హామీలు అమలు చేయకపోతే ఉద్యమం
తాడేపల్లి రూరల్ : ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం రైతు సంఘం కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. రైతు సంఘం అధ్యక్షుడు వి. కృష్ణయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ అన్నదాన సుఖీభవ పథకం కింద రూ. 20 వేలను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం అమలులో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే రైతు సంఘాలు, రైతుల కోసం పనిచేస్తున్న గ్రామీణ సంస్థలను కలుపుకుని రాష్ట్ర బంద్ చేస్తామని తెలిపారు. నాడు స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేడు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. ఉచిత పంటల బీమా అమలు చేయాలని, ట్రూ అప్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విజన్– 2047 పేరుతో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment