వీధి దీపాల మరమ్మతు చేపట్టాలి
నగర మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : వీధి దీపాల నిర్వహణలో అలసత్వాన్ని సహించేది లేదని, వెంటనే మరమ్మతు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. నగరంలో వీధి దీపాలు వెలగకపోవడంపై సోమవారం ‘సాక్షి’లో ‘అంధ’మైన నగరం శీర్షిఖన ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య వాహనాల మరమ్మతులపై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈఈఎస్‌ఎల్ నిర్వాహకులతో మేయర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరిధిలో 83,750 వీధి దీపాలు ఏర్పాటుచేసి నిర్వహణ బాధ్యతలు ఈఈఎస్‌ఎల్ చూసుకుంటోందన్నారు. వారు సక్రమంగా వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్‌లు నిర్వహించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులు, కాలనీలు, ముఖ్యంగా విలీన గ్రామాల్లో అన్ని వీధి దీపాలు వెలిగేలా చూడాల్సిన బాధ్యతపై ఈఈ ఎస్‌ఎల్‌పై ఉందన్నారు. ప్రస్తుతం వెలగని 5 వేలకు పైచిలుకు వీధి దీపాల స్థానంలో కొత్తవి తక్షణమే అమర్చి వెలగేలా చూడాలని ఆదేశించారు. పారిశుద్ధ్య వాహనాల పార్కింగ్ కోసం పోతన ల్యాండ్రో మార్ట్ పక్కన, బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద ఖాళీ స్థలాల్లో చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజిరెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేష్ ఈఈ మహేందర్, డీఈలు శివానంద్, సారంగం, ఈఈఎస్‌ఎల్ బాధ్యుడు రమేష్ పాల్గొన్నారు.
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదు
బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే
నగరంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదని, ఏ రోజుకు ఆ రోజు చెత్త ఇంటింటా సేకరించాల్సిందేనని కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే.. అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్యం, ఉద్యాన అధికారులతో వేర్వేరుగా కమిషనర్ సమావేశమై పలు సూచనలు చేశారు. నగర వ్యాప్తంగా 27 పార్కుల్లో దెబ్బతిన్న వివిధ అభివృద్ధి చేట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యానవన, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సిబ్బంది సమన్వయంతో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. జిమ్ పరికరాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఇందుకు వాకర్స్ అసోసియేషన్ల సహకారం తీసుకోవాలన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం మేరకు కోట చెరువు ప్రాంతంలో గ్రీనరీ ఏర్పాటుచేయడానికి రెండు వరుసల్లో మొక్కలను నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు రమేష్, లక్ష్మారెడ్డి తోపాటు ఈఈ మహేందర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు ప్రిన్సి, అశ్విని, అనూహ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
‘ఆపరేషన్ స్మైల్’ను విజయవంతం చేయాలి
వరంగల్ క్రైం: అన్ని శాఖల అఽధికారులు సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ రవి పిలుపునిచ్చారు. మంగళవారం సుబేదారిలోని అసుంత భవన్‌లో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అధికారులు, ఎన్జీవోలతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లుగా తప్పిపోయిన, బాలకార్మికులను చేరదీయడానికి ఆపరేషన్ స్మైల్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 1 నుంచి 31 వరకు కమిషనరేట్ పరిధిలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్‌తోపాటు ఆపరేషన్ ముష్కరణ కార్యక్రమాలను 18 ఏళ్ల లోపు బాల బాలికలను రక్షించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, డీఎంహెచ్‌ఓ అప్పయ్య , సీఐడీ డీఎస్పీ జితేందర్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్లు కె.వసుధ, కె.దామోదర్, ఉప్పలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment