పనులు త్వరలో
మెట్రో రెండో దశ
అమీర్‌పేట: మెట్రో రెండో దశ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, స్థలాలు ఇచ్చేవారికి గజానికి రూ.81 వేలు ఇస్తామని హైదరాబాద్ కలెక్టర్ ఇప్పటికే ప్రకటించినట్లు మెట్రోలైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులకు చివరి మైలు కనెక్టివిటీ మెరుగుపర్చేందుకు ర్యాపిడోతో భాగస్వామ్యం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం అమీర్‌పేట హోటల్ గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ హోటల్‌లో అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 76 కిలో మీటర్ల వరకు రెండో దశ మెట్రో పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని, కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు చేపడతామన్నారు. పాత బస్తీకి మెట్రో రైలు సౌకర్యం కల్పించాలనే డిమాండ్ పెరిగిందని, భూసేకరణ కోసం 1,100 ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. స్థలాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారికి 10 రోజుల్లో చెక్కులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
నిత్యం 5 లక్షల మంది మెట్రో జర్నీ
నగరంలో ప్రతి రోజూ 5 లక్షల మంది వరకు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. లక్ష మంది ప్రయాణికులకైనా బస్సు, ర్యాపిడో ద్వారా కనెక్టివిటీ కల్పించాలని భావిస్తున్నామన్నారు. ఆటోల్లో ప్రయాణ ఖర్చులు ఎక్కువ అవుతున్న తరుణంలో ర్యాపిడో కేవలం 3 కిలోమీటర్ల వరకు రూ.30 మాత్రమే చార్జి చేయడం సంతోషదాయకమన్నారు.
భూ బాధితులకు గజానికి రూ.81 వేల పరిహారం
ప్రయాణికులకు చివరి మైలు కనెక్టివిటీకి చర్యలు
ర్యాపిడోతో భాగస్వామ్యం: మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి
మహిళా ప్రయాణికుల భద్రతపై రాజీ లేదు..
బైక్ టాక్సీలతో మహిళా ప్రయాణికులు సునాయాస ప్రయాణం చేసేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, భద్రత విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. సమస్య తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆకతాయిలను పట్టుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబర్‌ను సైతం అందుబాటులోకి తీస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ, ఎల్‌టీహెచ్‌ఆర్‌ఎంఎల్ సీఎస్‌ఓ మురళీ వరదరాజన్, రాపిడో సీఎంఓ పవన్‌దీప్ సింగ్, సందీప్ మండల్, రిషి కుమార్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment