చిన్నారుల పరిరక్షణే ధ్యేయంగా
చిన్నారుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలి
● పిల్లల హక్కులు, చట్టాల పరిరక్షణకు పటిష్ట చర్యలు
● స్ట్రీట్ వెండర్స్ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు
● జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సాక్షి,సిటీబ్యూరో: జిల్లాలో బాల్యం నుంచి పక్కదారి పట్టిన పిల్లలను ఆపరేషన్ స్మైల్‌లో గుర్తించి వారి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. వారి తల్లిదండ్రులకు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ‘కన్వర్జెన్స్ ఆన్ ఆపరేషన్ స్మైల్ గీఐ’ సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల హక్కులు, చట్టాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో భిక్షాటన చేస్తున్న పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలకు విద్య అందించడంతో పాటు వారి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వారి పరిస్థితి ఇలా మారడానికి కారణాలేమిటో పరిశీలించాలని సూచించారు. హాట్ స్పాట్ ఏరియాల్లో గస్తీ ఏర్పాటు చేసి రోడ్లపైకి వచ్చే పిల్లలను గుర్తించాలని, వారి ఆధార్, ఇతర డాక్యుమెంట్లు సేకరించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, 14 నుంచి 18 ఏళ్ల లోపు బాల కార్మికులను రక్షించి సంబంధిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి, పిల్లలకు నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. జిల్లాను 28 జోన్లుగా విభజించి ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల ద్వారా పిల్లల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రీట్ వెండర్లు తమ పిల్లలతో వ్యాపారం చేయించడం నేరమని, ఇందులో భాగంగా వారి తల్లిదండ్రులతో బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున పనుల్లో ఉన్న పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య, ఆహారం అందించాలని సూచించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శైలజ, డీసీపీ లావణ్య, ఐసీడీఎస్ పీడీ అక్కేశ్వరరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి జాన్సన్, ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment