నిమ్స్.. అభివృద్ధి అదుర్స్!
కొత్త భవనాలతో మరింత బాధ్యత
సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చొరవతో నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నూతన భవనాలు, అత్యాధునిక వసతుల కల్పనతో రోగుల్లో నమ్మకం పెరిగింది. ప్రస్తుత పడకలకు అదనంగా మరో 2 వేల పడకల భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నిమ్స్‌లో పడకల సంఖ్య సుమారు 4 వేలకు చేరనుంది. కొత్త భవనాలతో మాపై బాధ్యత మరింత పెరుగుతుంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాం. 4 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటళ్ల జాబితాలో నిమ్స్ చేరనుంది. – ప్రొ.నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్
లక్డీకాపూల్: నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రూ.1,678 కోట్ల వ్యయంతో 32.16 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం నిమ్స్‌లో అకడమిక్స్, ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్‌తో పాటు 30కి పైగా విభాగాలు ఉన్నాయి. గుండె, మూత్రపిండాలు, మెదడు, కాలేయం, కేన్సర్, అత్యవసర విభాగం, ట్రామా, ఆర్థోపెడిక్ తదితర 42 విభాగాలకు సంబంధించి నూతన భవనాలు సమకూర్చనున్నారు. నూతన భవనాలు అందుబాటులోకి వస్తే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పీజీ సీట్లు పెరుగుతాయి. ఆయా స్పెషాలిటీ విభాగాల్లో నర్సింగ్ సేవల్లోనూ ప్రత్యేక శిక్షణ పొందుతారు. ఇప్పటికే నిమ్స్‌లో ౖకార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, వాస్కులర్ సర్జరీ, యూరాలజీ, రుమటాలజీ, క్రిటికల్ కేర్, డయాగ్నొస్టిక్ వంటి విభాగాలు ఉన్నాయి. ఆంకాలజీ విభాగంలో మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ, క్యాథ్ ల్యాబ్, డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక వైద్య విద్య విషయానికి వస్తే.. 14 స్పెషాలిటీ విభాగాలతో పాటు 23 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీలలో నర్సింగ్, పారా మెడికల్, అల్లైడ్ హెల్త్ సైన్సెస్‌కు సంబంధించిన సంస్థలు కొనసాగుతున్నాయి.
4 బ్లాక్‌ల్లో కొత్త భవనాలు..
బిల్టప్ ఏరియా 23,96,542.34 చ.అ. విస్తీరణంలో 4 బ్లాక్‌లను నిర్మించనున్నారు. 8 అంతస్తుల బ్లాక్–ఏలో అవుట్ పేషెంట్ విభాగం (ఓపీడీ), 13 అంతస్తుల బీ–బ్లాక్‌లో ఇన్‌పేషెంట్ విభాగం, 8 అంతస్తుల సీ–బ్లాక్‌లో ఎమర్జెన్సీ విభాగం, 14 అంతస్తుల బ్లాక్–డీలో ఐపీడీ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తంగా 2 వేల ఆక్సిజన్ పడకలతో పాటు 120 ఓపీడీ చాంబర్లు, 500 ఐసీయూ పడకలు, 300 పేయింగ్ రూమ్‌లతో పాటు 38 మాడ్యులర్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఏ బ్లాక్, బీ బ్లాక్ భవన సదుపాయాలు మొదటి అంతస్తుల స్లాబ్ నిర్మాణం పురోగతిలో ఉంది. సీ బ్లాక్ భవనం నిర్మాణ పనులలో తవ్వకం పనులు పూర్తయ్యాయి. భూగర్భ డ్రైనేజీ, నీటి లైన్లను నిర్మించారు. బ్లాక్ డిలో నాలుగు అంతస్తుల స్లాబ్ నిర్మాణం పూర్తయింది. సర్వీస్ బ్లాక్‌కు సంబంధించి కూడా తవ్వకం పనులు పురోగతిలో ఉన్నాయి. సెక్టార్– 3లో టీజీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్‌ఎం నిధుల కింద 200 పడకల ఎంసీహెచ్ ఆస్పత్రి భవన సదుపాయా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సెక్టార్–4లో ఆలయం, మసీదు, పాఠశాలలు వంటి నిర్మాణాల పునరావాస చర్యలు సాగుతున్నాయి. ఇందులో ఆలయ నిర్మాణం ఇప్పటికే 50 శాతం మేరకు పూర్తయింది. పాఠశాల భవన నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. సెక్టార్–5లో నిమ్స్ కోసం ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు.
రూ.1,678 కోట్ల వ్యయంతో విస్తరణ
చురుగ్గా కొనసాగుతున్న పనులు
32.16 ఎకరాల్లో 4 బ్లాక్‌ల నిర్మాణం
2,000 పడకలు.. 500 ఐసీయూ బెడ్లు
300 పేయింగ్ గదులు
38 మాడ్యులర్ థియేటర్లు
రోగులకు మరింత మెరుగైన వైద్యం
Comments
Please login to add a commentAdd a comment