ఆ తర్వాత నిర్మించిన అక్రమ కట్టడాలనే కూల్చివేస్తాం
మోతీనగర్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుందనే అంశంపై కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది జూలైలో హైడ్రా ఏర్పాటైందని, ఆ తర్వాత నిర్మించిన అక్రమ నిర్మాణాలపైనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దానికి ముందు నిర్మించిన నివాసాలు సక్రమమైనా, అక్రమమైనా వాటి జోలికి హైడ్రా వెళ్లదని పునరుద్ఘాటించారు. అయితే.. ఇది వాణిజ్య సముదాయాలకు వర్తించదన్నారు. మంగళవారం మూసాపేటలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కాముని చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అవాంతరాలను తొలగించటానికి హైడ్రా సహకారం కావాలని హెచ్‌ఎండీఏ కోరింది. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ‘కాముని చెరువులో నిర్మాణ వ్యర్థాలతో పాటు మట్టిని నింపి కొంతమంది ఆక్రమిస్తున్నారు. అదేమంటే పట్టా భూములని చెబుతున్నారు. ఈ చెరువులకు అనుసంధానంగా ఉండే కాలువల కబ్జాపైనా ఫిర్యాదులు అందడంలో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం. కాముని చెరువులో మట్టిపోసిన వారిని వదిలి పెట్టేది లేదు. నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తాం. చెరువు కబ్జాపై స్థానికులు సంఘటితమై ఫిర్యాదు చేయటమే కాకుండా చెరువును కాపాడటంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తామని ముందుకు వచ్చారు.
పేదల ఇళ్ల జోలికి వెళ్లం. భవిష్యత్తులో చెరువులు, కుంటలు, నాలాల్లో అక్రమంగా నిర్మించే ఏ కట్టడమైనా కూల్చివేస్తాం. ఇప్పటికే ఈ చెరువులను ఆనుకుని కట్టిన నిర్మాణాలను కదిలించబోం. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మి, అఘాయిత్యాలకు పాల్పడవద్దు’ అని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా కాకుండా స్థానికులే కాపాడుకోవాలని రంగనాథ్ సూచించారు. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువు వరకు వరద కాలువ పనులు పూర్తి కాకుండా అక్కడ ఓ భవన నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టింది. దీన్ని గమనించిన రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 మీటర్ల వెడల్పుతో నిర్మించతలపెట్టిన వరద నీటి కాలువ పనులను తక్షణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు సూచించారు. వరద కాలువను మళ్లించటం వల్ల దిగువన ఉన్న సఫ్దర్‌నగర్, రాజీవ్ గాంధీనగర్ బస్తీలు వర్షాకాలంలో మునిగి పోతున్నాయని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే వర్షాకాలానికి ఇబ్బంది లేకుండా కాముని చెరువు, మైసమ్మ చెరువు మధ్య ఉన్న వరద కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసేలా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
కాముని చెరువు, మైసమ్మ చెరువుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment