిళా కేడెట్ల ట్రెక్కింగ్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఏపీ ట్రెక్‌–3 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన మహిళా ఎన్‌సీసీ కేడెట్లు శనివారం కొండవీడు చెక్‌పోస్టు నుంచి చారిత్రక కొండవీడు కోట వరకు ఏడు కిలోమీటర్లు ట్రెక్కింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్‌– 10 ఆంధ్ర గర్‌ల్స్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ సంయుక్తంగా అఖిల భారత మహిళా ట్రెక్కింగ్‌–3 పేరుతో శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తొమ్మిది ఎన్‌సీసీ గ్రూపులకు చెందిన కేడెట్లు ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం రెడ్డిరాజుల వారసత్వ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొండవీడుకోట చరిత్ర, ప్రాముఖ్యత గురించి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ఎస్‌.ఎం. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ శారీరక శక్తి పరీక్షతో పాటు చారిత్రక అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్‌ శిబిరంలో మహిళా కేడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.

దళితపేటల్లో సమస్యలపై ఆందోళనలు

లక్ష్మీపురం: దళితపేటల్లో సమస్యలపై సర్వే చేసి ఈ నెల 25వ తేదీలోపు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వాటి పరిష్కారం కోసం రౌండ్‌ టేబుల్‌ సమావేశాలతో పాటు సచివాలయాలు, మండల కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పిలుపునిచ్చారు. సంఘ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు అధ్యక్షతన విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ నేడు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి పేదలకు అందుబాటులో లేకుండా ఉన్నాయన్నారు. రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు, నిత్యవసర సరుకులను అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనులను వంద రోజులు కల్పించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ రాబోయే బడ్జెట్‌లో అయినా ఉపాధి హామీ పనులకు రూ.2 లక్షల కోట్లు కేటాయించి, కూలీలకు కనీస వేతనం రూ. 6 వందలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహిళా కన్వీనర్‌ బి. కోటేశ్వరి, నాయకులు జి.అజయ్‌, కాటమరాజు, మేరి, శివయ్య, నీలాంబరం పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ప్లంబర్‌ వర్క్‌పై ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణ సంస్థ (డీఎల్‌టీసీ) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.సాయివరప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టెన్త్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు, ఆధార్‌తో లింకై న మొబైల్‌ నంబరు వివరాలతో సంప్రదించాలని సూచించారు. ప్లంబర్‌ కోర్సు ద్వారా అపార్ట్‌మెంట్లు, గృహాల్లో పైప్‌ ఫిట్టింగ్‌ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమల్లో ఉపాధిని పొందవచ్చని తెలిపారు. వివరాలకు 80746 07278, 83339 73929 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

సంక్షేమ పాలనకు బాటలు వేసిన ఎన్టీఆర్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: సంక్షేమ పరిపాలనకు బాటలు వేసి ఎన్టీఆర్‌ స్ఫూర్తిదాయకంగా నిలిచారని జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. శనివారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా జెడ్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మహానాయకుడిని భావితరాలు అదర్శంగా తీసుకోవాలని క్రిస్టినా సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కొండవీడు కొండల్లో మహిళా కేడెట్ల ట్రెక్కింగ్‌ 1
1/2

కొండవీడు కొండల్లో మహిళా కేడెట్ల ట్రెక్కింగ్‌

కొండవీడు కొండల్లో మహిళా కేడెట్ల ట్రెక్కింగ్‌ 2
2/2

కొండవీడు కొండల్లో మహిళా కేడెట్ల ట్రెక్కింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement