ఎన్నారైలకు పూలబాట
తెనాలి: ప్రవాస భారతీయులు స్వదేశంలో సమాజ సేవకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. పార్టీల కతీతంగా మంచి చేస్తామని వచ్చేవారికి తామే దగ్గరుండి పూలబాట వేస్తామని చెప్పారు. తెనాలి రూరల్ మండల గ్రామం నందివెలుగులోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు గత ప్రభుత్వంలో కేటాయించిన నిధులకు తోడు దాతల సహకారంతో పూర్తిచేసిన భవన సముదాయం, అదనపు సౌకర్యాలను శనివారం ప్రారంభించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాఠశాల భవనసముదాయాన్ని ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇతర అతిథులు తరగతి గదులను ప్రారంభించారు. సభలో మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువునని గుర్తు చేశారు. ఎంత చదువుకున్నా సంస్కారం ముఖ్యమన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల భాగస్వామ్యం ఉంటే అభివృద్ధి పనులు ఎంత సుందరంగా ఉంటాయని చెప్పేందుకు నందివెలుగు హైస్కూలు నిదర్శనమని తెలిపారు. హైస్కూలు నిర్మాణానికి రూ.40 లక్షలకు పైగా విరాళమిచ్చిన దాత ధూళిపాళ్ల సుధాకర్–మాధురి దంపతులు మాట్లాడారు. మరో దాత, తెనాలి డబుల్‌హార్స్ ఎండీ మునగాల మోహన్‌శ్యాంప్రసాద్, గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల వపన్‌కుమార్, ప్రధానోపాధ్యాయిని శివపార్వతి మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్నారై కృష్ణ, నన్నపనేని లింగారావు, వంగా సాంబిరెడ్డి, నన్నపనేని సుధాకర్, విద్యా కమిటీ చైర్మన్ డి.సురేంద్ర, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, పంచాయతీరాజ్ అధికారి బ్రహ్మయ్య, ఈపూరు రామయ్య, ఎంఈవో మేకల లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, మేము సైతం టీమ్ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి
గుంటూరు వెస్ట్ : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమష్టి కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో అనేక అభివృద్ధి పనులకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని తెలిపారు. దీనిలో భాగంగా నందివెలుగు రోడ్డులోని ఫ్లైఓవర్‌కు గతంలో రూ. 10 కోట్లు ఖర్చు పెట్టారని, మళ్లీ అదనంగా రూ. 20 కోట్లు ఉంటే బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు రైల్వే అధికారులకు తెలిపామని పేర్కొన్నారు. శ్యామలానగర్ బ్రిడ్జిని రెండు లైనులుగా నిర్మించనున్నామన్నారు. దీంతోపాటు మంగళగిరి, పెదపలకలూరు బ్రిడ్జిల నిర్మాణాలకు కూడా రెండు మూడు వారాల్లో డీపీఆర్‌లు సిద్ధం చేస్తామని వెల్లడించారు. రైల్వే బ్రిడ్జి నిర్మాణాలకు రూ. 110 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపు
Comments
Please login to add a commentAdd a comment