ఉధృతం! | - | Sakshi
Sakshi News home page

ఉధృతం!

Published Tue, Oct 1 2024 8:28 PM | Last Updated on Tue, Oct 1 2024 8:28 PM

ఉధృతం

ఉధృతం!

మూసీపై రీ సర్వే చేస్తే సహకరిస్తాం – మజ్లిస్‌ ఎమ్మెల్యేలు
మజ్లిస్‌కు తలనొప్పి!
దుమ్మెత్తి పోస్తున్న మూసీ బాధితులు

సాక్షి, సిటీబ్యూరో: మూసీ పరీవాహక నివాసితుల ఆందోళన ఉధృతమవుతోంది. ఏకంగా కలెక్టరేట్‌, తహసీల్‌ ఆఫీసుల ముందు ధర్నాలకు దిగుతున్నారు. ఇళ్ల కూల్చివేతలకు పాల్పడకుండా మూసీ అభివృద్ధి చేయాలంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తున్నారు. సీఎం, ప్రజాప్రతినిధులపై దుమ్మెత్తి పోస్తున్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారి ఆందోళనకు రాజకీయ పక్షాలు కలిసి వచ్చి బాసటగా నిలుస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకు ఇళ్లపై మార్కింగ్‌కు వచ్చిన అధికారులను అడ్డుకున్న నివాసితులు..తాజాగా మూసీ నిర్వాసితుల సంఘాల పేరిట ఏరియాల వారీగా ఆందోళనలనకు దిగుతున్నారు.

కలెక్టరేట్‌ ముందు..

మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్ల కూల్చివేత ప్రతిపాదనను విరమించుకోవాలని మూసీ నిర్వాసితుల సంఘం పేరుతో సోమవారం లక్డీకాపూల్‌లోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు సీపీఎం మద్దతు ప్రకటించింది. ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో తమ ఇళ్లను కూల్చి అభివృద్ధి చేస్తామనడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు. అష్టకష్టాలు పడి డబ్బులు పెట్టి ఇండ్లను నిర్మించుకున్నామని, రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని వారు వాపోతున్నాయి. కానీ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, మూసీరివర్‌ బెడ్‌ అని చెప్పి తమ ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగర నడిబొడ్డు నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో పునరావాసం పేరిట డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తారా? అని ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు.

బహదూర్‌పురాలో..

బహదూర్‌పురా తహసీల్దార్‌ కార్యాలయం ముందు మూసీ నివాసితులు మజ్లిస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. హైడ్రా హటావో..ఘర్‌ బచావో అనే నినాదంతో పెద్ద ఎత్తున ధర్నాకు దిగి నినాదాలు చేశారు. ఫలితంగా రోడ్డుపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మజ్లిస్‌ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు.

లంగర్‌హౌస్‌: ఏరియల్‌ సర్వే కాకుండా రివర్‌ బెడ్‌ ఆధారంగా మరోసారి సర్వే చేస్తే తామంతా మూసీ ప్రక్షాళనకు సహకరిస్తామని మజ్లిస్‌ ఎమ్మెల్యేలు తెలిపారు. లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ను సోమవారం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సందర్శించారు. విషయం తెలుసుకున్న మజ్లిస్‌ ఎమ్మెల్యేలు కౌసర్‌ మొహినుద్దీన్‌, మీర్‌ జుల్ఫీకర్‌ అలీ, మహమ్మద్‌ ముబిన్‌లు అక్కడకు వచ్చి కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కలెక్టర్‌తో మాట్లాడుతూ నిజాం నవాబులకు ముందు కాలంలో మూసీ సరిహద్దులు, రివర్‌ బెడ్‌కు సంబంధించి పాతిన రాళ్లు ఇప్పటికీ మూసీలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం మూసీ ప్రక్షాళనకు చేసిన ఏరియల్‌ సర్వే వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందన్నారు. మూసీలో రివర్‌ బెడ్‌ ఆధారంగా మరోసారి సర్వే నిర్వహిస్తే తాము మూసీ ప్రక్షాళనకు పూర్తిగా సహకరిస్తామన్నారు. నేరుగా జరిపే ఈ సర్వేకు ఏరియల్‌ సర్వేకు 15 నుండి 20 మీటర్ల వ్యత్యాసం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సర్వే చేస్తే చాలా కుటుంబాలకు మేలు చేసిన వారమవుతామన్నారు. తమ డిమాండ్‌ మేరకు సర్వే చేయకుండా బుల్డోజర్‌లు పంపిస్తే తమ ప్రాణాలు అడ్డుపెడతామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఈ విషయమై చర్చించి నిర్ణయం వెల్లడిస్తామన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: మూసీ పరిధిలోని ఇళ్ల మార్కింగ్‌, కూల్చివేతల వ్యవహారం మజ్లిస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. మజ్లిస్‌ పార్టీ ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే మూసీ పరీవాహక ప్రాంతాలు అధికంగా ఉండటంతో నివాసితుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. మూసీ ప్రక్షాళన పేరుతో నదీగర్భం, బఫర్‌ జోన్‌ పరిధిలోని ఇళ్ల కూల్చివేత కోసం అధికార యంత్రాంగం రెడ్‌మార్క్‌ సూచిక వేయడంతో నివాసితులు ఆందోళనకు దిగి అధికారులును అడుగడుగునా అడ్డుకున్నారు. ఇళ్లపై రెడ్‌మార్క్‌ వేసే సమయంలో మజ్లిస్‌ పార్టీ బాధ్యులెవరూ అటువైపు కన్నెత్తి చూడక పోవడంతో బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్థానిక ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల ఆవేదన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో మజ్లిస్‌ పార్టీ మూసీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. మజ్లిస్‌ ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ అందే విధంగా ప్రయత్నిస్తామని భరోసా కల్పించడంలో కొంత సఫలీకృతమయ్యారు.

14 మండలాల్లో సగానికి పైగా ఇక్కడే..

మూసీ పరీవాహక పరిధిలోని మొత్తం 14 మండలాల్లో సగానికిపైగా మండలాలు పాతబస్తీ పరిధిలోనే ఉన్నాయి. మజ్లిస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో ఆసిఫ్‌నగర్‌, బహదూర్‌పురా, చార్మినార్‌, గోల్కొండ, నాంపల్లి, సైదాబాద్‌, రాజేంద్రనగర్‌ తదితర మండలాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం గుర్తించిన 12 వేల గృహాల్లో 70 శాతం వరకు వీటిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నివాసితులకు మద్దతుగా మజ్లిస్‌ కార్పొరేటర్లు తహసీల్‌ ఆఫీసుల ముందు ఆందోళనకు దిగుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఉధృతం!1
1/1

ఉధృతం!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement