వసతులు బ్లాక్‌ను నివాసిత సంఘానికి అప్పజెప్పాల్సిందే
సాక్షి, సిటీబ్యూరో: నివాసిత సంఘానికి చెందాల్సిన క్లబ్ హౌస్‌లను డెవలపర్లు కబ్జా చేస్తున్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ (టీజీ–రెరా) చట్టం ప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన మూడు నెలల్లోపు క్లబ్ హౌస్‌ను రెసిడెంట్స్ అసోసియేషన్‌కు అప్పగించాలి. కానీ.. చాలా మంది బిల్డర్లు రెరా నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అక్రమ మార్గంలో క్లబ్ హౌస్‌లను థర్డ్ పార్టీకి లీజుకు లేదా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో న్యాయం చేయండంటూ నివాసిత సంఘాలు రెరాను ఆశ్రయిస్తున్నాయి.
డెవలపర్ల జేబుల్లోకి డబ్బులు..
జీఓ 168 ప్రకారం వంద యూనిట్లకు పైగా ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో వసతుల కోసం మొత్తం బిల్టప్ ఏరియాలో 3 శాతం లేదా 50 వేల చ.అ. (ఏది తక్కువైతే అది) కేటాయించాలి. క్లబ్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా, బాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్ వంటి వసతులు ఉంటాయి. క్లబ్ హౌస్‌ను నివాసిత సంఘానికి రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్య హక్కులను అప్పజెప్పాలి. కానీ.. డెవలపర్లు తెలివిగా నివాసితులకు కేవలం క్లబ్ హౌస్‌లోని వసతులను వినియోగించుకునేందుకు సభ్యత్వం ఇచ్చి సరిపెట్టేస్తున్నారు. క్లబ్ హౌస్‌ను థర్డ్ పార్టీకి లీజుకు లేదా విక్రయిస్తున్నారు. ఆయా సొమ్మును డెవలపర్లే జేబులో వేసుకుంటున్నారు.
ఒకటే క్లబ్ హౌస్ రెండు ప్రాజెక్ట్‌లకు..
రెరా సెక్షన్ 17 ప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన మూడు నెలల్లోపు డెవలపర్లు వసతుల బ్లాక్‌ను రెసిడెంట్స్ అసోసియేషన్‌కు చట్టబద్ధంగా అప్పగించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వారు వీటిని అతిక్రమిస్తున్నారు. క్లబ్ హౌస్ బ్లాక్‌ను థర్డ్ పార్టీకి లీజుకు లేదా విక్రయిస్తున్నారు. కొందరు బిల్డర్లు క్లబ్ హౌస్‌ను ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ.. థర్డ్ పార్టీకి వినియోగించేందుకు వీలుగా ఉండేలా ప్రధాన మార్గానికి యాక్సెస్ ఉన్న ప్రాంతంలోనే నిర్మిస్తున్నారు. ఒకే క్లబ్ హౌస్‌ను రెండు ప్రాజెక్ట్‌లకు కలిపి వాడుతున్నారు.
నిర్వహణ వ్యయం కార్పస్ ఫండ్ నుంచే..
అపార్ట్‌మెంట్ కొనుగోలు సమయంలో కస్టమర్ల నుంచి వసూలు చేసే కార్పస్ ఫండ్‌ను బిల్డర్లు సొంతానికి వినియోగించుకోకూడదు. ఆ సొమ్మును వడ్డీతో సహా అసోసియేషన్‌కు ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి జమ చేయాలి. క్లబ్ హౌస్‌లో రెస్టారెంట్, బార్ వంటి వాణిజ్య సముదాయాలను నిర్మించి, వాటిని థర్డ్ పార్టీకి లీజుకు లేదా విక్రయిస్తున్నారు. క్లబ్ హౌస్ నిర్వహణ వ్యయాన్ని కూడా డెవలపర్లు అక్రమంగా కస్టమర్ల నుంచి వసూలు చేసిన కార్పస్ ఫండ్ నుంచే ఖర్చు చేస్తున్నారు.
క్లబ్ హౌస్ యజమానుల హక్కు
ఇంటి యజమానులకు సౌకర్యాలను వినియోగించుకునే హక్కు ఉంటుంది. డెవలపర్లు కస్టమర్లకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. వ్యాపార ప్రయోజనాల కోసం క్లబ్ హౌస్ స్థలాలను వినియోగించడం చట్ట విరుద్ధం. ఈ తరహా కేసులలో కస్టమర్లకు న్యాయం జరిగేలా రెరా తగిన చర్యలు తీసుకుంటుంది.
– కె.శ్రీనివాస రావు, టీజీ– రెరా సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment