హసన్‌పర్తి: న్యూ ఇయర్ వేడుకల పేరిట యువకులు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈఘటన గుండ్లసింగారం సమీపంలోని ఓప్రైవేట్ హాస్టల్‌లో మంగళవారం రాత్రి జరిగింది. కాకతీయ యూనివర్సిటీ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 70 మంది విద్యార్థులు గుండ్లసింగారం సమీపంలోని సరస్వతి ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నారు. అదే హాస్టల్ భవనం పైఅంతస్తులు హాస్టల్ యజమాని నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని హాస్టల్ యజమాని కుమారుడు సాయి కౌశిక్ తన స్నేహితులతో కలిసి పైఅంతస్తులో విందు ఏర్పాటు చేసుకున్నాడు. తప్పతాగిన తర్వాత పైఅంతస్తు నుంచి అసభ్యకరంగా ప్రవర్తనలు చేయడంతో విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులకు గురయ్యారు. దీంతో విద్యార్థినులు తమ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విద్యార్థులు అక్కడికి చేరుకుని న్యూసెన్స్ చేస్తున్న వారిని మందలించారు.
పిలిచి దాడి చేశారు..
బుధవారం రాత్రి వచ్చిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను ఇంటి యజమాని కుమారుడితో పాటు మరో ఐదుగురు యువకులు మాట్లాడాలని చెప్పి ఫోన్ చేసి పిలిచారు. అక్కడికి చేరుకున్న వారిపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా బైక్‌ను లాక్కున్నారు. ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సై రవీందర్ ఘటనా స్థలికి చేరుకున్నారు. తమను పిలిచి దాడి చేయడమే కాకుండా బైక్‌ను లాక్కున్నారని విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయికౌశిక్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. కాగా.. మహిళా హాస్టల్‌కు ఇది సరైన ప్రదేశం కాదని, సాధ్యమైనంత త్వరగా హాస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు విద్యార్థినులకు సూచించారు.
యువకుల అసభ్యకర ప్రవర్తన
పోలీసులకు ఫిర్యాదు చేసిన
హాస్టల్ విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment